మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోళ్లు
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:50 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
మొదటి దశలో 5వేల మెట్రిక్ టన్నుల ఉల్లి సేకరణ
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా గ్రామాల్లోనే రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లను చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు సమాచారం అందింది. దీంతో మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి నారాయణమూర్తి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ రాజుతో కలిసి శనివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోని ఉల్లి పండించిన గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. క్వింటం ఉల్లికి గిట్టుబాటు ధర రూ.1,200 అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో దాదాపు 5వేల మెట్రిక్ టన్నులు సేకరించాలని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్ సంస్థ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని నిల్వ చేసేందుకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములతో పాటు మార్కెట్ కమిటీ యార్డుల పరిధిలోని గోదాములను సిద్ధం చేస్తున్నారు. ఉల్లి పంటను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు.