పెండింగ్‌లో గౌరవ వేతనం
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:02 AM
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేసే అతిథి అధ్యాపకులు (గెస్టు ఫ్యాకల్టీ)కి గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో అతిథి అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులతో బోధనపై దృష్టి పెట్టలేక సతమతమవుతున్నారు.
ఆరు నెలలుగా అతిథి అధ్యాపకుల ఆవేదన
జిల్లాలో 50 మంది గెస్టు ఫ్యాకల్టీ
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేసే అతిథి అధ్యాపకులు (గెస్టు ఫ్యాకల్టీ)కి గౌరవ వేతనాలు ఇవ్వడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీంతో అతిథి అధ్యాపకులు ఆర్థిక ఇబ్బందులతో బోధనపై దృష్టి పెట్టలేక సతమతమవుతున్నారు. కర్నూలు జిల్లాలో 23 జూనియర్ కళాశాలలో మొత్తం 50 మంది అతిథి అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.27వేల గౌరవ వేతనం ప్రభుత్వం ఇస్తోంది. కొందరు గెస్టు అధ్యాపకులకు జూన్, జూలై నెలల గౌరవ వేతనం విడుదల చేసింది. మరి కొందరికి జూన్ నెల నుంచి వేతనం ఇవ్వడం లేదు. కళాశాలలో విద్యార్థులకు బోధనతో పాటు కుటుంబాలను పోషించుకోలేక ఆందోళన చెందుతున్నారు. అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత వైసీపీ పాలనలో 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు సంబంధించి గెస్టు ఫ్యాకల్టీకి గౌరవ వేతనం చెల్లించలేదు. పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం చెల్లించాలని పలుమార్లు ఇంటర్ బోర్డు కమిషనర్ సెక్రటరీని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించడం లేదు.
పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీకి పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనం చెల్లించాలి. ఈ విద్యాసంవత్సరం జూన్ నుంచి గౌరవ వేతనం ఇవ్వడం లేదు. -సలావుద్దీన్, ఏపీజీజేసీ, గెస్టు ఫ్యాకల్టీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు (జువాలజీ ఫ్యాకల్టీ, కర్నూలు మైనార్టీ జూనియర్ కళాశాల)
రెగ్యులర్ జీతాలతోపాటు ఇవ్వాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న గెస్టు ప్యాకల్టీకి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ప్రతి నెలా ఒకటో తేదీన గౌరవ వేతనం చెల్లించాలి. జీతం అందకపోవడంతో కుటుంబాల పోషణ భారంగా మారింది. - మున్వర్ సుల్తానా, గెస్టు ఫ్యాకల్టీ, సివిక్స్, కర్నూలు ప్రభుత్వ మైనార్టీ (ఉర్దూ) జూనియర్ కళాశాల