విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల అమ్మకం నిషిద్ధం
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:15 AM
జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద వంద గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్థాల విక్రయం నిషేధించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్
కర్నూలు క్రైం, జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల వద్ద వంద గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత పదార్థాల విక్రయం నిషేధించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం పోలీసు అధికారులతో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థలను సందర్శించి వంద గజాల్లోపు టీషాపులు, పాన్ షాపులు, కిరాణం అంగళ్లలో సిగరెట్లు, కైనీ గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధమని షాపుల నిర్వాహకులకు తెలిపారు. విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించే యజమానులకు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (సీవోటీపీఏ) యాక్టు ప్రకారం జరిమానా విధించారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఈ తరహా నిషేధిత పదార్థాల వినియోగాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సీవోపీటీఏ చట్టం ప్రకారం షాపులను సీజ్ చేసి షాపు యజమానులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.