సామాజిక చైతన్య రూపంగా పార్వతయ్యపద్యం
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:47 PM
పద్యంతో కవి పార్వతయ్య సామాజిక చైతన్యం కల్పిస్తున్నారని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ అన్నారు.
సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): పద్యంతో కవి పార్వతయ్య సామాజిక చైతన్యం కల్పిస్తున్నారని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్ అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలోని సాహిత్య వేదిక సమావేశ హాలులో కర్నూలుకు చెందిన కవి డి. పార్వతయ్య రాసిన ‘బొమ్మల గాథలు’ పద్యకావ్యం పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ బి. శంకరశర్మ, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, పలువురు కవులు, కళాకారుల మధ్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో ముఖ్యవక్తగా పాల్గొన్న కెంగార మోహన్ మాట్లాడుతూ సామాజిక చైతన్యానికి పద్యాన్ని కూడా ఆయుధంగా చేసుకోవచ్చని కవి పార్వతయ్య తన పుస్తకం ద్వారా నిరూపించారని చెప్పారు. బసవేశ్వరుడు, పోతులూరు వీరబ్రహ్మం, వేమన, ఈనాటి ఆధునిక తరంలో గుర్రం జాషువా పద్యాన్ని సామాజిక చైతన్యానికి వాడుకున్నారని, ఆ ఒరవడి నేడు కొందరు ఆధునిక కవులు కొనసాగిస్తున్నారని అన్నారు. అందులో పార్వతయ్య ఒకరని ప్రశంసించారు. పుస్తక సమీక్షకుడు, గజల్ గాయకుడు మహమ్మద్ మియా మాట్లాడుతూ ఈ పద్యకావ్యంలో దేవభక్తి, సామాజిక సమస్యలు, ఉద్యమాలు, అమరవీరుల పోరాట గాఽథలు, వర్తమాన నేతలు, కళాకారులు కనిపిస్తారని అన్నారు. పద్యాల్లో పార్వతయ్య మానవీయ కోణాన్ని ఆవిష్కరించారని అన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కవి పార్వతయ్య భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకు టీజీవీ కళాక్షేత్రం పక్షాన రూ.5వేలు చెక్కును అందజేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బి. శంకరశర్మ పార్వతయ్య రచనలు యువతరానికి మార్గదర్శకం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి నగర ప్రతినిధులు విజయులు తనగల, వెంకటేశ్వర్లు, ఎంపీ బసవరాజు, విరసం నాయకుడు నాగేశ్వరాచారి, ఎపీఎస్పీ డీఎస్పీ మహబూ బ్ బాషా, రాయలసీమ ప్రచురణలు సంస్థ గౌరవ సంపాదకుడు మారుతి పౌరోహితం పాల్గొన్నారు.