Share News

మార్కెట్‌ వెలవెల.. కూలీలు విలవిల

ABN , Publish Date - May 17 , 2025 | 12:20 AM

రాష్ట్రంలోనే రెండో స్థానంగా పేరున్న ఆదోని మార్కెట్‌ యార్డు పేరొందింది. పంట దిగుబడుల వ్యాపారంలో పత్తి, అముదాలు, వేరుశనగ, పూల విత్తనాలతో పాటు శనగలు, కందులు సుమారు రూ.1500-1800కోట్ల వ్యాపారం సాగుతుంది.

మార్కెట్‌ వెలవెల.. కూలీలు విలవిల
నిర్మానుష్యంగా పత్తి ప్లాట్‌ఫాం, ఇన్‌సెట్‌లో వెలవెలపోతున్న యార్డు

ఆదోని మార్కెట్‌ యార్డులో నిలిచిన వ్యవసాయ ఉత్పత్తులు

ఉపాధి లేక కూలీలు, హమాలీల అవస్థలు

ఆదోని అగ్రికల్చర్‌, మే16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే రెండో స్థానంగా పేరున్న ఆదోని మార్కెట్‌ యార్డు పేరొందింది. పంట దిగుబడుల వ్యాపారంలో పత్తి, అముదాలు, వేరుశనగ, పూల విత్తనాలతో పాటు శనగలు, కందులు సుమారు రూ.1500-1800కోట్ల వ్యాపారం సాగుతుంది. దీంతో యార్డులో సరాసరి మూడు వేల మంది దాకా హామాలీలు జీవనం సాగిస్తున్నారు. మే నెలలో వ్యవసాయ దిగుబడులు రాకపోవడంతో కూలీలు, హమాలీలకు పనులు లేవు. దీంతో కూలీలు, హామాలీలు వలసబాట పడుతున్నారు. ఇంతకాలం పనులు లేక రైతులు, మధ్య, దిగువ తరగతి కుటుంబాలు వలసబాట పట్టేవారు. ప్రస్తుతం ఈ సెగ మార్కెట్‌ యార్డ్‌కి తాకింది.

సరుకును బట్టి కూలీ

కూలీలు, హమాలీలకు మార్కెట్‌ కమిటీకి వచ్చే సరకును బట్టి కూలి దక్కుతుంది. సరాసరి రూ.800ల వరకు గిట్టుబాటయ్యేది. ప్రస్తుతం రూ.100లు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 500-1000క్వింటాళ్లకు మించి సరకు రావడం లేదు. తాము ఎలా బతకాలని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలలుగా పనులు లేవు

సీజన్‌ ముగియడంతో రెండు నెలల నుంచి మార్కెట్‌ యార్డ్‌కు పంట ఉత్పత్తులు తగ్గాయి. దీంతో పనులు లేవు. రోజు గ్రామాల నుం చి పనికి వచ్చి నిరాశతో ఇం టికి వెళుతున్నాం. రోజుకు కనీసం రూ. వంద కూడా రావడం లేదు. - నగేష్‌, హమాలి

వలస వెళ్తా

సీజన్‌లో రోజుకు రూ.800ల నుం చి 1,200ల వరకు సంపాదించాం. రోజులు ఉన్నాయి. రెండు నెలల నుంచి రోజుకు రూ.వంద కూడా రావడం లేదు. దారి ఖర్చులకే సరిపోతుంది. ఖరీఫ్‌ దిగుబ డులు మూడు నెలల వరకు రావు. తప్పని పరిస్థితిలో బెంగళూరుకు వలస వెళ్తా. - శేఖర్‌, హమాలి

Updated Date - May 17 , 2025 | 12:20 AM