పట్టపగలే వృద్ధురాలి దారుణహత్య
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:55 AM
పట్టపగలే ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేశ్ నగర్ సమీపంలో సోమవారం మధ్యా హ్నం చోటుచేసుకుంది. ఈఘటనతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది.
సాయివైభవ్‌నగర్‌లో ఘటన
వంట మనిషిపైనే అనుమానం
ఫ ఉలిక్కిపడ్డ పోలీసు శాఖ
కర్నూలు క్రైం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పట్టపగలే ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గణేశ్ నగర్ సమీపంలో సోమవారం మధ్యా హ్నం చోటుచేసుకుంది. ఈఘటనతో పోలీసు శాఖ ఉలిక్కి పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సాయి వైభవ్‌నగర్‌లోని ఓ విల్లాలో కాటసాని శివలీల(72) ఒంటరిగా ఉంటుంది. ఆమె భర్త సాంబశివారెడ్డి ఏడాదిన్నర క్రితం మృతిచెందాడు. కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు గంగాధర్‌రెడ్డి అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డాడు. కూతురు ఉమామహేశ్వరమ్మ కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తుంది. ఆమె భర్త (రిటైర్డు ఏసీపీవో) చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి వెంకటరమణ కాలనీలో నివాస ముంటుంది. శివలీల విల్లాలో ఒంటరిగా ఉంటూ ఇంటిపై ఉన్న పెంట్ హౌస్‌ను ఇద్దరు మెడికల్ రెప్‌లకు అద్దెకు ఇచ్చారు. కూతురు ఉమామహేశ్వరమ్మ కొద్ది కాలంగా తల్లివద్దనే ఉంటూ కళాశాలకు వెళ్లి వస్తుంది. అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి వీరి ఇంటికి తరుచూ వచ్చి వెళ్తుంటారు. సోమవారం కూడా కూతురు కళాశాలకు వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి శివలీల ఇంటికి వచ్చాడు. లోపల శివలీల రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భార్య ఉమామహేశ్వరమ్మకు ఫోన్‌చేశాడు. కొన ఊపిరితో పడి ఉన్న ఆమెను స్థానికులు, పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నగల కోసమే ఈ హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన వెంటనే బెడ్‌రూంలో కూడా నగల కోసం వెతికినట్లుగా గుర్తించారు. ఎక్కువ సమయం లేక వదిలేసి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గొలుసు, రెండు గాజులు మాయం
శివలీల మెడపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో రక్తస్రావమైంది. ఆమె మెడలో ఉన్న గొలుసు, రెండు బంగారు గాజులు మాయమైనట్లు కూతురు ఉమామహేశ్వరమ్మ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఇంట్లో ఇతర వస్తువులు ఏమీ పోలేదని పోలీ సులు తెలిపారు. హతురాలి ఇంట్లోని సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. కాలనీలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కాటసాని శివలీల ఇంట్లో పనిచేసే వంటమనిషి వరలక్ష్మిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ కూతురు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితమే ఆమె పని మానేసిందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఫోన్‌చేసి పనికి రావాల్నా అని అడిగిందని, ఆమెపైనే అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం
సంఘటన తెలిసిన వెంటనే సాయంత్రం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘటనాస్థలిని పరిశీలించారు. డీఎస్పీ బాబుప్రసాద్, త్రీటౌన్ సీఐ శేషయ్య, నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ, రూరల్ సీఐ శ్రీధర్‌తో పాటు పలువురు ఎస్‌ఐలు, క్రైం పార్టీ కానిస్టేబుళ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎస్పీ వెల్లడించారు.
పలువురి పరామర్శ
హతురాలు కాటసాని శివలీల పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి దూరపు బంధువు. కాటసాని ఆమె స్వగృహానికి చేరుకుని కూతురు, అల్లుడిని పరామర్శించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సైతం హతురాలి ఇంటికొచ్చి కుమార్తె అల్లుడులను పరామర్శించారు.
బంగారు వ్యాపారి..
కర్నూలు క్రైం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బంగారు వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాధాకృష్ణ థియేటర్ సమీపంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. కొత్తపేటకు చెందిన హిజార్(42)స్థానిక షరాఫ్ బజారులో బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి రాధాకృష్ణ థియేటర్ సమీపంలో ఉన్న ఓ మసీదుకు వెళ్లి తిరిగి వస్తుండగా కొంతమంది యువకులు మారణాయుధాలతో అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హిజార్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, వన్‌టౌన్ సీఐ పార్థసారధి ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. పాతబస్తీకి చెందిన ఇర్ఫాన్, ఇమ్రాన్ అనే వ్యక్తులపైన అనుమానం వ్యక్తం చేస్తూ హతుడి తండ్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.