నాన్‌జ్యుడీషియల్ స్టాంపులు వచ్చేశాయ్
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:11 PM
ఎట్టకేలకు నాన్‌జ్యుడీషియల్ స్టాంపులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ప్రజాప్రయోజనాల దృష్ట్యా నాసిక్ నుంచి నాన్‌జ్యుడీషియల్ స్టాంపులను తెప్పించారు.
జిల్లాకు భారీగా స్టాంపులు
వివిధ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు కేటాయింపు
కల్లూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు నాన్‌జ్యుడీషియల్ స్టాంపులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు ప్రజాప్రయోజనాల దృష్ట్యా నాసిక్ నుంచి నాన్‌జ్యుడీషియల్ స్టాంపులను తెప్పించారు. కర్నూలు జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్రయ, విక్రయదారుల అవసరాలకు అనుగుణంగా జిల్లా రిజిస్ట్రార్ కేటాయింపులు జరిపారు. నెలల తరబడి నాన్‌జ్యుడీషియల్ స్టాంపులు లభించకపోవడంతో ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టింది. జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ శాఖకు రూ.16లక్షల విలువ చేసే రూ.50, రూ.32లక్షల విలువ చేసే రూ.100 నాన్ జ్యుడీషియల్ స్టాంపులు జిల్లాకు వచ్చాయి. మీటితోపాటు రూ.2,22,8000 విలువైన ప్రత్యేక రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపుబిల్లులు, కోర్టు రుసుము స్టాంపు బిల్లులు, నోటరీ స్టాంపుబిల్లులు పంపారు. వివిధ స్టాంపులు మొత్తం రూ.2,50,28,000 విలువ చేసే స్టాంపులు జిల్లాకు వచ్చాయి. నాన్‌జ్యుడీషియల్ స్టాంపులను ఆన్‌లైన్ చేసిన అనంతరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు పంపారు. రూ.50 స్టాంపులను కర్నూలు-5000, కల్లూరు-4000, ఆదోని-4000, ఎమ్మిగనూరు-4000 అలాగే రూ.100 నాన్‌జ్యుడీషియల్ స్టాంపులను కర్నూలు-5000, కల్లూరు-5000, ఆదోని-4000, ఎమ్మిగ నూరు-4000 పంపినట్లు అధికారులు తెలిపారు.
ఈ-స్టాంపింగ్ విధానంపై ప్రజల విముఖత: గత వైసీపీ ప్రభుత్వం రిజిస్ర్టేషన్ శాఖలో ప్రవేశపెట్టిన ఈ-స్టాంపింగ్ విధానంపై ప్రజలు విముఖ్యత చూపిస్తున్నారు. ఈ విధానం ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి కక్షిదారులు ఆసక్తి చూపకపోవడం, నాన్‌జ్యుడీషియల్ స్టాంపులపై మొగ్గు చూపడంతో కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్ మార్కెట్‌కు తరలించ కుండా చర్యలు: జిల్లా రిజిస్ర్టేషన్ శాఖ పరిధిలోని 11 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో దాదాపు 150-175 వరకు స్టాంప్ వెండర్లు ఉన్నారు. గతంలో స్టాంప్ వెండర్లకు రిజిస్టర్‌లో నమోదు చేసి నాన్‌జ్యుడీ షియల్ స్టాంపులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి చెప్పి ఆన్‌లైన్ విధానానికి నాంది పలికింది. దీంతో పారదర్శకత పెరిగి అవినీతికి తావులేకుండా క్రయ, విక్రయదారులకు సేవలందించేలా చర్యలు తీసుకుంది.