Share News

రైతుకు అందని సేవలు

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:03 AM

మండలంలో 15 గ్రామ పంచాయతీలు, 24 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 12 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. 15 పంచాయతీలకుగానూ కేవలం 8 మంది మాత్రమే గ్రామస్థాయి వ్యవసాయ విస్తరణాధికారులుగా కొనసాగుతున్నారు.

రైతుకు అందని సేవలు
హాలహర్విలోని రైతు సేవా కేంద్రం

హాలహర్వి మండలంలో పనిచేసేందుకు ఇష్టపడని సిబ్బంది

పోస్టింగ్‌ వచ్చినా, వెంటనే డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాలకు..

సేవలు అందక రైతుల ఇబ్బందులు

హాలహర్వి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో 15 గ్రామ పంచాయతీలు, 24 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 12 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. 15 పంచాయతీలకుగానూ కేవలం 8 మంది మాత్రమే గ్రామస్థాయి వ్యవసాయ విస్తరణాధికారులుగా కొనసాగుతున్నారు. మండలంలో వ్యవసాయ సిబ్బంది కొరతతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సాగులో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, సలహాలు సూచనలు అందడం లేదు.

వెళ్లిపోతున్న సిబ్బంది

మండలంలో పనిచేసేందుకు వ్యవసాయ సిబ్బంది ఇష్టపడటం లేదు. ఇక్కడ వసతి, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఆదోని, ఆలూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఆదోని నుంచి 34 కి.మీ.లు ఉండగా, ఆలూరు 10 కి.మీ.ల దూరంలో ఉంది. గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణాధికారులకు (ఏఈవో) రెండు, మూడు రైతు సేవా కేంద్రాల ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో వారిపై పని భారం అధికమవుతోంది. తమకు సలహాలు, సూచ నలు ఇవ్వాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని రైతులు ఆరోపిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో సమస్యలు

ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఈ క్రాప్‌ నమోదు, ఈకేవైసీ, పీఎంకిసాన్‌, భూసార పరీక్షలు, విత్తనాల సరఫరా, సూక్మ పోషకాలు, ఎరువుల పంపిణీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంట నష్టనమోదు తదితర సేవలు అందించేవారు లేరు. దీంతో రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతు న్నారు. రైతు సేవకేంద్రం మూసివేసి ఉండటంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి

జిల్లాలో వెనకబడిన హాలహర్వి మండలంలో సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు వ్యవసాయ ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. తమకు సలహాలు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి పూర్తిస్థాయి సిబ్బందిని నిమమించాలని కోరుతున్నారు.

సిబ్బంది కొరత వాస్తవమే

మండలంలో వ్యవసాయ సిబ్బంది కొరత వాస్తవమే. ఇక్కడి రైతు సేవా కేంద్రాల్లో పనిచేయడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. బదిలీపై వచ్చిన వారు కొద్ది రోజులకే డిప్యుటేష న్‌పై వెళ్లిపోతున్నారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారుల కు నివేదిక పంపాం. - వేదానంద, ఏవో, హాలహర్వి

Updated Date - Jun 26 , 2025 | 12:03 AM