అర్జీలను గడువు లోపు పరిష్కరించాలి: కలెక్టర్
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:11 PM
ప్రజా సమస్యలను సీరియస్‌గా తీసుకోవాలని, వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను సీరియస్‌గా తీసుకోవాలని, వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సంతృప్తి స్థాయిలో పెరిగేలా అర్జీల పరిష్కారం ఉండాలన్నారు. అర్జీలను పరిష్కరించే సమయంలో అర్జీదారునితో వ్యక్తిగతంగా మాట్లాడితే నాణ్యతగా పరిష్కారం ఉంటుందని సూచించారు. పీజీఆర్‌ఎస్ లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ లాగిన్‌లో పరిష్కారం చేసిన అర్జీల నాణ్యతను ఆడిట్ చేయాలన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 12, పత్తికొండ ఆర్డీవో వద్ద 6, కర్నూలు ఆర్డీవో వద్ద 8, కలెక్టరేట్ ఏవో వద్ద 3, సర్వే ఏడీ, హౌసింగ్ పీడీ, డీఆర్‌డీఏ పీడీల వద్ద ఒక్కొక్క దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో జేసీ బి.నవ్య, డీఆర్వో వెంకట నారాయణమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.