Share News

డిపో లేదు..బస్సు రాదు

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:44 PM

రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన పత్తికొండ ఆర్టీసీ డిపో మూసివేత దిశగా ముందుకు సాగుతోంది. 1999లో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా ఈ డిపోను ప్రారంభించారు. అయితే 2004లో కాగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనంతరం అప్పటి సీఎం వైస్‌ నష్టాలు వస్తున్నాయన్న కారణంగా 2005లో డిపోను మూసివేయించారు.

డిపో లేదు..బస్సు రాదు
పత్తికొండ శాటిలైట్‌ ఆర్టీసీ డిపోబస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

నిత్యం ప్రయాణికుల అవస్థలు

1999లో పత్తికొండ డిపో ప్రారంభించిన నాటి సీఎం చంద్రబాబు

2005లో డిపోను తొలగించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

2014లో పునః ప్రారంభం, ఆదోని డిపోకు అనుసంధానం

పత్తికొండ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన పత్తికొండ ఆర్టీసీ డిపో మూసివేత దిశగా ముందుకు సాగుతోంది. 1999లో అప్పటి సీఎం చంద్రబాబు స్వయంగా ఈ డిపోను ప్రారంభించారు. అయితే 2004లో కాగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనంతరం అప్పటి సీఎం వైస్‌ నష్టాలు వస్తున్నాయన్న కారణంగా 2005లో డిపోను మూసివేయించారు. పత్తికొండ ప్రాంతం టీడీపీకి కంచుకోటగా ఉన్న కారణంతో లాభాలబాటలో ఉన డిపోను కావాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు మూసివేయించారన్న ఆరోపణలు ఉన్నాయి.

2016లో పునఃప్రారంభించిన కేఈ క్రిష్ణమూర్తి

రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి రావడం, ఎమ్మెల్యేగా గెలిచిన కేఈ క్రిష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన డిపోను 2016లో పునఃప్రారంభించారు. అయితే శాటిలైట్‌ డిపోగా మార్చి, ఆదోని డిపోకు అనుసంధానించారు. కాగా పూర్తిస్థాయి డిపోగా మారుస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదు.

అంతంత మాత్రంగానే బస్సులు

డిపోలో మొత్తం 26 బస్సులు మాత్రమే ఉన్నాయి. సూపర్‌లగ్జరీ-4, ఎక్స్‌ప్రె్‌స్‌-1 కాగా, పల్లెవెలుగు-21 ఉన్నాయి. మరో 4 పల్లెవెలుగు అద్దె బస్సులు నడుపుతున్నారు. వీటిలో సూపర్‌లగ్టరీ సర్వీసులు 4 పత్తికొండ-హైదరాబాద్‌ రూట్‌లో తిరుగుతుండగా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు లను పత్తికొండ-కర్నూలు మార్గంలో తిప్పుతున్నారు. కాగా 2 పల్లెవెలుగు బస్సులు-2 మర్మమతుల కోసం కడపకు వెళ్లగా, మరో బస్సు కర్నూలులో మరమ్మతులు చేయించేందుకు వెళ్లింది.

నామ మాత్రపు సేవలు

పత్తికొండ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కర్నూలు, గుంతకల్లు, ఆదోనికి సర్వీసులు నడుపుతున్నారు. అయితే గుత్తి, ఆలూరు ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేవు. ఒక్కోసారి బస్సులు సిద్ధంగా ఉన్నా డ్రైవర్లు లేక సర్వీసులు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. సమయానికి బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

సాయంత్రం దాటితే నరకమే..

వివిధ ప్రాంతాల నుంచి పత్తికొండకు సాయం త్రం 6గంటలు దాటాక బస్సులు ఉండవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుత్తి, గుంతకల్‌, ఆదోనికి వెళ్లి తిరిగి సాయంత్రం రావాలంటే ఇబ్బందిగా ఉందని, ఆర్టీసీ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

కాలం చెల్లిన బస్సులే ఆధారం..

ఆర్టీసీ నిబంధనల ప్రకారం 4లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సు సర్వీసులను స్ర్కాప్‌కింద పక్కన పెట్టేవారు. గత వైసీపీ ప్రభుత్వం నిబంధనలను సడలించి, బస్సులు ఎన్ని ఏళ్లు తిరిగినా స్ర్కాప్‌ కిందకు రాకుండా నిబంధనలు మార్చారు. దీంతో కాలంచెల్లిన బస్సులు తరచుగా మొరాయించి, ఎక్కడో ఓ చోట ఆగిపోతున్నాయి. ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రభుత్వంతో మాట్లాడి పత్తికొండ డిపోను పూర్తి స్థాయి డిపోగా మార్పుచేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

డిపోగా మారిస్తేనే ప్రయాణికుల కష్టాలు తీరుతాయి

పత్తికొండ ఆర్టీసీ డిపోగా మారిస్తేనే ప్రయాణికుల కష్టాలు తీరతాయి. ఇతర ప్రాంతాల నుంచి పత్తికొండకు రావాలటే ఇబ్బందులు తప్పడం లేదు. ఇక సాయంత్రం 6దాటితే బస్టాండ్లలో వేచి ఉండాలి. అర్ధరాత్రి దూరప్రాంతాల బస్సులు వస్తే నిలుచునే ప్రయాణించి పట్టణానికి రావాలి. అప్పటి డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి డిపోను పునఃప్రారంబించారు. ఆయన వారసుడిగా ఎమ్మెల్యే శ్యాంబాబు పూర్తిస్థాయి డిపోగా మార్చాలని కోరుతున్నాం. - శివ, ప్రయాణికుడు, పత్తికొండ

ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి

పత్తికొండను డిపోను పూర్తిస్థాయిగా మార్చే అంశం మా పరిఽధిలో లేదు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయ అధికారులకే నిర్ణయాధి కారం ఉంటుంది. - శ్రీనివాసులు, ఆర్‌ఎం, కర్నూలు

Updated Date - Jul 19 , 2025 | 11:44 PM