Share News

ఆరు ప్రాజెక్టులకు ఓకే .!

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:52 PM

పశ్చిమ ప్రాంత కరువు నివారణకు రాష్ట్ర విభజన తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వేదవతి ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టులను ప్రారంభించింది.

ఆరు ప్రాజెక్టులకు ఓకే .!
కోసిగి మండలం సాతనూరు వద్ద ఆర్డీఎస్‌ ఆనకట్ట వద్ద అసంపూర్తిగా ఆగిపోయిన ఆర్డీఎస్‌ కుడి కాలువ స్లూయిస్‌ పనులు (ఫైల్‌)

వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులకు మోక్షం

రాయలసీమ లిఫ్ట్‌ కూడా

25 శాతంలో పనులైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం

వాటి విలువ రూ.6,581.96 కోట్లు

పశ్చిమ ప్రాంత కరువు నివారణకు రాష్ట్ర విభజన తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వేదవతి ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా 25 శాతంలోపు పురోగతి ఉన్న పనులు ఆపేసింది. ఎట్టకేలకు బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం.. టెండర్లు పూర్తై మొదలు పెట్టని, 25 శాతంలోపు పురోగతి ఉన్న పనులు కూడా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ, రాయలసీమ లిఫ్ట్‌ సహా రూ.6,581.96 కోట్లు విలువైన ఆరు ప్రాజెక్టులకు మోక్షం లభించింది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

కర్నూలు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంగా వేదవతి ఎత్తిపోత పథకం ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టును సాగునీటి నిపుణుడు, రిటైర్డ్‌ ఈఈ సుబ్బరాయుడు డిజైన్‌ చేశారు. 2019 జవనరి 29న రూ.1,942.80 కోట్లు మంజూరు చేస్తూ జీవో. ఆర్‌టీ.నెం.77 జారీ చేసింది. ఫిబ్రవరిలో టెండర్లు కూడా పూర్తి చేసింది. హైదరాబాద్‌కు చెందిన మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ సంస్థ 4.69 శాతం అధిక (ఎక్సెస్‌) రేట్లకు దక్కించుకొని పనులు మొదలు పెట్టారు. రూ.106.2 కోట్లు (6.61 శాతం) పనులు చేశారు. తక్షణం పనులు మొదలు పెట్టాలంటే రూ.395 కోట్లు అవసరం ఉంది. భూసేకరణకు చేసిన ఖర్చు రూ.78 లక్షలు మాత్రమే. అయితే.. 2019 మేలో జగన్‌ సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. బిల్లులు రావని కాంట్రాక్ట్‌ సంస్థ పనులు ఆపేసింది. స్టేజ్‌-1లో పైపులైన్‌ పనులు, హంద్రీ నీవా కాలువపై స్టేజ్‌-2 పంప్‌హౌస్‌ పనులు అసంపూర్తిగా ఆగిపోయాయి. భూసేకరణ, హాలహర్వి, మొలగవెల్లి జలాశయాలు పనులు, ప్రధాన పైపులైన్‌ పనులు మొదలే కాలేదు. 2019 జూన్‌ 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వీటికి మోక్షం వస్తుందని ఆశిస్తే.. 25 శాతంలోపు పురోగతి ఉన్న పనులు ఆపేయమని ఇచ్చిన జీవో శాపంగా మారింది. తాజాగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఊపిరి పోసింది.

రాయలసీమ లిఫ్ట్‌కు ఓకే

రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ (ఆర్‌డీఎంపీ)లో భాగంగా గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టింది. శ్రీశైలం ఫోర్‌షోర్‌ ఏరియా సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)లో వేయాలి. ఈ పనులకు రూ.2020 మే 5న అప్పటి ప్రభుత్వం రూ.3,825 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నంబరు 203 జారీ చేసింది. ఎస్‌పీఎంఎల్‌-ఎన్‌సీసీ-మెఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) జాయింట్‌ వెంచర్‌గా పనులు దక్కించుకొని రూ.3,307.06 కోట్లతో పనులు చేసేందుకు 2021 ఫిబ్రవరి 27న ఒప్పందం చేసుకున్నారు. దాదాపు రూ.745.46 కోట్ల (22.54 శాతం) విలువ చేసే పనులు చేశారు. గత ఎన్నికల ముందు ఈ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పురోగతి 25 శాతం కంటే తక్కువ ఉండడంతో పనులు ఆపేశారు. తాజాగా ఈ పనులు కూడా కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలపడంతో రాయలసీమ లిఫ్టుకు అడ్డంకులు తొలగిపోయినట్లే అని సీమ సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.

మంత్రివర్గం ఆమోదించిన ఇతర ప్రాజెక్టులు

గోరకల్లు రిజర్వాయర్‌ (జీబీఆర్‌) వద్ద 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 3 వెంట్లతో అడిషనల్‌ ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌, అప్రోచ్‌ ఛానల్‌, లీడింగ్‌ ఛానల్‌ పనులకు రూ.36.95 కోట్లు మంజూరు చేస్తూ 2020 మే 5న అప్పటి ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబరు.203 జారీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్‌ ఎడిఫీసే ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.28.75 కోట్లకు పనులు చేసేందుకు 2021 డిసెంబరు 29న ఒప్పందం చేసుకుంది. అయితే.. పనులు మొదలు కాలేదు.

శ్రీశైలం ప్రాజెక్టు 12 క్రస్ట్‌గేట్లు ప్రత్యేక మరమ్మతులు, గేట్ల రబ్బర్‌ సీల్స్‌ మార్చడం, దెబ్బతిన్న హాయిస్ట్‌ ప్లాట్‌ ఫారం చెక్‌ర్డ్‌ ప్లేట్స్‌ మార్చడం, దెబ్బతిన్న గాంట్రీ-క్రేన్‌ కేబుల్‌, క్యాబిన్స్‌ మార్చడం వంటి పనులకు రూ.1.59 కోట్లు మంజూరు చూస్తూ 2024 ఫిబ్రవరి 6న జీవో ఆర్టీ నంబరు.64 జారీ చేశారు. రూ.1.40 కోట్లకు పనులు చేసుందుకు కర్నూలుకు చెందిన ఎస్‌వీ ఇంజనీరింగ్‌ సంస్థ గతేడాది సెప్టంబరు 20న ఒప్పందం చేసుకుంది. రూ.8 లక్షలు (5.71 శాతం) పనులు మాత్రమే చేశారు.

శ్రీశైలం డ్యాం సైట్‌లో 2,000 కేవీఏ విద్యుత్‌ ట్రాన్స్‌ఫారం కాలిపోయింది. దాని స్థానంలో 1,000 కేవీఏ విద్యుత్‌ ట్రాన్స్‌ఫారం ఏర్పాటుకు రూ.కోటి మంజూరు చేస్తూ గతేడాది ఫిబ్రవరి 2న జీవో ఆర్టీ నంబరు.63 జారీ చేశారు. రూ.88 లక్షలకే ట్రాన్స్‌ఫారం ఏర్పాటుకు హైదరాబాద్‌కు చెందిన ఆర్‌. పాండురంగం అండ్‌ సన్స్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.5 లక్షలు (5.68 శాతం) పనులు మాత్రమే చేశారు.

నంద్యాలలో కేసీ కెనాల్‌ సముదాయంలో తెలుగుగంగ సర్కిల్‌, ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్‌ కార్యాలయ భవనాలు నిర్మాణాలకు రూ.5.25 కోట్లు మంజూరు చేస్తూ 2020 మే 5న అప్పటి ప్రభుత్వం జీవో ఆర్టీ నంబరు.203 జారీ చేసింది. ఈ పనులు రూ.4.88 కోట్లతో చేసేందుకు నంద్యాలకు చెందిన కానాల గోపాల్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ ఒప్పందం చేసుకొని రూ.30 లక్షలు (6.25 శాతం) పనులు మాత్రమే చేశారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జలవనరులు శాఖ పరిధిలో ఆగిపోయిన రూ.6,581.96 కోట్ల విలువైన వేదవతి, ఆర్డీఎస్‌ కుడి కాలువ, రాయలసీమ లిఫ్ట్‌ సహా ఏడు పనులు కొనసాగించేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై రైతులు, సాగునీటి నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:52 PM