Share News

ఎంపీఈవోలకు గుర్తింపు ఏదీ?

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:17 AM

వ్యవసాయ శాఖలోని పథకాలు రైతులకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తున్న బహుళ ప్రయోజన విస్తరణాధికారులు(ఎంపీఈవో). 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం వీరిని నియమించింది. గ త వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో పని చేస్తున్న వీరికి గుర్తింపు ఇవ్వకుండా సచివాలయాల వ్యవస్థ తీసుకువచ్చి వీరిని నిర్లక్ష్యం చేసింది. సచివాలయాల సిబ్బందితో అర్హత గల ఎంపీఈవోలు సచివాలయాల సిబ్బందితో పాటు సమానంగా విద్యార్హతలు ఉండి, సమానంగా పని చేస్తున్నా వేతనంలో మాత్రం చాలా తేడా ఉంది. ఎలాగో అలా అరకొర వేతనాలతో బతుకుబండి సాగిస్తుండగా ఐదు నెలలుగా వేతనాలు కూడా అందడం లేదు. దీంతో ఏమిచేయాలో తోచక సమ్మెబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఎంపీఈవోలకు గుర్తింపు ఏదీ?
పాణ్యం వ్యవసాయశాఖ కార్యాలయం

సచివాలయాల సిబ్బందితో సమానంగా విధులు

జీతాలు మాత్రం అంతంతే

ఉద్యోగ భద్రత కరువాయె

ఐదు నెలలుగా అందని వేతనాలు

సమ్మె వైపు అడుగులు?

పాణ్యం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఎంపీఈవోలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నా వారికి గుర్తింపు మాత్రం అం తంత మాత్రమే ఉంది. వ్యవసాయ శాఖను మరింత అభివృద్ధి బాట పట్టించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2014 డిసెంబరు 18న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖలో 306 ఎంపీఈవో పోస్టులను నిర్ణీత గౌరవ వేతనం నెలకు రూ.8వేల చొప్పున నియమించింది. కాంట్రాక్టు పద్ధతిపై రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రాతిపదికన జీవోఆర్‌టీ నెంబరు 693 ఎఅండ్‌సీ (వ్యవసాయ శాఖ2)అనుసరించి మొదటి విడత నియామకాలు జరిపింది. వీరిలో 109 మంది మహిళలున్నారు. ఎంపికలో స్థానికు లకు 80 శాతం, 20 శాతం స్థానికేతరులకు 80శాతం మార్కులతో మౌఖికపరీక్ష ఆధారంగా 20 శాతం మార్కులు పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు.

సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి..

గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖలో పని చేస్తున్న వీరికి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. సచివాలయాల వ్యవస్థ తీసుకువచ్చి నిర్లక్ష్యం చేసిందని ఎంపీఈవోలు ఆరోపిస్తున్నారు. సచివాలయాల సిబ్బందితో అర్హత గల ఎంపీఈవోలు సచివాలయాల సిబ్బందితో పాటు సమానంగా విద్యార్హతలు ఉండి, సమానంగా పనిచేస్తున్నా వేతనంలో మాత్రం సమాన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ద్వారా కలెక్టర్‌ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేశారు. 2014 నుంచి రూ. 8వేల వేతనంతో వీరు పనిచేస్తుండగా 2019లో టీడీపీ ప్రభుత్వం వేతనాన్ని రూ.12 వేలకు పెంచింది. అప్పటి నుంచి వీరి వేతనాలు గానీ, ఎలాంటి ఇతర సౌకార్యాలు పెంచలేదు. వీరికి ఏలాంటి గుర్తిం పు దక్కలేదని ఆరోపిస్తున్నారు. పనికి సమానమైన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగ భద్రత కరువై తక్కువ వేతనంతో బతుకీ డుస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రస్తుత ఖర్చులకు ఈవేతనం ఏమాత్రం సరిపోదని పనిభారం పెరిగిందని సరైన న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చాలీచాలని వేతనాలతో..

మార్చి నెల నుంచి ఇప్పటి వరకు వేతనాలు అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లు ఎంపీఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న వీరి జీవనంపై వేతనాలు అందకపోవడం సమస్య మరింత భారం గా మారినట్లు పేర్కొంటున్నారు. ఐదు నెలలుగా వేతనాలు అంద కుండా ఎలా పని చేయాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వేతనాలు మంజూరు చేయక పోవడంతో ఎంపీఈవోలు సమ్మె బాట పట్టను న్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీఈవోల సంఘాలు పెన్‌డౌన్‌ సమ్మెపై చర్చలు కొనసాగిస్తున్న ట్లు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు రైతులకు చేరువయ్యేలా కృషి చేస్తున్న ఎంపీఈవోల వ్యవస్థ నీరుగారే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి..

ఎంపీఈవోలను ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి. పనితనాన్ని గుర్తించి సరైన న్యాయం చేయాలి. మార్చినుంచి అందాల్సిన వేతనాలు వెంటనే మంజూరు చేయాలి. పని భారం పెరిగింది ఆమేరకు వేతన సవరణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1,394 మంది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 346 మంది ఎంపీఈవోలు విధులు నిర్వహిస్తున్నారు. జింకల ప్రసాద్‌, ఏపీఎంపీఈవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల

వేతన బకాయిలు మంజూరు చేయాలి

ఎంపీఈవోలకు ప్రభుత్వం వేతన బకాయిలు వెంటనే మంజూరు చేయాలి. రైతులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే ఎంపీఈవోలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదు. ఎంపీఈవోల వ్యవస్థను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి. పనికి తగ్గ వేతనాన్ని అందించి న్యాయం చేయాలి. ప్రభుత్వం ఎంపీఈవోల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనలు చేపడుతాం. రామచంద్రుడు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, నంద్యాల

Updated Date - Aug 06 , 2025 | 12:17 AM