నేటి నుంచి వేరుశనగ గ్రేడింగ్ నిలిపివేత
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:14 AM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులు విక్రయానికి తెచ్చిన వేరుశనగను అనధికారికంగా గ్రేడింగ్ చేయడాన్ని సోమవారం నుంచి నిలిపివేస్తున్నా మని, ఎవరైనా వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని మార్కెట్‌యార్డు కార్యదర్శి కల్పన హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించం
మార్కెట్ యార్డ్ కార్యదర్శి కల్పన వ్యాపారులకు హెచ్చరిక
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులు విక్రయానికి తెచ్చిన వేరుశనగను అనధికారికంగా గ్రేడింగ్ చేయడాన్ని సోమవారం నుంచి నిలిపివేస్తున్నా మని, ఎవరైనా వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని మార్కెట్‌యార్డు కార్యదర్శి కల్పన హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ రైతులను నష్టపరిచే పాసింగ్ విధానాన్ని స్వస్తిపలకాలన్నారు. పలు దఫాలుగా వ్యాపారులకు ఈ విధానాన్ని కొనసాగించవద్దని హెచ్చరించి సమయం ఇచ్చారన్నారు. రైతులు ఇంటి వద్దనే తమ వేరుశనగకు దిగుబడులను ఆరబెట్టుకొని మట్టి రాళ్లు లేకుండా మార్కెట్ కమిటీకి విక్రయానికి తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని తెలిపారు. వ్యాపారులు మాత్రం కచ్చితంగా గ్రేడింగ్ విదానం ఉంటేనే తాము టెండర్లు వేస్తామని లేకపోతే కొనుగోలు చేయలేమంటూ కరాకండిగా తేల్చి చెబుతున్నారు. ఈ విషయంపై సోమవారం ఏం జరుగుతుందోనని ముందుగానే మార్కెట్ యార్డ్ అధికారులు సబ్ కలెక్టర్ పోలీసులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేస్తారా?, కొనసాగిస్తారా? అన్న చర్చ జరుగుతోంది. గ్రేడింగ్ విధానం ఎత్తివేస్తే రైతులకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు.