అనుమతులు తప్పనిసరి : డీఎంహెచ్‌వో
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:19 PM
స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటే వైద్య, ఆరోగ్యశాఖ అనుమతులు తప్పనిసరి అని డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ తెలిపారు.
నంద్యాల హాస్పిటల్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలంటే వైద్య, ఆరోగ్యశాఖ అనుమతులు తప్పనిసరి అని డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశాన్ని డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో వెంకటరమణ మాట్లాడుతూ కొత్త స్కానింగ్ సెంటర్లు జిల్లా కమిటీవద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి ఒక నెల ముందే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుతో పాటు రెన్యువల్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల నుంచే స్కానింగ్ మిషన్లు కొనుగోలు చేయాలన్నారు. చట్టవ్యతిరేకంగా పరీక్షలు చేసిన వైద్యులపై చర్యలు తప్పవన్నారు. లింగనిర్ధారణ నిషేధ చట్టంపై జిల్లాలో ఐసీడీఎస్, మహిళాసంఘాలు, పోలీసుల సహకారంతో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ జయరాం, మదర్‌హర్ సెల్ప్ సొసైటీ డాక్టర్ రాజశేఖర్, ఇన్‌చార్జి డెమో రవీంద్రనాయక్, వంశి తదితరులు పాల్గొన్నారు.