Share News

ఇక లెక్క పక్కాగా..

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:01 AM

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఏ పంటలు సాగు చేస్తారో అదే పంటను రికార్డుల్లో చూపేందుకు వినూత్న రీతిలో ఈసారి డిజిటల్‌ క్రాప్‌ సర్వేను వ్యవసాయ శాఖ యంత్రాంగం చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇక లెక్క పక్కాగా..

ఖరీఫ్‌ సాగులో డిజిటల్‌ సర్వేకు రంగం సిద్ధం

తప్పులకు ఆస్కారం ఉండదు

కర్నూలు అగ్రికల్చర్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఏ పంటలు సాగు చేస్తారో అదే పంటను రికార్డుల్లో చూపేందుకు వినూత్న రీతిలో ఈసారి డిజిటల్‌ క్రాప్‌ సర్వేను వ్యవసాయ శాఖ యంత్రాంగం చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల రెండో వారం నుంచి రైతులు తమ పొలాల్లో కచ్చితంగా ఏ పంటను సాగు చేశారో పూర్తిస్థాయిలో పక్కాగా రికార్డుల్లో నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ సర్వే మొదలెట్టేందుకు వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఢిల్లీ రావు మార్గదర్శకాలు విడుదల చేశారు.

మార్గ దర్శకాలు ఇవే..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 6.25లక్షల హెక్టార్లలో ప్రధాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో ఈక్రాప్‌, ఈకేవైసీ వంటి పద్ధ్దతుల్లో రైతులు సాగు చేసిన పంటలను నమోదు చేసేవారు. ఈ విధానాల వల్ల చాలా తప్పులు చోటు చేసుకున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. బ్యాంకుల్లో ఒక పంట సాగు చేస్తున్నట్లు రుణం తీసుకుంటే వ్యవసాయ శాఖ యంత్రాంగం చేపట్టిన సర్వేలో మరో పంట సాగు చేసినట్లు రికార్డుల్లో నమోదు అయ్యేది. దీంతో రైతులు పంటల బీమా పథకంతో పాటు పంట నష్టపరిహారాన్ని పొందేందుకు అర్హతను కోల్పోవాల్సి వచ్చింది. ఇకపై అటువంటి తప్పులు దొర్లకుండా ఈసారి ఖరీఫ్‌ డిజిటల్‌ క్రాఫ్‌ సర్వే వినూత్న రీతిలో చేపట్టేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా పంట సాగును లెక్కించేందుకు ఉమ్మడి జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం సమాయత్తం అవుతుంది.

ప్రభుత్వం నుంచి బీమా

ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం నుంచి బీమా పొందాలంటే ఈ-పంటే నమోదే కీలకం. భూయజమానికి బీమా పక్కాగా డిజిటల్‌ సర్వే ద్వారానే వర్తించేందుకు ఈసారి అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో పొలం యజమాని తన పొలాన్ని లీజుకు ఇస్తే సీసీఆర్‌ కార్డులు పొందిన కౌలు రైతులు నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉంటుంది.

అనుకూలమైన వాటి వివరాలు..

సాగుకు యోగ్యం కాని వ్యవసాయేతర, ప్రభుత్వ భూములను తొలగించి అనుకూలమైన వాటి వివరాలు నమోదు చేయనున్నారు. ప్రస్తుత వర్గీకరణలతో పాటు ఐదేళ్లుగా పంట వేయని బీడు భూముల వర్గీకరణ అమలులోకి తీసుకువచ్చారు. పొలం గట్ల మీద ఉండే వివిధ రకాల చెట్లు, సాగు చేసిన పంటను కొత్తగా చేపట్టనున్న సర్వేలో చేర్చారు. వ్యవసాయ పంటలు ఎంఏవో, ఉద్యాన పంటలు హెచ్‌వో, సాగుకు యోగ్యం కాని ప్రభుత్వ భూములను ఈసారి తహసీల్దార్‌ పరిశీలించాల్సి ఉంటుంది. వీరు తిరస్కరించిన భూములకు సంబంధించి సరైన కారణాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. తిరస్కరణకు గురైన వాటిని రైతు సేవా కేంద్రం సిబ్బంది తిరిగి క్షేత్ర స్తాయిలో పరిశీలిస్తారు. రీసర్వే చేసిన రికార్డులు వ్యవసాయ శాఖ ఏడీఏ, డీహెచ్‌వో ఆమోదించాల్సి ఉంటుంది. అభ్యంతరకర భూముల్లో జాయింట్‌ కలెక్టర్‌ అనుమతితో సర్వే చేయాల్సి ఉంటుంది. భూమి యజమానితో పాటు కౌలు రైతుకు చెందిన వివరాలు తప్పనిసరిగా కొత్త విదానంలో డిజిటల్‌ సర్వేలో నమోదు చేయనున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:01 AM