ఆపరేషన్ ‘అవినీతి’
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:49 PM
వైద్యారోగ్య శాఖలో అవినీతి దందా కొనసాగుతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి.. మరో ముగ్గురు అధికారులతో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రతి పనికో రేటుతో అక్రమార్జనకు తెర తీశాడు.

ప్రతి పనికి ఓ రేటు
భారీగా అక్రమ వసూళ్లు
మూడేళ్ల నుంచి గుట్టుగా సాగుతున్న వ్యవహారం
సెలవుల్లో ఉండి వేతనాలు డ్రా
పేమెంట్ చేస్తేనే పీజీకి అనుమతి
ఫేస్ బయోమెట్రిక్ అప్రూవల్‌కూ మామూళ్లు
ఓ ఉన్నతాధికారి, ముగ్గురు అధికారులే కీలకం
రూ. కోట్లలో అక్రమ దందా
బదిలీలతో తప్పించుకునే పన్నాగం?
వైద్యారోగ్య శాఖలో అవినీతి దందా కొనసాగుతోంది. ఈ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి.. మరో ముగ్గురు అధికారులతో కలిసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రతి పనికో రేటుతో అక్రమార్జనకు తెర తీశాడు. ఉద్యోగులు, వైద్యులు ఈ నలుగురి తీరుతో బెంబేలెత్తిపోతున్నారు. ఏ పని కావాలన్న అమ్యామ్యాలు సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే పోతే పోయింది అనుకొని వారు చెప్పినంత సమర్పించుకొని పనులు చేయించుకుంటున్నారు. వైద్యులు పీజీ చేయాలన్నా, సెలవులు కావాలన్నా, ఇంకే పని కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. లేదంటే పనులు సాగవు. వైద్యారోగ్య శాఖలో ఇలాంటి అవినీతి గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్నా బదిలీల్లో ఆ నలుగురు వేరే ప్రాంతాలకు వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
నంద్యాల, జూన్ 10(ఆంధ్రజ్యోతి): వైద్యారోగ్య శాఖ అంటేనే ఎంతో కీలకమైనది. నంద్యాల జిల్లా వైద్యారోగ్య శాఖలో మాత్రం ఆపరేషన్ ‘అవినీతి’ కొనసాగుతోంది. ఆ శాఖపై పలు అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పైసలిస్తే తప్ప ఏ పనిచేయడం లేదనేది బాధిత వర్గాల ఆవేదన. ఫేస్ బయోమెట్రిక్ నుంచి అక్రమ డిప్యుటేషన్లు, అడ్డుగోలు సెలవుల వ్యవహారం వరకు ఎక్కడిక్కడ ప్రతి పనికో రేటు పెట్టి అక్రమ వసూళ్లకు తెరలేపారనే విమర్శలు లేకపోలేదు. ఎవరైనా వైద్యులు పీజీకి వెళ్లాలన్నా.. విధుల్లో చేరే సమయంలో వారి ధ్రువపత్రాలను వెరిఫికేషన్‌కు పంపాలన్నా.. ఏదైనా సెలవులు మంజూరు చేయాలన్నా.. పైసలిస్తే తప్ప పనిచేయడం లేదనే విమర్శలు లేకపోలేదు. మొత్తంగా ఈ వ్యహారంలో ఆశాఖ ఉన్నతాధికారితో పాటు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ముగ్గురు అధికారులు పాత్ర కీలకంగా ఉన్నట్లు ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది. వీరిలో కొందరైతే మరీ దారుణం. ఏకం గా ఫోన్‌ఫేకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పా లంటే.. జిల్లా వైద్యఆరోగ్యశాఖలో పలు రూపాల్లో అక్రమ దందా రూ. కోట్లలో సాగుతోందని విమర్శలు లేకపోలేదు.
తనదైన శైలిలో ఎవరికీ చిక్కకుండా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యుటేషన్ సదుపాయం లేకుండా చేశారు. కానీ.. ఇక్కడ ఆ శాఖ ఉన్నతాధికారి మాత్రం తనదైన శైలిలో ఎవరికీ చిక్కకుండా మూడేళ్లుగా అక్రమ వ్యవహారం సాగిస్తున్నారని తెలిసింది. వైద్యులు, ఉద్యోగులకు మౌఖికంగా (ఓరల్) అక్రమ డిప్యుటేషన్లు వేస్తున్నట్లు, హోదాను బట్టి వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో కొందరు వైద్యులు, ఉద్యోగులు సైతం అడ్డదారిలో సెలవులు పొంది విధులకు వెళ్లకుండానే వేతనాలు డ్రా చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో సదరు అధికారికి ఆయా ఉద్యోగులు భారీగా నెలవారి మాముళ్లు అందజేస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని రెండు పీహెచ్‌సీలో డీడీవో పవర్ ఉన్న వైద్యులు.. అక్రమంగా జీతం పొందిన వైద్యులు, ఉద్యోగుల మధ్య వాగ్వాదం జరిగినా సదరు ఉన్నతాధికారి చూసీచూడనట్లు వ్యవహరించి అక్ర మార్కులకు అండగా నిలిచారనే ఆరోపణలున్నాయి.
డీడీవో ఓకే చేసిన వారికే అప్రూవల్ చేయాలి
జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీలో ఒక డీడీవో (వైద్యులు) ఉంటారు. అక్క డ పనిచేస్తున్న మిగతా వైద్యులతో పాటు వైద్యఉద్యోగులు, సిబ్బందికి సంబంధించి ప్రతిరోజు వారు వేసిన ఫేస్ బయోమెట్రిక్‌లు తమ పరిధిలో వేసి ఉంటేనే ఓకే చేయాలి. ఆ తర్వాత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉన్న పర్యవేక్షణాధికారి(వైద్యులు) డీడీవో ఓకే చేసినా వారికి మాత్రమే (అప్రూవల్) చేయాల్సి ఉంది. కానీ.. సదరు పర్యవేక్షణాధికారి డీడీవో అప్రూవల్ చేయకపోయినా తానే అప్రూవుల్ చేసి ఆయా ఉద్యోగుల నుంచి నెలవారిగా మామూళ్లు దండుకుంటున్నారని కొందరు డీడీవో వైద్యుల ద్వారా తెలిసింది.
దీంతో ఇదే అదునుగా భావించిన వైద్యులు, ఉద్యోగులు సైతం మాముళ్లు ఇస్తున్నాం కదా.. అని..? ఎక్కడపడితే అక్కడే ఫేస్ బయోమెట్రిక్ వేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు విధులకు వెళ్లడం, కొన్ని సందర్భాల్లో అనుమతి లేకుండా డుమ్మా కొట్టడం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా వారి జీతాల్లో మాత్రం కోతలు పడటం లేదు. ఈ రూపంలో కూడా నెలకు సదరు పర్యవేక్షణాధికారి ద్వారా ఆశాఖ ఉన్నతాధికారికి సైతం భారీగానే నెలవారీ మాముళ్లు ముడుతున్నాయని తెలుస్తోంది.
పైసలిస్తేనే రిలీవ్..
జిల్లా వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న చాలా మంది వైద్యులు ఎంబీబీఎస్ చేసినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు వైద్యులుకు పీజీలకు అవకాశం వస్తే.. ఇదే అదునుగా భావించిన సదరు అధికారులు పైసలిస్తే తప్ప.. ఆవైద్యులను విధుల నుంచి రిలీవ్ చేయలేదని పలువురు వాపోతున్నారు. మూడేళ్లలో జిల్లాలో సుమారు 45 మంది వైద్యులు పీజీకి వెళ్లినట్లు సమాచారం. వీరిలో ఒక్కొక్కరి నుంచి రూ. 40వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేసినట్లు తెలిసింది. కొందరి నుంచి అక్కడ పనిచేస్తున్న ఓ అధికారికి చెందిన ఫోన్‌పే చేయించుకోవడం గమనార్హం. పెండింగ్ ఏరియర్స్, సర్వీస్ మ్యాటర్స్ తదితర విషయాల్లో సైతం సదరు అధికారి తమదైన శైలిలో వసూళ్లు చేసి క్యాష్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ లావాదేవీల్లో సదరు ఉన్నతాధికారికి ఎక్కువశాతం వాటా చేరుతోందని తెలిసింది
సార్ ఆదేశిస్తారు.. వారు అమలు చేస్తారు..
అక్రమ వసూళ్ల దందా వెనుక ఓ ఉన్నతాధికారితో పాటు అక్కడే పనిచేసే మరో ముగ్గురు అధికారులు పాత్ర కీలకంగా ఉందని ఆశాఖ వర్గాల నుంచి తెలిసింది. సార్ ఆదేశించడం.. వారు అమలుచేసి వచ్చిన అమ్యామ్యాలను గుట్టుచప్పుడుగా ఉన్నతాధికారికి చేరవేస్తున్నట్లు సమాచారం. ఎప్పుడైనా.. ఎవరైనా ఇవ్వకపోతే.. ఏదో రకమైన పనులు.. సమస్యల మీద కార్యాలయానికి పిలిపించడం.. ఆ తర్వాత ఆ ముగ్గురు కథ నడుపుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. వీరే కాకుండా జిల్లాలోని పీహెచ్‌సీలో పనిచేస్తున్న కొందరు యూడీసీల ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
ఉన్నతాధికారులు వస్తే హడావిడి..
తాను చేసిన వ్యవహారం ఏమాత్రం బయటపడకుండా తెరవెనుక కథ నడిపారని ఆశాఖ వర్గాల నుంచి తెలుస్తోంది. మూడేళ్లుగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆశాఖ వర్గాల్లో లేకపోలేదు. అక్రమ వ్యవహారం అంతా కూడా తమ వద్ద పనిచేస్తున్న ఆముగ్గురు కీలక అధికారుల ద్వారా నడిపించారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఆ ముగ్గురి అకౌంట్లతో పాటు ఫోన్ కాల్స్ రికార్డులను పరిశీలించినా అసలు విషయాలు బయటపడే అవకాశం ఉందని సమాచారం. లేదంటే పీజీల కోసం బయటకు వెళ్లిన వైద్యులు.. కొత్తగా విధుల్లో చేరిన వైద్యులు, వైద్య ఉద్యోగులను అడిగినా కూడా ఇట్టే తెలిసిపోతుంది. తాను చేసిన తప్పులు బయటకుండా ఆశాఖ ఉన్నతాధికారులు, మంత్రులు, కలెక్టర్లు వచ్చిన సమయంలో సదరు ఉన్నతాధికారి నానా హడావిడి(వివిధ రూపాల్లో) చేసి వారి నుంచి సమస్య తలెత్తకుండా చూసుకోవడంలో సదరు అధికారి దిట్ట అనే ప్రచారం ఆశాఖ వర్గాల్లో లేకపోలేదు.
స్థాయిని బట్టి..
ఉద్యోగుల పరంగా ఉద్యోగాన్ని బట్టి వారి ఎస్‌ఆర్‌ల కోసం రూ. 10 వేలు నుంచి రూ.20 వేలు. ఇదే క్రమంలో వివిధ వెరిఫికెషన్ రూపంలో ఒక్కొక్కరి నుంచి స్థాయిని బట్టి రూ.10వేల నుంచి రూ. 15వేలు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికీ కొందరి ఎస్‌ఆర్‌లు సక్రమంగా లేవని తెలుస్తోంది. ఇదేతరహాలో మెటర్నిటీ లీవ్‌లకైతే రూ. 15వేలు సమర్పించాల్సిందే అనే చర్చ సాగుతోంది. క్యాజువల్ లీవ్‌కు సైతం వదలకుండా స్థాయిని బట్టి వసూళ్లు చేస్తున్నారని తెలిసింది. వీటికితోడు కొన్ని పీహెచ్‌సీలకు సంబంధించిన హెచ్‌డీఎఫ్ నిధులను సైతం పక్కదారి పట్టించి రూ.లక్షల్లో స్వాహా చేశారనే ఆరోపణలు లేకపోలేదు.
బదిలీల్లో తప్పించుకోవాలనే...
సదరు ఉన్నతాధికారితో పాటు కీలకంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు. సదరు వ్యవహారాలకు సహకరించిన ఉద్యోగులు సైతం భవిష్యత్‌లో సేఫ్‌గా ఉండాలనే యోచనతో తాజా బదిలీల రూపంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమదైన శైలిలో పైరవీలు మొదలెట్టినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో మూడేళ్లుగా సాగిన అవినీతి ఆరోపణలపై ఆశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి లోతుగా విచారణ చేస్తే.. సదరు అధికారులు అక్రమ దందా..! బయటపడే అవకాశం లేకపోలేదని సమాచారం.