అడ్డదారిలో అక్రమ రవాణా
ABN , Publish Date - May 18 , 2025 | 12:12 AM
ప్రభుత్వానికి ఎలాంటి పన్ను(సెస్) చెల్లించకుండా ఏకంగా ఓ వ్యాపారి ఫేక్ బిల్లులతో వరి బస్తాలను అడ్డదారిలో అక్రమ రవాణా చేసి రూ.లక్షల్లో సొమ్ముచేసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఫేక్ బిల్లులతో వరి బస్తాల తరలింపు
రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి
కడప జిల్లాతో పాటు బేతంచెర్లలో లభ్యమైన నకిలీ బిల్లులు
ఆలస్యంగా వెలుగులోకి...
వ్యాపారిపై అవుకు పోలీసులకు ఫిర్యాదు
నంద్యాల, మే 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ఎలాంటి పన్ను(సెస్) చెల్లించకుండా ఏకంగా ఓ వ్యాపారి ఫేక్ బిల్లులతో వరి బస్తాలను అడ్డదారిలో అక్రమ రవాణా చేసి రూ.లక్షల్లో సొమ్ముచేసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 లారీల్లో బస్తాలను అక్రమంగా ఓ వ్యాపారి తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టాడు. చెక్ పోస్టుల్లో తమ వాహనాలను పట్టుకోకుండా ఉండేందుకు వీలుగా పది రోజుల రోజుల క్రితం కడప జిల్లా ‘వ్యవసాయ మార్కెట్ కమిటీ’ కమలాపురం పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి వరి బస్తాలను హైదరాబాదు, నెల్లూరు, కర్ణాటకకు తరలించి రూ.లక్షల్లో క్యాష్ చేసుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం ఏ వ్యాపారి అయినా వరి బస్తాలను లోడులో 25 టన్నులు తరలిస్తే.. మార్కెట్‌కు రూ.10వేలు, 30 టన్నులు తరలిస్తే రూ.12 వేలు చొప్పున పన్ను(సెస్) చెల్లించాల్సి ఉంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. బనగానపల్లి నియోజకవర్గ పరిధిలోని అవుకు మండలానికి చెందిన ఓ వ్యాపారి కడప జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ కమలాపురం పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి గత కొంతకాలంగా మార్కెట్‌కు ఎలాంటి పన్ను చెల్లించకుండా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నాడు. తాజాగా పది రోజుల క్రితం కడప జిల్లా మీదుగా నెల్లూరుకు ఓ లారీ వెళ్లింది. ఆ తర్వాత కమలా పురం చెక్‌పోస్టులో ఆ శాఖ అధికారులు రికార్డులను పరిశీలిస్తుండగా.. సదరు వ్యాపారి ఫేక్ బిల్లుల విషయం బయట పడింది. దీంతో వెంటనే సదరు అధికారులు ఆశాఖ జేడీ రామాంజనేయులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఐదు రోజుల క్రితం జేడీ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఏడీ అబ్దుల్ రెహమాన్‌ను తీవ్రస్థాయిలో ఆదేశించారు.
బేతంచెర్లలో వెలుగులోకి...
జేడీ అదేశాలతో సదరు ఏడీ దర్యాప్తు ముమ్మరం చేయగా.. జిల్లాలోని 24 చెక్ పోస్టుల్లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో బేతంచెర్ల చెక్‌పోస్టులో సేమ్ ఫేక్ బిల్లులతో పలుమార్లు వెళ్లినట్లు నిర్ధారణ అ యిందని సమాచారం. దీంతో అక్కడి బిల్లులతో పాటు ఇక్కడి బిల్లులను స్వాధీనం చేసుకుని లారీలు ఎప్పుడెప్పుడు వెళ్లాయో లోతుగా విచారణ చేస్తున్నారని సమాచారం. అయితే అక్రమంగా తరలించిన లారీలకు సంబంధించిన యజమాని డోన్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తిం చినట్లు సమాచారం. సదరు వ్యక్తి సమాచారంతో అక్రమ రవాణాకు పాల్పడిన వ్యాపారి అవుకు మండలానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా అక్రమాలకు పాల్పడిన ఆ బియ్యం వ్యా పారి హైదరాబాదు, కర్ణాటకలోని శిరిగుప్ప, నెల్లూరు, చైన్నై ప్రాంతాలకు ఎక్కువగా వరి బస్తాలను తరలిస్తున్నట్లు తెలిసింది.
అవుకు పోలీసులకు ఫిర్యాదు
తాజాగా లభ్యమైన ఫేక్ బిల్లుల ఆధారంగా చెక్‌పోస్టులో నమోదైన లారీ యజమాని చెప్పిన వివరాలను ఆధారంగా చేసుకుని ఆశాఖ అధికారులు రెండు రోజుల కిందట సదరు వ్యాపారిపై అవుకు పోలీ సులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. అయితే సదరు వ్యాపారి కేసులో తాను లేకుండా చూసేందుకు పోలీసులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అయితే సంబంధిత మార్కెటింగ్ శాఖ అధికారులు తగిన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫేక్ బిల్లులు వాస్తవమే
ఫేక్ బిల్లులతో వరి బస్తాలను ఓ వ్యాపారి అక్రమంగా తరలించారనే విషయం వాస్తవమే. ఉన్నతాధికారులు అదేశాలు మేరకు దర్యాప్తు చేశాం. కొన్ని ఆధారాలతో సదరు వ్యాపారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. భవిష్యత్‌లో అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను పటిష్టం చేస్తాం. ఇలాంటి అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. - అబ్దుల్ రెహమాన్, ఏడీ, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ