బస్సులో బ్యాగ్ పోగొట్టుకున్న ప్రయాణికురాలు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:49 AM
అనంతపురం జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన అరుణ కుమారి బస్సులో ప్రయాణిస్తూ లగేజీ బ్యాగును మరిచిపోయి బస్సు దిగి వెళ్లిపోయారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా గుర్తింపు
బ్యాగులో విలువైన ఆభరణాలు
బాధితురాలికి అప్పగించిన పోలీసులు
డోన్ రూరల్, డిసెంబరు 15 (ఆంధ్రజోతి): అనంతపురం జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన అరుణ కుమారి బస్సులో ప్రయాణిస్తూ లగేజీ బ్యాగును మరిచిపోయి బస్సు దిగి వెళ్లిపోయారు. వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామంలో తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని చూసేందుకు అనంతపురం ఆత్మకూరు నుంచి బస్సులో బయలుదేరి డోన్ కొత్త బస్టాండులో దిగారు. అక్కడి నుంచి పల్లె వెలుగు బస్సు ఎక్కి వెల్దుర్తిలో దిగారు. అక్కడి నుంచి పుల్లగుమ్మి గ్రామానికి చేరుకున్న అనంతరం బస్సులో లగేజీ బ్యాగును మరిచిపోయినట్లు తెలిసి సోమవారం డోన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు డోన్ డీఎస్పీ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా పల్లె వెలుగు బస్సును గుర్తించి బస్సులో మరిచిపోయిన బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి బ్యాగులో ఒక జత బంగారు చెవిబొట్లు, బంగారు బుట్ట్టకమ్మలు, 12 తులాల వెండి కాళ్లపట్టీలు, రూ.900 నగదు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.1.50 లక్షల దాకా ఉంటుందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బాధితురాలు అరుణ కుమారికి బ్యాగ్‌ను అప్పగించారు.