Share News

రెండు రోజులే..!

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:27 PM

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 16న ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు.

రెండు రోజులే..!

16న జిల్లాకు ప్రధాని నరేంద్రమోదీ

కర్నూలులో దేశంలోనే తొలి జీఎస్టీ-2.0 సభ

పకడ్బందీ ఏర్పాట్లలో మంత్రులు, అధికార యంత్రాంగం

రూపరేఖలు రాగమయూరి గ్రీన్‌హిల్స్‌

కర్నూలు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 16న ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న మూడవ ప్రధాని మోదీ. 1991-96 మధ్య నంద్యాల ఎంపీగా ఉన్న అప్పటి ఎంపీ పీవీ నరసింహారావు నంద్యాలలో పర్యటించారు. 2004లో ప్రధాని మన్మహన్‌సింగ్‌ ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. 2019లో కర్నూలు నగరం ఎస్టీబీసీ మైదానంలో జరిగిన ఎన్నికల బీజేపీ అభ్యర్థి ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నా.. ప్రధాని హోదాలో అధికారిక పర్యటన కాదు. ప్రధాని హోదాలో ఉమ్మడి జిల్లా పర్యటనకు గురువారం రానున్నారు. అందులోనూ ‘సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌’ పేరిట నిర్వహించే జీఎస్టీ-2.0 సంస్కరణల దేశంలోనే తొలి సభ ఇది. సీఎం చంద్రబాబు సారథ్యంలోకి కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమరావతి, విశాఖ పర్యటనలకు మించి కర్నూలు పర్యటనను విజయవంతం చేయాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు తన సేనను రం గంలో దించారు. స్వయంగా ఆయనే ఇప్పటికే రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, కూటమి ముఖ్యనాయకులు రంగంలో దిగారు. అతిథుల భద్రత, తరలివచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

మంత్రుల పర్యవేక్షణలో ఏర్పాట్లు

కడపలో టీడీపీ మహానాడు, అనంతపురంలో సూపర్‌ సిక్స్‌ - సూపర్‌ హిట్‌ సభలు నిర్వహించారు. రాష్ట్రంలో ముఖ్యనాయకులు, మంత్రులు అక్కడే తిష్టవేసి ఏర్పాట్లు పర్యవేక్షించినా సక్సెస్‌ చేయడంతో ఆ జిల్లాల నాయకులదే కీలకపాత్ర. తాజాగా కర్నూలులో జీఎస్టీ-2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సభ నిర్వహించడం, ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానుండడంతో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, జిల్లా నాయకులకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, నారాయణ, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్‌, బీజీ జనార్దన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు ప్రధాని పర్యటన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అవసరమైనప్పుడల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు లక్షలకు పైగా జన సమీకరణ చేస్తుండడంతో సభా ప్రాంగణానికి తరలించేలా రూట్స్‌ డైవర్షన్‌ కీలంగా మారింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, టీడీపీ నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి ఏర్పాట్లలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్‌ ఏ.సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం రేయింబవళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి సాయంత్రంలోగా వంద శాతం పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

రంగంలోకి దిగిన ఎస్పీజీ బృందాలు

ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) సోమవారం ప్రధాని మోదీ పర్యటన, భద్రతా ఏర్పాట్లపై రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌లో సహా రోడ్లు, పార్కింగ్‌ స్థలాలను క్షుణంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సభికులకు ఇచ్చే ఆహారం, తాగునీరు పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచనలు చేసినట్లు తెలిసింది.

7,500 మంది పోలీసులతో భారీ భద్రత: ఎస్పీ

కర్నూలు క్రైం : ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు 7,500మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ఈ బందోబస్తు నిమ్మితం కర్నూలుకు వచ్చిన అడిషినల్‌ ఎస్పీలు, పోలీసు అధికారులతో పసుపుల రోడ్డులో ఉన్న యూబీఆర్‌ కన్వెన్షన్‌ హాలులో దిశానిర్దేశం చేశారు. భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పార్కింగ్‌ ప్రదేశాలు, బహిరంగ ప్రదేశం, రూట్‌ డైవర్షన్స్‌, ట్రాఫిక్‌ మళ్లింపు తదితర అంశాలపై వివరించారు. సెక్టార్‌ ఇన్‌చార్జిలుగా ఐపీఎస్‌ అధికారులు ఉంటారని, వారి వద్ద ఏఎస్పీ స్థాయి అధికారులు ఉంటారన్నారు. ప్రధాని బహిరంగ సభ వద్ద ఏడు మంది ఎస్పీ స్థాయి అఽధికారులు విధులు నిర్వహిస్తారని, 200 సీసీ కెమెరాలతో డీజీపీ కార్యాలయం నుంచి నిఘా ఉంటుందన్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో నుంచి మూడు రోజుల పాటు ‘నో ఫ్లై జోన్‌ ఫర్‌ డ్రోన్స్‌’ గా ప్రకటించారు.

Updated Date - Oct 13 , 2025 | 11:27 PM