కనీస సౌకర్యాలు కరువు
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:14 AM
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి నంద్యాల వేరు అయినా కొన్ని జిల్లా శాఖల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనీస వసతుల్లేక సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతు న్నాయి.
పరిశ్రమల కార్యాలయంలో సమస్యల తిష్ఠ
వేధిస్తున్న సిబ్బంది కొరత
నంద్యాల హాస్పిటల్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి నంద్యాల వేరు అయినా కొన్ని జిల్లా శాఖల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కనీస వసతుల్లేక సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతు న్నాయి. జిల్లా కేంద్రంలో జిల్లా శాఖలకు భవనల్లేక ఇబ్బం దులు పడుతున్నారు. ఇదేకోవలో సమస్యల సుడిగుం డంలో జిల్లా పరిశ్రమల కార్యాలయం కొట్టుమిట్టాడు తోందని చెప్పవచ్చు. 2022లో నంద్యాల జిల్లా కేంద్రం అయిన తర్వాత పద్మావతి నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియంలో జిల్లా పరిశ్రమలశాఖకు ఒక గది కేటాయించి నిర్వహిస్తున్నారు. గది సరిపోక పోవడంతో వరండాలో పార్టిషన్ చేసుకొని సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పరిశ్రమలశాఖకు వాహన సదుపాయం లేకపోవడంతో ఉన్నతాధి కారి జిల్లా అంతటా పర్యటించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అసలే పరిశ్రమలు ఆపై తనిఖీలు చేసేందుకు కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి. అంతే కాకుండా సిబ్బంది కొరత కార్యాలయాన్ని వేధిస్తోంది. పరిశ్రమలు సుదూర ప్రాంతాల్లో ఉండటంవల్ల జిల్లా అధికారి పర్యవేక్షించడం కష్టతరంగా మారింది. సొంత వాహనాల్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లా పరిశ్రమల శాఖను పట్టించుకోలేదని తెలుస్తోంది. గత మూడేళ్లుగా జిల్లా అధికారికి వాహనం లేకపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. డీఎస్‌ఏ అధికారులు వారి సౌకర్యార్థం నిర్మించుకున్న గదిలో పరిశ్రమల కార్యాలయం కొనసాగుతోందని, సొంత భవనానికి మోక్షం ఎప్పుడు వస్తుందోనని పలువురు చర్చించుకుంటున్నారు.
పోస్టుల ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్-1, ఐపీవోలు 3, జూనియర్ అసిస్టెంట్ 1, స్టెనో గ్రాఫర్ 1, టైపిస్ట్ 1, అటెండర్ 1చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి.