ఉల్లి రైతు కన్నీరు
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:45 PM
మండలంలో 5,151 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. అధిక వర్షాల దెబ్బకు పంట దెబ్బతింది. ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి
మార్కెట్‌లో పడిపోయిన ధర
పొలంలోనే వదిలేస్తున్న రైతులు
కోడుమూరు రూరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండలంలో 5,151 ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. అధిక వర్షాల దెబ్బకు పంట దెబ్బతింది. ధర పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
మద్దతు ధర ఎత్తివేయడంతో నష్టం..
మొన్నటి వరకు ప్రభుత్వం రూ.1,200ల మద్దతు ధరతో కొనుగోలు చేసినా దాన్ని ఎత్తివేయడంతో నష్టం వస్తోంది. ప్రభుత్వం హెక్టారుకు రూ.50వేల సాయం ప్రకటించినా ఆ లెక్కన ఎకరాకు రూ.20వేలు ఇస్తుండటంతో గిట్టుబాటు అయ్యే అవకాశం లేదు. ఈ ధర ఉల్లిని కోతకోసి మార్కెట్‌కు తరలించేందుకు కూడా సరిపోదని రైతులు అంటున్నారు.
వ్యాపారుల మాయాజాలం
ఉల్లిని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకెళ్లగా వ్యాపారుల మాయాజాలంతో రైతులు అల్లాడిపో తున్నారు. క్వింటాలుకు రూ.50ల నుంచి రూ.500 లోపు కొంటుండగా, ఒకటిరెండు లాట్లు మాత్రమే రూ.900లకు కొనుగోలు చేస్తుండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఇంటిల్లిపాదీ కష్టించినా పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు.
దెబ్బతీసిన వర్షాలు
బావుల కింద సాగుచేసిన ఉల్లి 80-90 రోజుల్లో చేతికందుతుంది, వర్షాధారమైతే 110-120 రోజుల్లో వస్తుంది. తీరా దిగుబడి వచ్చే సమయంలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో విస్తారంగా వర్షాలు పడడంతో పొలాల్లో తేమ అధికమై ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 50 కింటాళ్లు మించడం లేదు. ఏదైమైనా మళ్లీ ధర వస్తుందన్న ఆశతో కొందరు రైతులు ఉల్లిని కల్లానికి చేరిచ రోజూ గ్రేడింగ్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి
ఉల్లి సాగుకు ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతోందని రైతులు అంటున్నారు. నారు మొదలు కలుపు, ఎరువులు, కూలీల ఖర్చులు మొత్తం భారంగా మారాయి. అయితే ధర పడిపోవడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు.
మద్దతు ధర కొనసాగించాలి
రెండెకరాల్లో ఉల్లిసాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష ఖర్చయ్యింది. రెండురోజుల క్రితం ఎకరా ఉల్లిని కోశా. ప్రభుత్వం మద్దతు ధర తొలగించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో కోత, కల్లంలో చేర్చడానికే సరిపోతాయి. - రమేశ్, వర్కూరు
ఐదెకరాల్లో ఉల్లిని వదిలేశా
ఖరీఫ్‌లో ఐదెకరాల్లో ఉల్లిసాగు చేశా, సుమారు రూ.5లక్షలు ఖర్చు అయ్యింది. ఉల్లిని కోసి మార్కెట్‌కు తరలిస్తే నష్టం వస్తోంది. - ఈశ్వరయ్య, ప్యాలకుర్తి