మళ్లీ ఉల్లి పతనం
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:43 PM
ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు ముందుగానే పడటంతో రైతులు మే నెల నుంచే ఉల్లి సాగును ప్రారంభించారు.
తీవ్ర సంక్షోభంలో ఉల్లి రైతాంగం
ప్రస్తుత ఖరీఫ్‌లో 50వేల ఎకరాల్లో సాగు
వెంటాడుతున్న వర్షం.. పొలాల్లోనే కుల్లిపోతున్న పంట
యార్డుల్లో అన్నదాతల జాగరణ
కర్నూలు అగ్రికల్చర్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు ముందుగానే పడటంతో రైతులు మే నెల నుంచే ఉల్లి సాగును ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో 50వేల ఎకరాల దాకా ఈసారి ఉల్లి పంట సాగు చేశారు. ఓ వైపు వర్షాలు, ఇంకో వైపు ధర పతనం కావడంతో రైతులు మార్కెట్ యార్డులో కన్నీరు మున్నీరవుతున్నారు. గురువారం కర్నూలు మార్కెట్ యార్డుకు 8వేల క్వింటాళ్ల ఉల్లిని రైతులు అమ్మకానికి తెచ్చారు. గత నాలుగు రోజుల నుంచి కూడా ఉల్లి అమ్మకాలు లేక కొంత మంది రైతులు యార్డులోనే జాగరణ చేస్తున్నారు. ఉల్లిగడ్డలు తేమ పట్టి ఉండటంతో ఎక్కువ ధరను చెల్లించేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. నాలుగు రోజులుగా పరిశీలిస్తే క్వింటా ఉల్లి ధర గరిష్ఠంగా రూ.వెయ్యి, కనిష్ఠ ధర రూ.500కు మాత్రమే అమ్ముడుపోతుంది. దీంతో కనీసం రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. కొంత మంది రైతులు మార్కెట్ యార్డుకు తీసుకెళ్లి ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు రైతులు పొలంలోనే ఉల్లిని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి ధర క్వింటా రూ.4వేలకు పైగా పలికింది. కానీ ఇప్పుడు మాత్రం రూ.వెయ్యికి కూడా కొనేవారు కరువయ్యారు. అమ్మకానికి ఉల్లి దిగుబడులు అధికంగా రావడంతో పాటు వరుస వర్షాలతో రైతులను మరింత కుదిపేస్తున్నాయి. చేతికొచ్చిన ఉల్లి పొలాల్లోనే కుల్లిపోతుండటంతో ఆ రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురు కావడంతో వారు మంత్రులకు నివేదించారు.ఎమ్మెల్యేలు, మంత్రులు రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబునాయుడును కలిసి ఉల్లి రైతుల దయనీయ స్థితిని తెలియజేశారు. దీంతో సీఎం చంద్రబాబు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీతను పిలిపించి ఉమ్మడి జిల్లాలో ఉల్లి రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం డైరెక్టర్ ఆదేశాలపై మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, డిప్యూటీ డైరెక్టర్ లావణ్య, కడప నుంచి కర్నూలు యార్డుకు వచ్చి రైతుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు సూపర్‌వైజర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందజే స్తామని, రైతులను ఆదుకుంటామని జాయిం ట్ డైరెక్టర్ రామాంజనేయులు ప్రకటించారు.
రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితి
ఒకటిన్నర ఎకరాలో ఉల్లి పంటను రూ.లక్ష ఖర్చుతో ఉల్లి సాగు చేశాను. అయితే.. కర్నూలు యార్డులో పరిస్థితిని చూస్తే క్వింటానికి గరిష్ఠ ధర రూ.వెయ్యి కూడా అందే అవకాశం లేదు. గత సంవత్సరం ఇదే సమయానికి కర్నూలు యార్డులో క్వింటా ఉల్లి రూ.4వేలకు అమ్మాను. రూ.3 లక్షల ఆదాయం వచ్చింది. ఈసారి క్వింటా రూ.వెయ్యి కూడా వచ్చే పరిస్థితి లేదు. లారీ ఖర్చు కూడా అందుతుందో లేదో.
- చంద్రయ్య, పెనుమాడ, క్రిష్ణగిరి మండలం
ప్రస్తుతం మన దేశంలోని పశ్చిమ బెంగాల్, కర్నాటక, తమిళనాడు, ఒడిసా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసే పరిస్థితులు లేవు. సరిహద్దులు మూసివేయడంతో ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి అమ్ముడుపోవడం లేదు. దీంతో పాటు మహారాష్ట్రలో ఉల్లి సాగు ఎక్కువగా కావడం వల్ల సోలార్, తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దేశంలోని వివిద ప్రాంతాలకు అక్కడి వ్యాపారస్థులు సరఫరా చేస్తున్నారు. నేల స్వభావాన్ని పట్టి ఉమ్మడి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న ఉల్లి ఎక్కువ రోజులు మన్నిక ఉండదని, కేవలం 10 రోజులకు మించి ఉండకపోవడం వల్ల కుల్లిపోయే పరిస్థితి ఉండటం వల్లనే రైతుకు గిట్టుబాటు కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
అధికారుల ఉక్కిరి బిక్కిరి
గత సంవత్సరం సెప్టెంబరు నెలలో ఉమ్మడి జిల్లాల రైతులు 12వేల క్వింటాళ్ల ఉల్లిని కర్నూలు మార్కెట్‌యార్డుకు అమ్మకానికి తీసుకువచ్చారు. ఈ సంవత్సరం ముందస్తు వర్షాల కారణంగా మే నెలలోనే ఉల్లి సాగును రైతులు మొదలెట్టారు. ప్రస్తుతం ఆ ఉల్లి కోతకు వచ్చింది. రోజు పదివేల క్వింటాళ్ల దాకా ఉల్లి కర్నూలు మార్కెట్ యార్డుకు పోటెత్తుతోంది. మరో వైపు వర్షాలు పడుతుండటంతో పొలాల్లోనే ఉల్లిని ఉంచలేక రైతులు యార్డుకు తెస్తున్నారు. కొంత మంది రైతులు అయితే.. వాహనాలకు కూడా డబ్బులు లేక కూలీల ఖర్చులు భరించలేక కనీస ధర కూడా యార్డులో లభించలేదనే సమాచారం తెలుసుకుని పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఉల్లిని కొనుగోలు చేసేందుకు కర్నూలు మార్కెట్‌యార్డులో 30 మంది దాకా లైసెన్సులు తీసుకున్నారు. వీరిలో కేవలం 10 మంది మాత్రమే రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు. లైసెన్సు తీసుకున్న 30 మంది వ్యాపారస్థుల చేత కొనుగోలు చేయించడంతో పాటు టెండరును 10 గంటలకే పూర్తి చేస్తే ఎప్పటికప్పుడు సాయంత్రంలోపు ఉల్లి కొనుగోలు పూర్తవుతాయనీ, తమకు రోజుల తరబడి యార్డులోనే ఉండాల్సిన అవసరం ఉండదని రైతులు పేర్కొంటున్నారు.
2020 నుంచి 2025 వరకు కర్నూలు మార్కెట్ యార్డుకు అమ్మకానికి వచ్చిన ఉల్లి వివరాలు (క్వింటాళ్లలో)
సంవత్సరం ఉల్లి (క్వింటాళ్లలో)
2020-21 3,76,941
2021-22 4,46,793
2022-23 3,51,101
2023-24 4,41,525
2024-25 6,57,785
2025-26 54,874 (ఇప్పటి వరకు)