ప్రాణం తీసిన ఓవర్ టేక్
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:04 AM
నగర శివారులో సంతోష్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రమోహన్(29), సుమన్(28) అనే వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో యువకుడు నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి
అదుపు తప్పిన బైక్
టిప్పర్ కిందపడి ఇద్దరి మృతి
సంతోష్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
కర్నూలు క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : నగర శివారులో సంతోష్ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రమోహన్(29), సుమన్(28) అనే వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో యువకుడు నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు వైపు నుంచి నవీన్, చంద్రమోహన్, సుమన్ పల్సర్ బైక్‌పై కర్నూలు వస్తున్నారు. ముందు వెళుతున్న టిప్పర్‌ను ఓవర్‌టెక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడ్డారు. టిప్పర్ వీరిని ఢీ కొట్టడంతో చంద్రమోహన్, సుమన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన నవీన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సుమన్ తలపై టిప్పర్ ఎక్కడంతో తల నుజ్జునుజ్జయింది. ట్రాఫిక్ పోలీసులు చేరుకుని, సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
మృతులు ఇద్దరిదీ గూడూరు..
మృతి చెందిన చంద్రమోహన్, సుమన్ ఇద్దరు గూడూరు వాసులే. సుమన్ కర్నూలులోని ఇందిరాగాందీనగర్‌లో నివాసముంటూ అమీలియో ఆసుపత్రిలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య మౌనిక, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చంద్రమోహన్ గూడూరులో నివాసముంటున్నాడు. ఈయనకు భార్య మౌనిక ఉంది. చంద్రమోహన్ మేనత్త కొడుకు ఎమ్మిగనూరు చెందిన నవీన్ ఆదివారం గూడూరు వచ్చాడు. నవీన్, చంద్రమోహన్ కలిసి మంగళవారం సాయంత్రం కర్నూలు వచ్చి సుమన్‌ను పిలుచుకుని హైదరాబాదు వైపు పనిమీద వెళ్లారు. తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒకరిని కాపాడిన ఆటో డ్రైవర్ సురేష్
ప్రమాద సమయంలో సంతోష్‌నగర్ వైపు వెల్తున్న ఆటో డ్రైవర్ సురేష్ ప్రమా దాన్ని గమనించి, ఆటోను సంతోష్‌నగర్ క్రాస్ వద్ద యూటర్న్ చేసుకుని ప్రమాద స్థలం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో నవీన్, చంద్రమోహన్ కొన ఊపిరితో ఉన్నారు. కొందరు సెల్‌ఫోన్లలో వీడియో తీస్తున్నారే తప్ప. ఎవరు సాయం చేయలేదు. ఆటో డ్రైవర్ సురేష్ స్పందించి ప్రాణాలతో ఉన్న నవీన్‌ను ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. స్పందించిన సురేష్‌ను ట్రాఫిక్ సీఐ అభినందించారు.