ఉల్లి రైతు కన్నీరు
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:38 PM
ఆరుగాలం కష్టించిన రైతుకు ఆవేదన మిగిలింది. రూ. లక్షలు ఖర్చు చేసి పంటను పండిస్తే కోత కూలీలకు గిట్టుబాటు కావడం లేదు.
ధర లేక పంటలను దున్నేస్తున్న అన్నదాతలు
కోడుమూరు రూరల్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించిన రైతుకు ఆవేదన మిగిలింది. రూ. లక్షలు ఖర్చు చేసి పంటను పండిస్తే కోత కూలీలకు గిట్టుబాటు కావడం లేదు. తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని సామెత. అయితే మార్కెట్ మాయాజాలంతో ఉల్లి రైతులు తల్లఢిల్లు తున్నారు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గిడ్డ య్య వర్షాధారం కింద 13 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. నాటు, కలుపులు, ఎరువులు, పిచికారీ తదితర ఖర్చులు ఎకరాకు రూ. 60 వేలు అయింది. ఇప్పుడు పంట పీకడం, కోత, కల్లం చేర్చ డం, గ్రేడింగ్, మార్కెట్‌కు తరలించడం వంటి ఖర్చుల కింద మరో రూ. 20 వేలు వస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో ఉల్లిపంటకు గిట్టుబాటు ధర అందడం లేదు. లభిస్తున్న ధరలతో నష్టమే తప్ప కోత ఖర్చులకు సరిపోవని రైతులు పంటను తొలగించడానికి సిద్ధపడ్డారు. శనివారం 5 ఎకరాల్లో సాగు చేసిన ఉల్లిని ట్రాక్టర్‌తో దున్నేస్తూ శనగ, జొన్న విత్తనం వేశారు. ఆదివారం మరో 8ఎకరాల ఉల్లిని తొలగించి విత్తనం వేయనున్నట్లు రైతు తెలిపారు. ఇంటిల్లిపాది కష్టమంతా మట్టిపాలు అయ్యిందని, రూ. 7.8 లక్షలు నష్టపోయినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.
13 ఎకరాల్లో సాగు చేశా
వర్షాధారం కింద 13 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. గిట్టుబాటు ధర లభిస్తుందనే నమ్మకంతో అప్పుచేసి పెట్టుబడి పెట్టాను. నాలుగు నెలలు కంటికి రెప్పలా కాపాడుకుని పంట పండిస్తే కోత కూలీలకు గిట్టుబాటు కావడం లేదు. పంట పండించి వ్యాపారుల చేతిలో పెట్టాల్సి వస్తోంది. మార్కెట్ నుంచి ఒట్టిచేతులతో తిరిగి రావడం తప్ప మిగిలేదేమి లేదు. అందుకే పంటను దున్నివేసి వేరే పంట వేశాను.
గిడ్డయ్య, వెంకటగిరి