ఆదోని మార్కెట్‌లో ఆగని వేరుశనగ గ్రేడింగ్
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:58 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయానికి తెచ్చిన వేరుశనగకు మహిళా కూలీల చేత గ్రేడింగ్(పాసింగ్ )చేయించడంపై రైతులు ఆగ్రహం వ్యంక్తం చేస్తున్నారు.
అధికారుల ఆదేశాలు బేఖాతరు
ఆదోని అగ్రికల్చర్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు విక్రయానికి తెచ్చిన వేరుశనగకు మహిళా కూలీల చేత గ్రేడింగ్(పాసింగ్ )చేయించడంపై రైతులు ఆగ్రహం వ్యంక్తం చేస్తున్నారు. గ్రేడింగ్ చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోవడమే కాకుండా సాయంత్రం వరకూ తూకాలు వేసుకోకుండా వ్యాపారులు ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీనిపై పలుమార్లు అధికారులు గ్రేడింగ్ చేయొద్దని వేరుశనగ వ్యాపారులను హెచ్చరించి నోటీసులు జారీ చేసినా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పొలం కల్లాలోనే, ఇంటి వద్దను విక్రయానికి తెచ్చేముందు వేరుశనగ దిగుబడిలో ఉన్న చెత్తాచెదారం, రాళ్లు, మట్టి పెళ్లలు తీసి శుభ్రం చేసుకొస్తున్నామని రైతులు చెబుతున్నారు. వ్యాపారులు మార్కెట్‌లో రైతులు తమ కమిషన్ ఏజెంట్ దుకాణాల ముందు వేరుశనగ దిగుబడిని టెండర్ కోసం రాశులుగా ఉంచితే టెండర్ వేసే సమయంలో వ్యాపారులు పలుచగా పరిచి గ్రేడింగ్ చేస్తున్నారన్నారు. రెండుసార్లు గ్రేడింగ్ చేసి చేయడం వల్ల తాము నష్టపోతున్నామని, ఇలాగే కొనసాగితే వేరే మార్కెట్ కమిటీలకు వెళ్లే పరిస్థితి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులకు నష్టం కలిగించే గ్రేడింగ్ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతున్నారు.