Share News

ఉల్లి.. ఆశలు సన్నగిల్లి..!

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:04 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు జూదంగా మారింది. అన్నీ అనుకూలిస్తే.. రైతులకు రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. లేదా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది.

ఉల్లి.. ఆశలు సన్నగిల్లి..!

రాయితీ కోసం రైతుల పడిగాపులు

2019లో రూ. 6.45 కోట్ల నిధులు మంజూరు

వెనక్కి పంపిన వైసీపీ ప్రభుత్వం

కూటమి ప్రభుత్వంలో కదిలిన నిధుల మంజూరు ఫైలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు జూదంగా మారింది. అన్నీ అనుకూలిస్తే.. రైతులకు రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. లేదా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్థితిలో ఆరేళ్ల క్రితం అంటే 2019లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకునేందుకు రాయితీని ప్రకటించింది. వెనువెంటనే జరిగిన ఆనాటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం ఉల్లి రాయితీని అటకెక్కించేసి రైతులకు తీరని ద్రోహం చేసింది. కూటమి ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని ఉల్లి రైతులు కోరుకుంటున్నారు.

రామేశ్వరరెడ్డి. 2019లో ఉల్లి రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు కర్నూలు మార్కెట్‌ కమిటీ యార్డు కార్యాలయం వద్దకు మోకాళ్లరిగేలా తిరిగాడు. కూటమి ప్రభుత్వం వచ్చిందని ఇప్పటికైనా ఉల్లి రాయితీ అందించాలని అధికారులను వేడుకునేందుకు గత శనివారం కార్యాలయం వద్దకు వచ్చాడు. ప్రభుత్వం మంజూరు చేస్తే తప్పకుండా రాయితీని బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 9,740 మంది రైతులు ఉల్లి రాయితీ కోసం కర్నూలు మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు.

కర్నూలు అగ్రికల్చర్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రైతులు సాగు చేసిన ఉల్లి పంటకు కనీస ధర కూడా అందక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్వింటం ఉల్లికి రూ700 మద్దతు ధరను ప్రకటించి వ్యాపారి అందించే ధరకు, తాము అందించే రాయితీని కలుపుకుని రైతుకు క్వింటంపై రూ.700 అందేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందిన తక్షణమే పథకం అమలు కోసం వెంటనే నిధులను కూడా మంజూరు చేశారు. దాదాపు మొదటి విడత రూ.40 లక్షలను కొంత వరకు రాయితీ మొత్తాన్ని అందించారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉల్లి రాయితీ పథకాన్ని అప్పటి సీఎం జగన్మోహన్‌ రెడ్డి అటకెక్కించేశారు. విడుదల చేసిన నిధులను వెనక్కి లాక్కున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు కర్నూలు మార్కెట్‌ కమిటీ కార్యాలయం చుట్టూ తమకు రావాల్సిన రాయితీ కోసం తిరుగుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల్లో ఆశలు చిగురించాయి. ఉల్లి రాయితీ నివేదికను కమిటీ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి పంపి నిధులను మంజూరు చేయిస్తామని ప్రజాప్రతినిధులు రైతులకు హామీ ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రైతులకు మద్దతు ధర అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఇటీవల గుంటూరు మిర్చీ యార్డులో అభాండాలు వేయ డంపై ఉమ్మడి జిల్లా రైతులు మండిపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమ కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తే.. ఐసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిలిపేయడమే కాకుండా ఉల్లి రాయితీని కూడా అందించకుండా ఎగనామం పెట్టలేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా తమకు అందాల్సిన ఉల్లి రాయితీని మళ్లీ తెప్పించేందుకు ఉమ్మడి జిల్లా ప్రతినిధులు సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు.

రాయితీ అందేసరికి ప్రాణాలు పోయేలా ఉన్నాయి

జిల్లాలో ఉల్లి రైతులు కన్నీటి కడలి ఈదుతున్నారు. పెట్టుబడి ఖర్చు కాదు కదా కనీసం పొలం నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు ఉల్లిని తెచ్చినందుకు అయిన ఖర్చు కూడా వ్యాపారి నుంచి లభించ కపోవడం వల్ల రైతులు లబోదిబో మంటున్నారు. అప్పులు పేరుకుపోతుండటం, కుటుంబ జీవనం భారం కావడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఆగస్టు నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కర్నూలు యార్డులో ఉల్లిని విక్రయించిన రైతులకు క్వింటంపై రూ. 700 మద్దతు ధర అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. గిట్టుబాటు ధర అందించినందుకు రైతులు సంతోషించారు. రాయితీ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వారు కర్నూలు మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి క్యూ కట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గోనెగండ్ల, డోన్‌, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు, పాణ్యం, ఆదోని, ఆత్మకూరు తదితర 30 మండలాల్లో ఉల్లిని రైతులు భారీగా సాగు చేస్తున్నారు. ఒక ఎకరా ఉల్లి పంట సాగుకు రూ.20వేలు ఖర్చు అయితే.. ప్రస్తుతం పెట్టుబడి ఖర్చులు రూ.50వేలు నుంచి రూ.60వేలకు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం అక్టోబరులో కర్నూలు మార్కెట్‌ యార్డుకు వేలాది క్వింటాళ్ల ఉల్లిని అమ్మకానికి రైతులు తీసుకుని వచ్చారు. వ్యాపారులు ఇదే సాకుగా చూపుతూ ధరను తగ్గించే ప్రయత్నం చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం స్థాయిలో సీఎం చంద్రబాబు ఉల్లి రైతుల కష్టాలు తీర్చాలని, వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని మంత్రులను ఆదేశించారు. మంత్రి టీజీ భరత్‌తో పాటు జలవనరుల శాఖ మంత్రి ఉల్లి మార్కెట్‌ యార్డుకు చేరుకుని వ్యాపారులు, అధికారులతో చర్చలు జరిపారు. దీంతో వ్యాపారులు దిగివచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర అందడంతో వారు సంతోషించారు.

రైతులకు అందాల్సిన రాయితీ రూ.6.45 కోట్లు.. ఇచ్చింది రూ.40 లక్షలే..

2019లో ఉమ్మడి జిల్లాలోని ఉల్లి రైతులు ధర పతనమై తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో 3,47,911 క్వింటాళ్ల ఉల్లిని రైతులు వ్యాపారులకు విక్రయించారు. రైతులకు క్వింటానికి వ్యాపారులు అందించిన మొత్తం కేవలం రూ.200 నుంచి రూ.400 మధ్యనే. రైతుల కన్నీటి వ్యథను తొలగించేందు కోసం అప్పట్లో ప్రభుత్వం ఉల్లి రాయితీ అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటానికి రూ.700 మద్దతు ధరను ప్రకటించింది. క్వింటానికి వ్యాపారి రూ.300 చెల్లిస్తే.. ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.400 రాయితీగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం రాయితీ కోసం అప్పట్లో 9,740 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.6.45 కోట్లు రాయితీగా అందించాల్సి ఉందని మార్కెట్‌ కమిటీ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడుమూరులో పర్యటించిన సమయంలో 40 లక్షల దాకా రాయితీని రైతులకు అందించారు. 2019 ఆగస్టులో 260 మంది రైతులు 15,798 క్వింటాళ్లను విక్రయించారు. సెప్టెంబరులో 1,014 మంది రైతులు 18,774 క్వింటాళ్ల ఉల్లిని విక్రయించారు. అక్టోబరులో 1361 మంది రైతులు 14,799 క్వింటాళ్లను, నవంబరులో 2,449 మంది రైతులు 1.69 లక్షల క్వింటాళ్లను, డిసెంబరులో 1,703 మంది రైతులు 10,651 క్వింటాళ్లను అమ్ముకున్నారు. జనవరి నెలలో 1,515 మంది రైతులు 24,390 క్వింటాళ్లను, ఫిబ్రవరిలో 1438 మంది రైతులు 59462 క్వింటాళ్ల ఉల్లిని కర్నూలు మార్కెట్‌ యార్డులో విక్రయించారు. మొత్తం 3.47 లక్షల క్వింటాళ్లకు గాను ప్రభుత్వం రూ.6.45 కోట్లు 9,740 మంది రైతులకు రాయితీగా అందించాలని ప్రభుత్వానికి ఆనాటి కర్నూలు మార్కెట్‌ కమిటీ అధికారులు నివేదిక పంపించారు.

జిల్లాలో ఉల్లి రాయితీ వివరాలు (క్వింటాళ్లలో)

నెల అర్హులు విక్రయించిన

ఉల్లి

ఆగస్టు 260 15798

సెప్టెంబరు 1014 18774

అక్టోబరు 1361 14799

నవంబరు 2449 169263

డిసెంబరు 1703 10651

జనవరి 1515 24390

ఫిబ్రవరి 1438 59462

ఉల్లి రాయితీని రైతుకు అందించేందుకు కృషి

ఉల్లి రైతులకు 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాయతీని అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ రాగానే మంజూరైన నిధులను వెనక్కి తీసేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా రైతులు రాయితీ డబ్బుల కోసం కర్నూలు మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. కూటమి ప్రభుత్వం రావడం వల్ల రాయితీ డబ్బులు అందించేందుకు జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయిస్తాం.

- పెరుగు పురుషోత్తంరెడ్డి, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌

ప్రభుత్వానికి నివేదిక పంపిస్తాం

జిల్లా ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వానికి రైతులు చెల్లించాల్సిన ఉల్లి రాయితీ కోసం ప్రభుత్వానికి నివేదికను పంపిస్తాం. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. ఆందోళన వద్దు.

- జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ

Updated Date - Mar 13 , 2025 | 12:04 AM