Share News

గదులు సరిపోక.. బోధన సాగక

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:29 AM

పట్టణంలోని మండల పరిషత్‌ మెయిన్‌ ప్రాథమిక పాఠశాలకు గదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు

గదులు సరిపోక.. బోధన సాగక
ఆలూరు ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తి గదిలో విద్యార్థుల అవస్థ... అసంపూర్తిగా ఉన్న ఉర్దూ పాఠశాలలో కూర్చున్న విద్యార్థులు

నిలిచిపోయిన తరగతి గదుల నిర్మాణం

ఆలూరు ప్రాథమిక, జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలు

ఆలూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మండల పరిషత్‌ మెయిన్‌ ప్రాథమిక పాఠశాలకు గదులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో ఒకటి నుంచి అయిదు తరగతులు ఉండగా, 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇంత మంది విద్యార్థులకు ఏడు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో గదులు సరిపోక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలకు పదేళ్ల క్రితం రూర్బన్‌ నిధులతో అదనపు గది నిర్మాణన్ని ప్రారంభించారు. నిధుల కొరత కారణంగా పనులు ఆగిపోవడతో ఆ గదుల్లోనే నిలిచిపోవడంతో అందులోనే విద్యార్థులు చదువుతుకుంటున్నారు.

ఉర్దూ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి...

అదే కాంపౌండ్‌లోనే జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో కూడా గదుల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు మొత్తం 75 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరికి 2 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ‘నాడు నేడు’ కింద నూతన భవనం నిర్మించినా పూర్తి కాలేదు. దీంతో ఆ గదిలోనే విద్యార్థులు చదువు సాగిస్తున్నారు. నిలిచిపోయిన భవనాన్ని పూర్తి చేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

భవన నిర్మాణం పూర్తి చేయాలి

పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయితే తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. పదేళ్ల క్రితం నిర్మించిన అదనపు తరగతుల భవనం అసంపూర్తిగా ఉంది. అధికారులు స్పందించి పూర్తి చేయాలి. - ఈరన్న, హెచ్‌ఎం, ఆలూరు మెయిన్‌ స్కూల్‌

గదులు సరిపోవడం లేదు

పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 75 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే రెండు గదులు మాత్రమే ఉండటంతో బోధనకు ఇబ్బందులు వస్తున్నాయి. అసంపూర్తి భవనాల్లోనే బోధన కొనసాగించాల్సి వస్తోంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిధులు లేవంటు న్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి. - సావిత్రి, హెచ్‌ఎం, జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాల, ఆలూరు

Updated Date - Jul 24 , 2025 | 12:29 AM