Share News

ఉల్లి ప్లాట్‌ఫారాలు ఖాళీ

ABN , Publish Date - May 29 , 2025 | 11:28 PM

వారం రోజుల నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఉల్లి దిగుబడి విక్రయానికి రావడం లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా 50వేల హెక్టార్లలో ఏటా ఉమ్మడి జిల్లాలో ఉల్లి సాగవుతోంది.

ఉల్లి ప్లాట్‌ఫారాలు ఖాళీ
ఉల్లి సంచులు నిల్వ లేక ఖాళీగా కనిపిస్తున్న ప్లాట్‌ఫారం

వారం నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు రాని ఉల్లి దిగుబడి

కర్నూలు అగ్రికల్చర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఉల్లి దిగుబడి విక్రయానికి రావడం లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా 50వేల హెక్టార్లలో ఏటా ఉమ్మడి జిల్లాలో ఉల్లి సాగవుతోంది. అదే విధంగా రాష్ట్రంలో కర్నూలు మార్కెట్‌ యార్డుతో పాటు తాడేపల్లి గూడెంలో ఉల్లి విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. కర్నూలు మార్కెట్‌యార్డుకు ఆగస్టు నుంచి డిసెంబరు దాకా వేల క్వింటాళ్ల ఉల్లిని రైతులు అమ్మకానికి తెస్తుంటారు. ఈ ఉల్లిని అమ్మించే విషయంలో అధికారులు, సిబ్బంది కిందా మీద పడుతూ ఊపిరి సలపకుండా పనిచేస్తుంటారు. గత అక్టోబరు, నవంబరు నెలలో ప్రతిరోజు కర్నూలు మార్కెట్‌ యార్డుకు 5వేల నుంచి 10వేల క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి రైతులు ట్రాక్టర్లు, ఎద్దులబండ్లు, లారీల ద్వారా తీసుకువస్తుంటారు. దీంతో కర్నూలు కొత్తబస్టాండు ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి తీవ్ర ఇబ్బందులు తలెత్తేవి. వారం రోజుల నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డులో ఒక్క ఉల్లి సంచి కూడా లేకపోవడంతో ప్లాట్‌ఫారాలన్నీ బోసిపోతున్నాయి. అధికారులు, సిబ్బంది కనీసం ఒక పది రోజులైనా ఉల్లి మార్కెట్‌ యార్డుకు రావడం లేదని, జూలై ఆఖరు నుంచి తిరిగి ఉల్లి విక్రయానికి రావడం మొదలవుతుందని అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏటా ఉల్లి క్రయ విక్రయాల వల్ల కర్నూలు మార్కెట్‌ యార్డుకు రూ. కోటికి పైగానే వ్యాపారుల నుంచి సెస్సు రూపంలో ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఉల్లి జాడ లేకపోవడంతో కార్మికులకు పని లేకుండా పోయింది.

Updated Date - May 29 , 2025 | 11:28 PM