బాబోయ్... బంగారం..!
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:07 PM
ప్రస్తుతం మార్కెట్‌లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.
గ్రాము ధర రూ.9,878
వ్యాపారుల్లో భయాందోళన
నేడు అక్షయ తృతీయ
నంద్యాల కల్చరల్, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం మార్కెట్‌లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యులు కొనలేని స్థాయికి బంగారు ధరలు చేరిపోయాయి. ధనిక, పేద అనే తేడా లేకుండా పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు బంగారు కొనుగోలు తప్పనిసరి. ధనవంతులు కాస్త ఎక్కువగా, మధ్య తరగతి ప్రజలు వారి స్థోమతకు తగ్గట్టుగా బంగారు నగలను కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో పసిడి ధరలు అందనంత ఎత్తుకు చేరాయి. ఎప్పటికప్పుడు పసిడి ధరలు ఆల్‌టైం రికార్డులను నమోదు చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారంపై ఉంచుతున్నారు. దీంతో పాటు అమెరికా, చైనా దేశాల మధ్య జరుగుతున్న ఆర్థిక యుద్ధం నేపథ్యంలో మన దేశంలో బంగారు ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈక్రమంలో భారతీయులకు బుధవారం అక్షయ తృతీయ రోజున బంగారును కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది బంగారు గ్రాము ధర రూ.9,878గా ఉంది. ధర ఇలాగే ఉంటే అక్షయతృతీయ సందర్భంగా కొనుగోళ్లు తగ్గుతాయని వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు. నంద్యాల పట్టణంలో సూమారు 200కు పైగా బంగారు దుకాణాలు ఉన్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో సుమారు మరో 100-200 దుకాణాలు ఉంటాయి. పెద్ద దుకాణాల్లో అక్షయ తృతీయ ఒక్కరోజే ఒక్కో దుకాణంలో రూ.30 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతుంది. చిన్న షాపుల్లో స్ధాయిని బట్టి రూ.లక్ష నుంచి రూ.30లక్షల వరకు జరుగుతుంది. ఆరోజున ఉదయం ఆరు నుంచి రాత్రి 11 గంటల వరకు బంగారు దుకాణాలు కళకళలాడుతాయి.
916 బంగారం కొనాలంటే
ప్రజలు ఆభరణాల్లో 916 హాల్‌మార్క్ బంగారాన్నే కొంటారు. మంగళవారం నంద్యాలలో ఓ గ్రాము 22 క్యారెట్(916) బంగారం ధర రూ.8,913 ఉంది. దీనికి 3శాతం జీఎస్టీ, ఆభరణాన్ని బట్టి మేకింగ్ చార్జీలు కలిపితే మరో రూ.640 అదనం. మొత్తంగా ఓ గ్రాము బంగారు ఆభరణం కొనాలంటే రూ.9,700 వరకు చెల్లించాల్సిందే. ఓ తులం బంగారం కొనాలంటే దాదాపుగా రూ.లక్ష ఖర్చు పెట్టాల్సి వస్తోంది. 24 క్యారెట్ బంగారం ధర ఎప్పుడో లక్ష దాటేసింది. మంగళవారం నంద్యాలలో 24 క్యారెట్ బంగారం ధర రూ.9,900గా ఉంది. దీనికి జీఎస్టీ, మేకింగ్ చార్జీలు అదనం.
ధరల పెరుగుదలకు కారణమిదే..!
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య పోరుతో పాటు డాలర్ బలహీనపడ డం వంటి కారణాలతో మదుపరులు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే కాకుండా ప్రభుత్వం కూడా గోల్డ్ నిల్వలు పెంచుకుంటూ ఉంది. యూఎస్ ఎకానమీ పడిపోవడం, డాలర్ మీద నమ్మకం సన్నగిల్లడంతో బంగారంపై పెట్టుబడులు పెట్టడం ప్రత్యామ్నాయంగా మారింది. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం 3,319 డాలర్లకు చేరువలో ఉంది.
పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారం బాగుంది
సామాన్యులు బంగారు దుకాణం వైపు కన్నెత్తి చూడలేని పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాబట్టి వ్యాపారం బాగానే ఉంది. పేదవారు తాళిబొట్టు తప్ప మరేం కొనడం లేదు. గతంలో మా దుకాణంలో రోజుకు సుమారు రూ.25 లక్షల వ్యాపారం జరిగేది. ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం గతేడాది కన్నా మందగించింది. ధర ఇలాగే ఉంటే అక్షయ తృతీయ రోజున కూడా కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది.
- నాగమహేష్, భవనాశి జ్యూవెలర్స్, నంద్యాల