Share News

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

ABN , Publish Date - May 06 , 2025 | 12:17 AM

కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పులను విరమించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని జిల్లా ప్రజా సంఘాల శాంతి కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

 మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
ర్యాలీ నిర్వహిస్తున్న శాంతి కమిటీ నాయకులు, కార్యకర్తలు

కర్నూలు కల్చరల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పులను విరమించి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని జిల్లా ప్రజా సంఘాల శాంతి కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్‌ భవన నుంచి కలెక్టరేట్‌ ముందు గల గాంధీ విగ్రహం వరకు శాంతి కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి రాజశేఖర్‌ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మావోయిస్టుల పేరుతో చేస్తున్న దాడులలో అమాయక ఆదివాసీలు బలై పోతున్నారని, ప్రభుత్వం తక్షణ మే కాల్పు ల విరమణ పాటించి, మావోయిస్టులతో శాంతి చరన్యలు జరపాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాధాకృష్ణ మాట్లాడుతూ ఆపరేషన కగార్‌ అంతిమ యుద్ధం పేరుతో గత జనవరి నుంచి ఇంత వరకు ఐదువందల మంది ఆదివాసీలు, మహిళలను బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అభ్యుదయ సంస్థ నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ మఽధ్య భారతంలోని అడవుల్లో ఉన్న అపార సహజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలపై, వారికి అండగా ఉంటున్న మావోయిస్టులపై దాడులు చేస్తుందన్నారు. జిల్లా పౌర హక్కుల సంఘం కార్యదర్శి అల్లాబకాష్‌ మాట్లాడుతూ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను నిలిపివేసి, శాంతి చర్చలు చేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సొంత ప్రజలపై యుద్దం చేస్తూ ఉందని, మేధావులు కోరినట్లు తక్షణమే మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్న, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ భాస్కరరెడ్డి, డీటీఎఫ్‌రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం ఏసేపు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, పీఓపీ, సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, పౌర హక్కుల సంఘం, డెమో క్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన, మహిళా సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:17 AM