నేటి నుంచి ఉల్లి కొనుగోలు ప్రారంభం
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:37 AM
కర్నూలు మార్కెట్ యార్డులో సోమవారం నుంచి ఉల్లి కొనుగోలు ప్రారంభించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రంజిత్ బాషా
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో సోమవారం నుంచి ఉల్లి కొనుగోలు ప్రారంభించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం మార్కెటింగ్, హార్టికల్చర్, మార్క్‌ఫెడ్, కర్నూలు మార్కెట్ యార్డు సెక్రటరీతో ఉల్లి కొనుగోలు అంశంపై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటం ఉల్లికి రూ.1,200 చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. అధికారులంతా సమన్వయంతో కమిటీలుగా ఏర్పడి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉల్లి కొనుగోలు ప్రారంభించాలని స్పష్టంచేశారు. మార్కెట్ యార్డులో ప్రస్తుతం ఎంత ఉల్లి ఉంది, సోమ, మంగళవారానికి ఎంత రావచ్చని కలెక్టర్ మార్కెట్ యార్డు సెక్రటరీ జయలక్ష్మితో ఆరాతీశారు. ప్రస్తుతం 110 క్వింటాళ్లు మాత్రమే యార్డులో అమ్మకానికి రైతులు తెచ్చారని, సోమవారం 1,200 నుంచి 1,500 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్ యార్డుకు రావచ్చని ఆమె కలె క్టర్‌కు వివరించారు. సమావేశంలో జేసీ డా.బి.నవ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు, మార్క్‌ఫెడ్ డీఎం రాజు, మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి ఉన్నారు.