Share News

బోగస్‌ ఉత్తర్వులతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం..!

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:04 AM

నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట వల వేశారు. నకిలీ సీల్‌, ఫోర్జరీ సంతకాలతో బోగస్‌ ఉత్తర్వులు సృష్టించారు. దర్జాగా ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని సైతం నమ్మించారు.

బోగస్‌ ఉత్తర్వులతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం..!
ఉత్తర్వులు అందజేస్తున్న కృష్ణమూర్తి అలియాస్‌ త్రిమూర్తిరావు

ప్రభుత్వ పాఠశాలలో నెల రోజులు విధులు

జీతం అడగడంతో వెలుగులోకి వచ్చిన బాగోతం

జిల్లాలో 30 మందికి ఉద్యోగాల పేరిట మోసం

ఎస్పీకి ఫిర్యాదు చేసిన డీఈవో శామ్యూల్‌ పాల్‌

కర్నూలు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట వల వేశారు. నకిలీ సీల్‌, ఫోర్జరీ సంతకాలతో బోగస్‌ ఉత్తర్వులు సృష్టించారు. దర్జాగా ప్రభుత్వ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిని సైతం నమ్మించారు. అవుట్‌ సోర్సింగ్‌ సోషల్‌ టీచర్‌గా విధుల్లో చేర్పించారు. ఆ పాఠశాలలో నెల రోజులు విధులు నిర్వర్తించిన ఆమె జీతం కోసం సీఎ్‌ఫఎంఎస్‌ ఖాతా నంబరు చెప్పాలని ప్రధానోపాధ్యాయుడిని అగడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. బోగస్‌ ఉత్తర్వులు సృష్టించి మోసాలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై మంగళవారం కర్నూలు డీఈవో శామ్యూల్‌పాల్‌ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు.

కర్నూలు నగరానికి చెందిన కృష్ణమూర్తి అలియాస్‌ ఎం.త్రిమూర్తిరావు అనే వ్యక్తి రాష్ట్ర సచివాలయంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నట్లు నిరుద్యోగులను నమ్మించాడు. అంతేకాదు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో), పాఠశాల ప్రధానోపాధ్యాయులను సైతం బోల్తా కొట్టించాడు. కర్నూలు నగరం నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన పీఆర్‌ పింకి అనే మహిళ గుంటూరులో స్థిరపడ్డారు. ఆమెకు జోహరాపురం ఇందిరమ్మ కాలనీలో నగరపాలక ప్రాథమిక పాఠశాలలో (కల్లూరు దర్వాజ) అవుట్‌ సోర్సింగ్‌ సోషల్‌ టీచర్‌ ఉద్యోగం ఇస్తున్నట్లుగా, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), సమగ్ర శిక్ష ఎక్స్‌-అఫిషియో ప్రాజెక్ట్‌ కో-ఆర్డినేటర్‌ నకిలీ సీల్‌, ఫోర్జరీ సంతకాలతో బోగస్‌ ఉత్తర్వులు సృష్టించారు. ఆ ఉత్తర్వులపై అర్బన్‌ ఎంఈఓ సంతకాలు ఉన్నాయి. సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ డైరెక్టరు (ఏడీ)గా చెప్పుకుంటున్న కృష్ణమూర్తి అలియాస్‌ ఎం.త్రిమూర్తిరావు, మరో ఇద్దరు వ్యక్తులు ఓ కారులో పీఆర్‌ పింకితో కలసి జోహరాపురంలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్‌తో కృష్ణమూర్తి ఎస్‌ఎ్‌సఏ ఏడీగా పరిచయం చేసుకుని అవుట్‌ సోర్సింగ్‌ సోషల్‌ టీచర్‌గా పీఆర్‌ పింకిని విధుల్లో చేర్పించారు. ఇంతదాక సవ్యంగా సాగిపోయింది. విధుల్లో చేరిన బోగస్‌ టీచర్‌ పింకి నెల రోజుల పాఠశాలలో విధులు నిర్వర్తించింది. ఆ తరువాత జీతం కోసం సీఎ్‌ఫఎంఎస్‌ ఖాతా ఐడీ నంబరు కావాలని హెచ్‌ఎం మల్లేశ్‌ను అగడడంతో అనుమానం వచ్చి డీఈవో శామ్యూల్‌ పాల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఉత్తర్వులు పరిశీలించిన ఆయన అది బోగస్‌ ఉత్తర్వు అని తేలిపోయింది. తక్షణమే నకిలీ ఉపాధ్యాయురాలు పీఆర్‌ పింకిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఈ భాగోతంలో రూ.లక్షలు చేతులు మారినట్లు సమాచారం. ఆ బోగస్‌ ఉత్తర్వులపై కర్నూలు అర్బన్‌ ఎంఈఓ సంతకం కూడా ఫోర్జరీ చేశారు. కారులో ఉన్నతాధికారుల పేరుతో దర్జాగా రావడం, ఉత్తర్వులు ఉన్నట్లు పేపర్లు ఉండటంతో బోగస్‌ టీచర్‌ పీఆర్‌ పింకీ జాయినింగ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారని ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్‌ రాతపూర్వకంగా రాసిచ్చినట్లు డీఈఓ తెలిపారు. ఇలా పింకీ ఒక్కటే కాదు.. ఈ ముఠా దాదాపు 30 మందికిపైగా నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట మోసం చేసి రూ.లక్షలు వసులు చేసినట్లు తెలుస్తోంది. సమగ్ర విచారణ చేస్తే ఉద్యోగాల పేరిట సాగించిన మోసాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎస్పీకి ఫిర్యాదు చేశాం

నకిలీ సీల్‌, ఫోర్జరీ సంతకాలతో అవుట్‌ సోర్సింగ్‌ సోషల్‌ టీచర్‌గా పీఆర్‌ పింకీ అనే మహిళలకు బోగస్‌ ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా కృష్ణమూర్తి అలియాస్‌ ఎం.త్రిమూర్తిరావు అనే వ్యక్తి ఎస్‌ఎ్‌సఏ ఏడీగా పరిచయం చేసుకొని జోహరాపురం ఇందిరమ్మ కాలనీ నగరపాలక ప్రాథమిక పాఠశాలలో పీఆర్‌ పింకీ అనే మహిళను టీచరుగా విధుల్లో చేర్పించాడు. ప్రధానోపాధ్యాయుడు మల్లేశ్‌ నా దృష్టికి తీసుకువచ్చారు. అది బోగస్‌ ఉత్తర్వు అని తేలడంతో పీఆర్‌ పింకీని పాఠశాల నుంచి బయటకు పంపిచాం. ఎంఈఓ ప్రభావతమ్మ తన సంతకం ఫోర్జరీ చేశారని లిఖితపూర్వకంగా తెలిపారు. నకిలీ సీల్‌, ఫోర్జరీ సంతకాలతో బోగస్‌ ఉత్తర్వులు తయారు చేసి మోసానికి పాల్పడడమే కాకుండా సమగ్ర శిక్ష అసిస్టెంట్‌ డైరెక్టరు (ఏడీ)గా చెప్పుకుంటున్న కృష్ణమూర్తి అలియాస్‌ ఎం.త్రిమూర్తిరావు, కర్నూలు రెడ్‌క్రాస్‌లో పని చేస్తున్న సుభాష్‌, నాయుడుపై ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశాను. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంఈఓ ప్రభావతమ్మ, పాఠశాల హెచ్‌ఎం మల్లేశ్‌పై శాఖపరమైన చర్యల కోసం ఆర్జేడీకి సిఫార్సు చేశాం. - శామ్యూల్‌పాల్‌, డీఈవో, కర్నూలు

Updated Date - Sep 24 , 2025 | 12:04 AM