Share News

క్లాసులు ఫుల్‌

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:18 AM

విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. మధ్యాహ్న భోజనంలో సమూలమైన మార్పులు చేసి, సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం వడ్డించడం, ‘తల్లికి వందనం’ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, అంతమందికి రూ.15వేలు జమ చేయడంతో ప్రభుత్వ పాఠశాలలకు మరింత ప్రాథాన్యత సంతరించుకుంది. క్రీడలు, ఎన్‌సీసీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పట్టణంలోని నెహ్రూ మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు లేవంటూ నోటీస్‌ బోర్డు పెట్టేశారు.

 క్లాసులు ఫుల్‌
నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలలో సీట్లు లేవని నోటీసు బోర్డు

నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలకు విద్యార్థుల తాకిడి

కిక్కిరిసిన తరగతి గదులు

‘ఎక్స్‌’ ద్వారా మంత్రి నారా లోకేశ్‌ అభినందన

ఆదోని అగ్రికల్చర్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని నెహ్రూ మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. బడి తెరిచిన నాటి నుంచి ప్రతి రోజు సిఫార్సు లేఖలతో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్చుకోవాలని క్యూ కడుతున్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు అడ్మిషన్లు లేవంటూ నోటీసు బోర్డు పెట్టారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ట్విట్టర్‌ ద్వారా హెడ్‌మాస్టర్‌ ఫయాజుద్దీన్‌ను, ఉపాధ్యాయులను అభినందించారు. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్య పట్ల నమ్మకం కల్పించిన హెచ్‌ఎం ఫయాజుద్దీన్‌, ఉపాధ్యాయులను ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ తీర్చిదిద్దే రథసారథులు అంటూ.. మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’ ద్వారా అభినందనలు తెలిపారు.

ఆరు నుంచి పదో తరగతి వరకు..

ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠశాలల్లో 1725 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కోగదిలో 120 మందికి పైగా విద్యార్థులు కూర్చుంటున్నారు. తరగతి గదులు చాలక ఉపాధ్యాయులు ఇక కూర్చోడానికి స్థలం లేదని, మిమ్మల్ని బడిలో చేర్చుకోలేమంటూ నోటీసు బోర్డు పెట్టేశారు. ఆ పాఠశాలకు ఏటా పదో తరగతి తరగతి ఉత్తీర్ణత శాతం పెరుగుతుండటంతో ఉపాధ్యాయులు క్రమశిక్షణతో బోధన చేస్తుండటం, ఎన్‌సీసీ, క్రీడలకు ప్రాథాన్యత ఇస్తుండటంతో తల్లిదండ్రులు ఆ పాఠశాలలో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

450 మందికి అడ్మిషన్‌

2025-26 విద్యా సంవత్సరానికి 450 మంది చేరారు. వీరిలో 450 మందికి అడ్మిషన్‌ నెంబర్‌ ఇవ్వగా.. 25 మందికి అడ్మిషన్‌ నెంబర్‌ ఇవ్వాల్సి ఉంది. ఒక్కో తరగతి గదిలో 120 మందికి పైగా విద్యార్థులున్నారు. తరగతి గదిల్లో కూర్చోడానికి కూడా స్థలం లేక, కొంతమంది విద్యార్థులు నేలపైనే కూర్చొని పాఠాలు వింటున్నారు.

అదనపు తరగతి గదులు నిర్మిస్తే...

కేవలం 20 గదులు మాత్రమే ఉన్నాయి. విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం ‘నాడు-నేడు’ కింద అదనపు తరగతి గదులు 12 నిర్మించినా, అవి మొండిగోడలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తే, పాఠశాల మరింత అభివృద్దితో పాటు ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని తల్లిదండ్రులు అంటున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహం.. ఉపాధ్యాయుల కృషి..

ప్రభుత్వ పాఠశాలలకు కల్పిస్తున్న ప్రోత్సాహంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగింది. దీంతో తమ పాఠశాలలో చేర్చేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ఉపాధ్యాయులు వినూత్న బోధనతో ఆకట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు మన్నించాలని చెబుతూనే ఉన్నా పాఠశాలకు క్యూ కడుతున్నారు. - యాజుద్దీన్‌, హెచ్‌ఎం, నెహ్రూ మెమోరియల్‌ పాఠశాల, ఆదోని

Updated Date - Aug 05 , 2025 | 12:55 AM