Share News

మన‘సారా’ నవోదయం..!

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:34 PM

సారా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్త చేపట్టింది.

మన‘సారా’ నవోదయం..!
కల్లూరు మండలం ఎర్రకత్వ తండాలో ఎక్సైజ్‌ అధికారుల అవగాహన

నాటు సారా రహిత రాష్ట్రమే చంద్రబాబు లక్ష్యం

పక్కాగా నవోదయం 2.0 అమలుకు శ్రీకారం

110 గ్రామాల్లో నాటు సారా తయారీ, అమ్మకాలు

మూడు కేటగిరీలుగా విభజన

స్వచ్ఛందంగా తయారీ మానేస్తే స్వయం ఉపాధి కల్పనకు సన్నాహాలు

కర్నూలు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): సారా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్త చేపట్టింది. ఆరోగ్యాన్ని హానికరం చేసే నాటుసారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా ‘నవోదయం 2.0’ పేరుతో నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చేందుకు సంకల్పించారు. కర్నూలు జిల్లాలో 110 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. నవోదయం 2.0 అమలుతో సాటుసారా రహిత గ్రామాలే లక్ష్యంగా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు అవగాహన సదస్సులు చేపట్టారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ పర్యవేక్షణ ఉన్న ఏడు స్టేషన్ల పరిధిలో 110 మద్యం షాపులు, 23 బార్లు ఉన్నాయి. గత జగన్‌ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ పేరుతో దుకాణాల్లోనే ప్రభుత్వం యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగించారు. ధరలు పెంచితే మద్యం మానేస్తారనే బూచి చూపి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారు. అంతేకాదు మద్యం ప్రియులకు ఇష్టమైన బ్రాండ్ల మద్యం కాదని మునుపెన్నడు చూడని బ్రాండ్ల మద్యం అమ్మకాలు చేపట్టారు. నాసిరకం మద్యాన్ని కూడా విక్రయించి ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు. దీంతో మద్యం ప్రియులు నాటు సారాకు, కర్ణాటక మద్యం వైపు దృష్టి సారించారు. జిల్లాలో పలు గ్రామాలు సాటునారా తయారీ కేంద్రాలుగా మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాల్లో తీసుకొచ్చిన సమూల మార్పుల కారణంగా అమ్మకాలు పెరిగాయి. గత ప్రభుత్వంలో నెలకు సగటున రూ.65-70 కోట్ల మద్యం అమ్మకాలు చేస్తే.. ప్రస్తుతం రూ.90-95 కోట్లకు చేరిందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు పేర్కొంటున్నారు. నాటుసారా వైపు వెళ్లకుండా కార్టర్‌ రూ.99కే నాణ్యమైన లిక్కరును అందుబాటులోకి తెచ్చారు. ఈ నిర్ణయం సామాన్యుల ప్రాణాలకు ముప్పుగా మారిన నాటునారా నిర్మూలనకు ప్రభుత్వం నాంది పలికింది.

110 గ్రామాల్లోపై దృష్టి

కూటమి ప్రభుత్వం సాటుసారా రహిత గ్రామాలే లక్ష్యంగా నవోదయం 2.0 అమలుకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో సారా తయారీ, అమ్మకాలు చేసే 110 గ్రామాలు, పట్టణ ప్రాంతాలు గుర్తించి మూడు కేటగిరీలుగా విభజించారు. పక్కాగా అమలు కోసం పోలీస్‌, రెవిన్యూ, అటవీ శాఖ అధికారులను భాగస్వామ్యం చేశారు.

సారా తయారీకి మాత్రమే పరిమితమైన గ్రామాలను ఏ కేటగిరీలో చేర్చారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి, ఆదోని, ఆలూరు, హొళగుంద, పత్తికొండ, తుగ్గలి మద్దికెర, దేవనకొండ మండలాల్లో 25 గ్రామాలను గుర్తించారు.

తయారీతో పాటు విక్రయాలు సాగించే గ్రామాలను బీ కేటగిరీలో చేర్చారు. ఆస్పరి, మంత్రాలయం, కోసిగి, పెద్దకడుబూరు, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేనవకొండ, కర్నూలు, ఓర్వకల్లు, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో 25 గ్రామాలు గుర్తించారు.

కేవలం నాటుసారా అమ్మకాలు చేసే గ్రామాలను సీ కేటగిరీ కింద చేర్చారు. కర్నూలు, కల్లూరు, ఓర్వకల్లు, కృష్ణగిరి, వెల్దుర్తి, ఆస్పరి, కోసిగి, పెద్దకడుబూరు, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, గోనేగండ్ల మండల్లాల్లో 60 గ్రామాలు గుర్తించారు.

సారా నిర్మూలనకు నాలుగు దశలు

రాష్ట్రం నాటుసారా రహిత ఏపీగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ‘నవోదయం 2.0’ అమలుకు శ్రీకారం చుట్టింది. తయారీ, అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించిన గ్రామాల్లో నాలుగు దశల్లో కార్యక్రమాల అమలుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

సంసిద్ధం: తొలి దశలో సారా తయారీ, అమ్మకందారులను గుర్తించాలి. వారిలో సంపూర్ణ అవగాహన కల్పించడం, ఇక నుంచి నాటుసారా తయారీ, అమ్మకాలు చేయబోమని వారిని సంసిద్ధం చేయడం. ఇందుకోసం గ్రామాల్లో గ్రామ సభలు, అవగాహన సదస్సులు, నారా వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలపై కళాజాతల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించారు. ఆయా గ్రామాల్లో 500 మంది వరకు తయారీ, అమ్మకందారులు ఉన్నట్లు గుర్తించారు.

దాడులు: రెండో దశలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన గ్రామాల్లో మళ్లీ సారా తయారీ, అమ్మకాలు చేస్తుంటే దాడులు చేయడం. ఇప్పటివరకు 17 కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేశారు. 106 లీటర్లు సారా, 3,640 లీటర్లు బెల్లం ఊట ధ్వంసం చేశారు. దాడులు కొనసాగుతున్నాయి.

పునరావాసం: మూడో దశలో గుర్తించిన సారా తయారీ, అమ్మకందారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం. వారికున్న నైనుణ్యానికి అనుగు ణంగా ఆటోలు, పాడి పరిశ్రమ, వ్యవసాయం, వ్యాపారం.. వంటి వాటికి రుణసౌకర్యం.

డిక్లరేషన్‌: నాలుగో దశలో నాటు సారా తయారీ, అమ్మకాలను పూర్తిగా మానేసిన గ్రామాలు, పట్టణ ప్రాంతాలను ‘సారా రహిత గ్రామలు’గా డిక్లరేషన్‌ ఇవ్వడం. రాష్ట్ర విభజన తర్వాతనాటి టీడీపీ ప్రభుత్వం సారా నిర్మూ లన కోసం నవోదయం అమలు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా పరివర్తన కార్యక్రమం చేపట్టింది. జిల్లాలో 55 గ్రామాలను గుర్తించారు. 30 గ్రామాలను ‘సారా రహిత గ్రామాలు’గా ప్రకటించారు. ఆయా గ్రామాల్లో 60 మంది నాటుసారా తయారీ, అమ్మకందారులకు రూ.54 లక్షలకు పైగా ఖర్చు చేసి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఎక్సైజ్‌ సిబ్బంది దత్తత

కర్నూలు జిల్లాలో సాటుసారా తయారీ, అమ్మకాలు సాగిస్తున్న 110 గ్రామాలను సంబంధిత ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లో పని చేసే సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుళ్లకు ఒక్కొక్కరికి ఒక్కో గ్రామం దత్తత ఇచ్చేలా ప్రణాళికలు తయారు చేశారు. అదే క్రమంలో ఇతర గ్రామాలను కూడా సిబ్బందికి దత్తత ఇస్తారు. ఆయా గ్రామాల్లో ఎక్సైజ్‌ నేరాలు జరిగితే అందుకు దత్తత ఇచ్చిన కానిస్టేబుల్‌పై శాఖ పరమైన చర్యలు తీసుకుంటారు. దీనిని రికార్డులకు పరిమితం కాకుండా పక్కాగా అమలు చేస్తే నాటుసారా రహిత గ్రామాలుగా మార్చే అవకాశం ఉంది.

టోల్‌ ఫ్రీ నంబరు 14405

ఏ గ్రామంలోనైనా నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్నా, అనుమతి లేని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మద్యం విక్రయాలు సాగిస్తుంటే టోల్‌ ఫ్రీ నంబరు. 14405కు కాల్‌ చేస్తే ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందిస్తారు. గ్రామాల్లో బెల్ట్‌ షాపులు, ఎక్కువ రేట్లకు మద్యం అమ్మకాలు చేసినా ఈ నంబరుకు కాల్‌ చేయవచ్చు.

ఎక్సైజ్‌ స్టేషన్ల వారీగా నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్న గ్రామాల వివరాలు

నియోజకవర్గం ఏ-కేటగిరీ బీ-కేటగిరీ సీ-కేటగిరీ మొత్తం

కర్నూలు 5 6 21 32

కోడుమూరు 2 2 14 18

ఆదోని 9 -- 1 10

ఆలూరు 4 2 1 7

ఎమ్మిగనూరు -- 2 -- 2

కోసిగి -- 4 2 6

పత్తికొండ 5 9 21 35

మొత్తం 25 25 60 110

సారా రహిత కర్నూలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

సారా నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 110 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో సారా తయారీ, అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించాం. ఆయా గ్రామాల్లో 500 మంది తయారీ, అమ్మదారులు ఉన్నారని గుర్తించాం. వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు ఇప్పటికే జిల్లాలో అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాం. మరో వైపు దాడులు కూడా చేస్తున్నాం. పోలీస్‌, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు, సిబ్బందితో ఎక్సైజ్‌ యంత్రాంగం సమన్వయం చేసుకొని నవోదయం 2.0 పక్కాగా అమలు చేసి సారా రహిత కర్నూలు జిల్లాను మార్చాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. సారా తయారీ, అమ్మకాలు సంపూర్ణంగా మానేసే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా సంపూర్ణ సహకారం అందించాలి.

- ఎం.సుధీర్‌బాబు, సూపరింటెండెంట్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ, కర్నూలు

Updated Date - Apr 11 , 2025 | 11:34 PM