Share News

ఇసుక.. తికమక..

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:46 AM

ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగిపోకూడదని ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య వర్గ విభేదాలతో ఇసుక అందడం లేదు. పోలీసులు కూడా ఓ వర్గానికి వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్లను సీజ్‌ చేసి, జరిమాన విధిస్తుండటంతో సరఫరా ఆగింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు ఆగిపోయాయి. ఇలా అయితే పనులు చేయలేమని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక.. తికమక..
నిలిచిపోయిన ఆలూరు కోర్టు భవన నిర్మాణం, ముద్దనగేరి డ్రైనేజీ..

టీడీపీలో వర్గపోరుతో ఆగిన సరఫరా

నిలిచిపోయిన ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు

పోలీసులు ఓ వర్గానికి వత్తాసు పలుకుతున్నారని వెల్లువెత్తుతున్న ఆరోపణలు

ఆలూరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఉచిత ఇసుకను ప్రవేశపెట్టినా అది క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఆలూరు నియోజకవర్గంలో ఇసుక సరఫరా ఆగిపోయి ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేటు నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలైన మార్లమడికి, సిద్ధాపురం, బల్లూరు, గూళ్యం గ్రామాల సమీపంలో, హొళగుంద మండలంలో మార్లమడికి వద్ద ఇసుక లభ్యం అవుతుంది.

రాజకీయ జోక్యం.. పోలీసుల ఆంక్షలు

అయితే అధికార పార్టీలోని రాజకీయ విబేధాలు ఇసుక సరఫరాకు అడ్డంకిగా మారాయి. నాయకుల ప్రోద్బలంతో పోలీసులు ఇసుక ట్రాక్టర్లను సీజ్‌ చేసి, భారీ జరిమానాలు విధిస్తున్నారు. దీంతో ఇసుకను సరఫరా చేసేందుకు ట్రాక్టర్ల యజమానులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక రీచ్‌ నుంచి 4 కి.మీ. మేర ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తీసుకెళ్లవచ్చు. అయితే రాజకీయ విబేధాల కారణంగా సరఫరా ఆగిపోయింది. దీంతో ఆలూరులో రూ.3 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ అతిథి గృహం పనులు, కోర్టులో రూ.30 లక్షలతో నిర్మిస్తున్న భవనంతో పాటు ఆలూరు - హొళగుంద రహదారి పనులు ఆగిపోయాయి.

పోలీసుల తీరుపై వీరభద్రగౌడ్‌ ఆరోపణలు

ఇసుక సరఫరాలో పోలీసుల తీరుపై టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ 15 రోజుల క్రితం ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా ఆరోపణలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఇసుక కొరతపై కలెక్టర్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు

ఆలూరు నియోజకవర్గంలో ఇసుక కొరతపై ఎమ్మెల్యే విరుపాక్షి కలెక్టర్‌ రంజిత్‌బాషాకు ఫిర్యాదు చేశారు. ఇసుక సరఫరాలో రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గకుండా ఉచిత ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఉచిత ఇసుక సక్రమంగా అందేలా చూడాల్సి ఉంది.

ఉచిత ఇసుకను అడ్డుకోరాదు

ప్రభుత్వ నిబంధనల మేరకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ప్రజలే నేరుగా నది నుంచి తెచ్చుకోవచ్చు. ఉచిత ఇసుక సరఫరాను అడ్డుకో రాదు. ఎవరైనా అడ్డుకుంటే మాకు ఫిర్యాదు చేయండి - విజయకుమార్‌, డీటీ, ఆలూరు.

పనులు నిలిపివేశాం

ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుక సరఫరా కాకపోవడంతో పనులు నిలిపివేశాం. ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని పక్కాగా అమలు చేయా లి. పనులకు బిల్లులు సకాలంలో రాకపోయినా పనులు చేస్తున్నాం. ఇసుక కొరత ఉంటే మేము పనులు చేయలేం. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. - వి.ఏ.కె.చౌదరి, కాంట్రాక్టర్‌, ఆలూరు

Updated Date - Sep 02 , 2025 | 12:47 AM