దొంగతనాలతో ప్రజల బెంబేలు
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:46 PM
వరస దొంగతనాలతో నంద్యాలలోని ఎస్సార్బీసీ వద్ద ఉన్న టిడ్కో గృహాల నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు.
నంద్యాల టిడ్కో గృహాలపై దొంగల కన్ను
రాత్రి సమయంలో విద్యుత్ వైర్లు, మీటర్లు చోరీ
పట్టించుకోని పురపాలక, పోలీసు అధికారులు
వరస దొంగతనాలతో నంద్యాలలోని ఎస్సార్బీసీ వద్ద ఉన్న టిడ్కో గృహాల నివాసితులు బెంబేలెత్తిపోతున్నారు. గృహాల కోసం ఏర్పాటు చేసిన మీటర్లు, వైర్లను ముఖ్యంగా ఖాళీ గృహాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు రాత్రికి రాత్రే చోరీ చేస్తున్నారు. అక్కడ 1200 గృహాలు ఉండగా.. కేవలం 120 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. చాలా ఇళ్లలో ప్రజలు నివాసం లేరు. దీంతో ఇదే అదునుగా భావించిన దొంగలు ఇలాంటి ఇళ్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను ఎత్తుకెళ్తున్నారు. నిత్యం దొంగతనాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
నంద్యాల టౌన్, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్సార్బీసీ వద్ద ఉన్న టిడ్కో గృహాల్లో ఇటీవల దొంగతనాలు నిత్యం జరుగుతున్నాయి. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు, మీటర్లను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీంతో చాలా గృహాల్లో విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.4 లక్షలు విలువ చేసే వైర్లు, మీటర్లను ఎత్తికెళ్లినట్లు సమాచారం.
120 కుటుంబాలు నివాసం
ఎస్సార్బీసీ కాలనీలోని టిడ్కో సముదాయంలో 1200 వరకు నివాస గృహాలు ఉండగా.. 120 కుటుంబాలు నివా సం ఉంటున్నాయి. ఈ గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పిం చడం కోసం వైరింగ్ చేశారు. అయితే దొంగలు వెనుక నుంచి మీటర్ల వద్ద జంక్షన్ బాక్సు వద్ద వైర్లను కట్ చేసి ఖాళీగా ఉన్న ఇళ్లలోకి చొరబడి వైర్లను ఎత్తుకెళ్తున్నారు. ఇలా దొంగలు తీగలు కట్ చేయడంతో అక్కడ నివాసం ఉండేవారు భయబ్రాంతులకు గురవుతున్నారు.
పట్టించుకోని పోలీసులు, పురపాలక అఽధికారులు
ఇళ్లల్లో దొంగతనాలు జరుగుతున్నాయని 20 రోజుల నుంచి పురపాలక అఽధికారులకు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పగా.. తామే చెబుతామని పురపాలక అధికారులు అంటున్నారని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్న వాచ్‌మన్ నిఘా కొరవడం కూడా దొంగతనాలకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో పోలీసులు గస్తీ చేపట్టాలని కోరుతున్నారు.
పట్టణంలోని దుకాణాల్లో విక్రయం?
నంద్యాలలో ఇలా దొంగతనంగా తీసుకువచ్చిన వాటిని కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు ఉన్నాయి. వాటిలో సాయిబాబా నగర్‌లోని ఒక దుకాణం, నంద్యాల పట్టణ శివారుల్లో ఒక దుకాణం ఉన్నట్లు సమాచారం. దీంతో అక్కడ ఎటువంటి వస్తువులైనా, వైర్, ఇనుము, కాపర్ వాటిని వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నాం
రెండు వారాలుగా దొంగలు రాత్రి సమయంలో వస్తున్నారు. దీంతో ఒంటరిగా ఉండాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-దస్తగిరమ్మ, టిడ్కో నివాసి, నంద్యాల
చర్యలు తీసుకుంటాం
టిడ్కో ఇళ్లల్లో జరిగే దొంగతనాలతో అక్కడి జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ సెక్యూరీటి పెంచి వారికి రక్షణ కల్పిస్తాం. అలాగే ఈ దొంగతనాలపై కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాత్రి సమయంలో గస్తీ కూడా పెంచాలని కోరాం.
-బండి శేషన్న, మున్సిపల్ కమిషనర్ నంద్యాల