Share News

విజృంభిస్తున్న విషజ్వరాలు

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:15 PM

విజృంభిస్తున్న విషజ్వరాలు

విజృంభిస్తున్న విషజ్వరాలు

మంచం పట్టిన పల్లెలు

అల్లాడిపోతున్న ప్రజలు

కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు

జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

సీజన్‌ మారింది.. వానలు జోరుగా కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు జ్వరాలతో మంచం పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు జనం వస్తున్నారు. గత నెలతో పోలిస్తే వైరల్‌ ఫీవర్‌ కేసులు ఈనెల అధికంగా వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజులుగా ప్రతి రోజూ 3వేల మందికి పైగా ఓపీకి రోగులు వస్తున్నారు. గ్రామాల్లో రెండు మూడు రోజులకు ఓసారి కూడా వైద్యసిబ్బంది చికిత్సలు అందించేందుకు వెళ్లడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని పీహెచ్‌సీల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వైద్యులు ఇంటి ముఖం పడుతున్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నపెద్దా అనే తేడా లేకుండా వాతావరణ మార్పులతో వైరల్‌ ఫీవర్స్‌తో ప్రతి ఒక్కరూ బాధపడుతు న్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజుల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని జీజీహెచ్‌ల్లో, ఎమ్మిగనూరు, బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్‌, ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ఈ ఓపీ కేసుల్లో 60శాతం వైరల్‌ ఫీవర్స్‌గా నమోదవుతున్నాయి.

ఆస్పత్రులకు క్యూ..

ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలు మంచం పట్టారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులకు, గొంతునొప్పి లక్షణాలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారు. గత నెలతో పోలిస్తే వైరల్‌ ఫీవర్‌ కేసులు ఈనెల అధికంగా వస్తున్నాయి. ఇంట్లో ఒకరు తర్వాత మరొకరు విషజ్వరా లతో అల్లాడిపోతున్నారు. ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడంతో నీరసించి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. జ్వరం తగ్గినా ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు మాత్రమే తగ్గడం లేదని రోగులు మళ్లీ మళ్లీ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

కిటకిటలాడుతున్నాయి..

కర్నూలు, నంద్యాల, ఆదోని జీజీహెచ్‌లు, డోన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు ప్రైవేటు ఆసుపత్రులు, రోగులతో కిటకిటలాడుతున్నాయి. కర్నూలు జీజీహెచ్‌లో ప్రతిరోజు ఓపీకి 2700 మంది రోగులు వచ్చేవారు. పది రోజులుగా ఈ సంఖ్య పెరిగింది. ప్రతి రోజూ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య 3వేలు దాటుతోంది. వీరిలో ప్రతి రోజూ 200 మంది దాకా అడ్మిషన్‌ పొందుతున్నారు. ఇందులో 70 శాతం వైరల్‌ ఫీవర్‌ కేసులు ఉండటం కలవరపెడుతోంది. నంద్యాల జీజీహెచ్‌లో కూడా ఓపీ రోగుల సంఖ్య 1300 నుంచి 1500 దాకా నమోదవుతున్నాయి. ఇక ఆదోని ఆసుపత్రిలో రోజు వారి ఓపీ 800 దాటుతోంది. విషజ్వరాలు పెరగడంతో కర్నూలు జీజీహెచ్‌లో పరీక్షల కోసం వేచి చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలో 95 డెంగీ కేసులను గుర్తించారు. మలేరియా కేసులు 12గా గుర్తించారు. బేతంచెర్ల, నందికొట్కూరు, డోన్‌, నంద్యాల ప్రాంతాల్లో డెంగీ వ్యాధిగ్రస్థుల సంఖ్య అధికంగా ఉంది. ఇక కర్నూలు జిల్లాలో జనవరి నుంచి ఆగస్టు వరకు 182 డెంగీ కేసులు వచ్చాయి. ఇందులో సి.బెళగల్‌ మండలంలో అత్యధికంగా 15, క్రిష్ణగిరి మండలంలో 13, నన్నూరు పీహెచ్‌సీలో 11, హాలహర్విలో పీహెచ్‌సీలో 8, ఉలిందకొండ పీహెచ్‌సీలో 8, లద్దగిరి పీహెచ్‌సీలో 8 కేసులు వెలుగు చూశా యి. ఇక మలేరియా కేసులు 8 గుర్తించారు. కర్నూలు అర్బన్‌లో-2, ఓర్వకల్లు, రేమట ప్రాంతాల్లో కేసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో పలు ఆసుపత్రుల్లో డెంగీ కిట్లు ఉన్నప్పటికీ నిర్ధారణ పరీక్షలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీతో పాటు వర్షాలు కురుస్తుండటంతో నీరు కలుషితం కావడంతో టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. గ్రామాల్లో రెండు మూడు రోజులకు వైద్యసిబ్బంది చికిత్సలు అందించేందుకు వెళ్లడం లేదు. అన్ని పీహెచ్‌సీలో మధ్యాహ్నం 1గంట తర్వాత వైద్యులు ఇంటి ముఖం పడుతున్నారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్యాలయం వదిలి బయటకు వెళ్లడం లేదు. ప్రోగ్రాం ఆఫీసర్లకు అద్దె వాహనాలు ఇచ్చినా కర్నూలు నగరం దాటి బయటకు పోవడం లేదు. దీంతో పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో గ్రామీణ వైద్యం అటకెక్కింది.

వైరల్‌ ఫీవర్లపై ఆందోళన వద్దు

వారం రోజుల నుంచి వైరల్‌ ఫీవర్‌ కేసులు అధికంగా వస్తున్నాయి. వర్షాలు కురుస్తుం డటంతో కేసులు పెరిగాయి. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలతో వస్తున్నారు. వైరల్‌ ఫీవర్లపై ఆందోళనవద్దు. పారాసిటమాల్‌ మాత్రలు వేసుకుని నీరు బాగా తాగి న్యూట్రిషన్‌ పుడ్‌ తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది.

డాక్టర్‌ కే.విద్యాసాగర్‌, ప్రొఫెసర్‌ ఆఫ్‌ జనరల్‌ మెడిసన్‌, జీజీహెచ్‌, కర్నూలు

సీజనల్‌ వ్యాధులు పెరిగాయి

వాతావరణ మార్పులు, ఇటీవల కురుస్తున్న వర్షాలతో సీజనల్‌ వ్యాధులు పెరిగాయి. ఓపీకి వచ్చే కేసుల్లో 70శాతం వైరల్‌ ఫీవర్‌ కేసులే అధికంగా వస్తున్నాయి. నాలుగు రోజులైనా జ్వరం తగ్గని వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. సీజన్‌ మారుతున్న నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి.

డా.డమం శ్రీనివాసులు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ మెడిసిన్‌, జీజీహెచ్‌, కర్నూలు

రోగుల సంఖ్య పెరిగింది

సీజనల్‌ వ్యాధులతో జీజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. గురువారం ఆసుపత్రిలో ఓపీకి రికార్డు స్థాయిలో 3330 రోగులు వచ్చారు. ఇందులో 215 మంది అడ్మిషన్‌ పొందారు. మొత్తం 1247 మంది ఆసుపత్రిలో వివిద వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంటే అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నాం.

డాక్టర్‌ కే.వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

Updated Date - Sep 01 , 2025 | 11:15 PM