Share News

అనుకూలమైతే అక్కడే..!

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:46 AM

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నర్సింగ్‌ సిబ్బంది విధులకు సంబంధించిన డ్యూటీ రోస్టర్‌ గందరగోళంగా మారింది. 1,200 పడకలున్న ఆసుపత్రిలో 600 మంది రెగ్యులర్‌ హెడ్‌ నర్సులు, స్టాఫ్‌ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు.

అనుకూలమైతే అక్కడే..!

ఏళ్ల తరబడి ఒకేచోట కొందరు నర్సులు

పెద్దాసుపత్రి స్టాఫ్‌ నర్సుల డ్యూటీ రోస్టర్‌పై విమర్శలు

స్థానాలు మార్చాలని ఇటీవలే డీఎంఈ ఆదేశించినా అమలు కాని వైనం

కర్నూలు హాస్పిటల్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నర్సింగ్‌ సిబ్బంది విధులకు సంబంధించిన డ్యూటీ రోస్టర్‌ గందరగోళంగా మారింది. 1,200 పడకలున్న ఆసుపత్రిలో 600 మంది రెగ్యులర్‌ హెడ్‌ నర్సులు, స్టాఫ్‌ నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీ రోస్టర్‌లో గతంలో ఎప్పుడూ లేనంతగా రాజకీయ జోక్యం పెరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నేతల సిఫారసులతో మళ్లీ ఉన్న చోటే డ్యూటీ వేయించుకోవడం పరిపాటిగా మారింది. నాలుగు నెలలుగా డ్యూటీ రోస్టర్‌లో రాజకీయ నాయకుల జోక్యం పెరిగినట్లు నర్సింగ్‌ సిబ్బంది ఆరోపిస్తున్నారు. శనివారం విడుదల చేసిన డ్యూటీ రోస్టర్‌లో యురాలజీ, నెఫ్రాలజీ కార్డియాలజీ, సిటీవీఎస్‌ విభాగాల్లో విధులు నిర్వరిస్తున్నవారినే అలాగే కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. యురాలజీ విభాగంలో ఏకంగా ముగ్గురు కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులకు తిరిగి అక్కడే డ్యూటీ వేశారు. ఇక కార్డియాలజీ విభాగంలో కూడా కొందరు కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సులు పాతుకుపోయారు. ఇదే విభాగంలో ఓ కాంట్రాక్టు మేల్‌ స్టాఫ్‌ నర్సు ఏళ్ల తరబడి అక్కడే పని చేస్తుండటం అధికారులకు కనబడటం లేదా అని కొందరు నర్సింగ్‌ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. లాంగ్‌ స్టాండింగ్‌లో పనిచేస్తున్న నర్సుల స్థానాలను మార్చాలని ఇటీవల డీఎంఈ ఆదేశించినా అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నారు. ఆసుపత్రి అధికారులకు అనుకూలంగా ఉంటే రోగులు తక్కువగా ఉండే వార్డులు, ఇతరులకు రోగులు ఎక్కువగా ఉండే వార్డుల్లో డ్యూటీ వేస్తున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. కొద్ది రోజుల్లో స్టాఫ్‌నర్సులకు పదోన్నతులు వచ్చే అవకాశముంది. కాగా కాంట్రాక్టు స్టాఫ్‌నర్సుల ను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నర్సింగ్‌ సిబ్బంది అందరికీ అన్ని చోట్ల డ్యూటీలు వేయాలన్న చర్చ జరుగుతుంది.

గత నెలలో ఓ కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుకు క్యాజువాల్టీలో డ్యూటీ వేయగా పది రోజులు విధులు నిర్వహిచార ఓ మంత్రి సహాయకుడి జోక్యంతో ఆ నర్సును మళ్లీ యధాస్థానానికి పంపినట్లు తెలసింది.

ఈ విషయమై సూపరింటెండెంట్‌ డా.కే.వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ప్రతి ఒక్కరూ అన్నిచోట్ల పని చేసేలా రోస్టర్‌ వేయాలని నర్సెస్‌ అసోసియేషన్‌ నాయకులు విన్నవించారని, దీని ప్రకారమే డ్యూటీ రోస్టర్‌ను సమూలంగా మార్పు చేశామన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 12:46 AM