Share News

సంక్షేమం ఎరుగని మత్స్య కార్మికులు

ABN , Publish Date - Jul 10 , 2025 | 01:29 AM

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే శాఖల్లో మత్స్యశాఖ ఒకటి. గత వైసీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్ష మంది మత్స్యకారులు ఉన్నారు.

సంక్షేమం ఎరుగని  మత్స్య కార్మికులు
పాచిపట్టి నిరుపయోగంగా మారిన చేపల తొట్లు, ఇన్‌సెట్‌లో శిథిలావస్థలో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం

గత వైసీపీ పాలనలో పథకాలన్నీ కనుమరుగు..

నేడు ఒక్కో పథకం అమలులోకి..

నేడు జాతీయ మత్స్యకారుల దినోత్సవం

కర్నూలు అగ్రికల్చర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే శాఖల్లో మత్స్యశాఖ ఒకటి. గత వైసీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్ష మంది మత్స్యకారులు ఉన్నారు. నేడు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కార్మికులు కోరుతున్నారు.

కర్నూలు జిల్లాలో మత్స్యశాఖ అధీనంలో 178 చెరువులు, 8 రిజర్వాయర్లు వున్నాయి. సుంకేసుల, గాజులదిన్నె, కర్నూలు, మంత్రాలయంలో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కర్నూలులో 1956లో ఏర్పాటు చేసిన చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ కేంద్రం రాయలసీమలోనే చేపపిల్లల పెంపకం కోసం చేపట్టిన మొదటి కేంద్రం అని అధికారులు తెలిపారు. జిల్లాలో దాదాపు లక్ష మంది చేపల పెంపకం విక్రయాల ద్వారా ఉపాది పొందుతున్నారు. చేపపిల్లల పెంపకం ద్వారా వస్తున్న ఆదాయంలో 50 శాతం నీటి సంఘాలకు, 30 గ్రామ పంచాయతీలకు, 20 శాతం డిపార్టుమెంటుకు ఇచ్చేలా గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలివేటులా మారింది. ఈ జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసి, ఒక్కో పథకాన్ని పునరుద్ధరించడంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు వచ్చినట్లయిందని ఉమ్మడి జిల్లాల మత్స్యకారుల సహకార యూనియన్‌ చైర్మన్‌ నవీన్‌ కుమార్‌ తెలిపారు.

రాయలసీమలో మత్స్యకారుల శిక్షణ కేంద్రం

రాయలసీమలోని 4 జిల్లాల్లో చేపల పెంపకంతో పాటు వాటి వేటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంకేతిక పద్ధ్దతులను నేర్పించేందుకు కర్నూలులోని బంగారుపేటలో 1977లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మూడు నెలల పాటు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటిదాకా 123 బ్యాచ్‌లలో 2,559 మందికి శిక్షణ ఇచ్చారు.

మత్స్యకార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాం

గత వైసీపీ పాలనలో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో మత్స్యకార సంఘాలను బలోపేతం చేస్తున్నాం. అర్హత ఉన్న మత్స్యకారుల ందరికీ ఈ సంఘాల్లో సభ్యత్వం కల్పించేందుకు చర్యలు చేపట్టాము. - నవీన్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా మత్స్యకారుల యూనియన్‌ చైర్మన్‌ నవీన్‌ కుమార్‌

ఘనంగా మత్స్యకారుల దినోత్సవం

మత్స్యకారుల జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. తుంగభద్ర నదితీర సమీపంలో చేపల పెంపకం ఎక్కువగా జరుగుతోంది. ఇందులో భాగంగా కోసిగిలో దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. - రంగనాథరావు, డిప్యూటీ డైరెక్టర్‌

Updated Date - Jul 10 , 2025 | 01:30 AM