శివారుపై శీతకన్ను
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:41 AM
నగర పాలక సంస్థ పరిధిలోని శివారు కాలనీలను అధికారులు పట్టించుకోవడం లేదు.
అభివృద్దికి దూరం...అడుగైనా పెట్టలేరు..
పలు కాలనీల్లో బురదమయమైన మట్టి రోడ్లు
కర్నూలు న్యూసిటీ, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ పరిధిలోని శివారు కాలనీలను అధికారులు పట్టించుకోవడం లేదు. పలుచోట్ల రోడ్లపై రోడ్డు వేస్తున్న అధికారులు తమ ప్రాంతంలో మాత్రం నిర్మించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల చెక్‌పోస్టు, పెద్దపాడు ప్రాంతంలో పదుల సంఖ్యలో కాలనీల్లో నేటికి మట్టి రోడ్లే కనిపిస్తున్నాయి. చిన్న వర్షం కురిస్తే చాలు బురదతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎటుచూసిన అధ్వానమే..
పెద్దపాడు సమీపంలోని రిచ్‌మండ్ కాలనీ, రాజీవ్‌గృహకల్ప, శ్రీనివాసనగర్, శాంతినగర్, శివప్ప కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు లేవు.
ఎఫ్‌సీఐ కాలనీ-2లో ఉన్న భార్గవ్ హోమ్స్, రవిరెడ్డి హోమ్స్, స్కంద ఉన్నతి విల్లాస్‌లో సుమారు వెయ్యి గృహాలు ఉన్నాయి. సరైన రోడ్డు, డ్రైనేజీల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
20వ వార్డులోని బద్రినాథ్‌నగర్, ధనలక్ష్మినగర్, వాసవినగర్‌లో ఈ సంవత్సరం మేలో రూ.73.21 లక్షలతో సీసీ రోడ్డు, కాలువల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయితే పనులు పూర్తికాలేదు.
ఇబ్బందిగా ఉంది
రోడ్లు, డైనేజీ లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. ఇక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంటి పన్నులు, నీటి చార్జీలు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు అభివృద్ధి చేయడానికి ముందుకు రావడం లేదు.్ఝ- నవీన్‌కుమార్, భార్గవ్ హోమ్స్