Share News

కార్పొరేషన్‌పై ఎన్‌జీటీ ఆగ్రహం..!

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:36 PM

తుంగభద్ర నది కాలుష్య కోరల్లో చిక్కుకుందా..?

కార్పొరేషన్‌పై ఎన్‌జీటీ ఆగ్రహం..!
ఓల్డ్‌ పంప్‌హౌస్‌ దగ్గర తుంగభద్రలో కలుస్తున్న ముగురునీరు (ఫైల్‌)

తుంగభద్ర నదిలోకి యథేచ్ఛగా మురుగునీరు

కలుషితం అవుతున్న నదులు

రూ.5.20 కోట్లు అపరాధ రుసుము

అప్పీల్‌కు వెళ్లిన కార్పొరేషన్‌ అధికారులు

మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మాణంలో జాప్యం

ఇంజనీర్లకు మెమో జారీచేసిన కమిషనర్‌

తుంగభద్ర నది కాలుష్య కోరల్లో చిక్కుకుందా..? అంటే అవుననే అంటున్నారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. కర్నూలు నగరపాలక సంస్థ డ్రైనేజీలను నేరుగా నదిలోకి వదిలేశారు. మురుగు చేరికతో నదీజలాలు కలుషితం అవుతున్నట్లు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ), సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (సీపీసీబీ) అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలుచేసి తుంగభద్ర జలాలు విషపూరితం అమవుతున్నాయని గుర్తించారు. కార్పొరేషన్‌కు రూ.5.20కోట్లు అపరాధ రుసుం చెల్లించాలని నోటీసులు జారీచేశారు. నది ఏస్థాయిలో కాలుష్య కోరల్లో చిక్కుకుందో ఇట్టే తెలుస్తోంది. తుంగభద్ర, హంద్రీ నదుల్లో కలిసే మురుగునీటిని శుద్ధిచేయాలని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.9కోట్లతో మురుగు నీటిశుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీ) నిర్మాణాలు చేపట్టినా ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. నిర్లక్ష్యంపై కమిషనర్‌ విశ్వనాథ్‌ ఇంజనీర్లకు నోటీసులు జారీ చేశారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర జనాభా ప్రస్తుతం జనాభా ఆరు లక్షలకు పైగా చేరిందని అంచనా. 51 వార్డులు ఉన్నాయి. ప్రజల తాగునీరు, వివిధ అవసరాల కోసం రోజుకు 75-80 మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) సరఫరా చేస్తున్నారు. అందులో 65-70 శాతం నీరు ప్రజల వినియోగం తర్వాత 50-55 ఎంఎల్‌డీ నీరు మురుగు కాల్వలకు చేరుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. ఓల్డ్‌ తుంగభద్ర పంప్‌హౌస్‌, రోజాదర్గా, సంకల్‌బాగ్‌, సాయిబాబా టెంపుల్‌, బండిమెట్ట, రాంబోట్ల టెంపుల్‌ ఏరియా తదితర 14 ప్రాంతాల్లో తుంగభద్ర నదిలో మురుగునీరు కలుస్తుంది. కల్లూరు, కల్లూరు ఎస్టేట్‌, దేవానగర్‌, కృష్ణానగర్‌, చెన్నమ్మ సర్కిల్‌ తదితర కాలనీలకు చెందిన మురుగునీరు హంద్రీనది, వక్కలేరు వాగుల్లో కలసి జోహరాపురం వంతెన సమీపంలో తుంగభద్రలో చేరుతుంది. నదీజలాలు ఏమేరకు కలుషితం అవుతున్నాయో..? అని ఏపీ వాతావరణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మురుగునీటి సమూనాలు సేకరించి పరీక్షలు చేస్తే విషపూరితాలు ఉన్నట్లు వెలుగు చూసినట్లు సమాచారం. మురుగునీటి వల్ల తుంగభద్ర ఏరీతిన కలుషితం అవుతుందో ‘ఆంధ్రజ్యోతి’ సహా పలు పత్రికలు కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చాయి.

నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. కార్పొరేషన్‌ విడుదల చేస్తున్న మురుగునీటి వ్యర్థాల వల్లే తుంగభద్ర జలాలు కలుషితం అవుతున్నాయని నిగ్గు తేల్చింది. రూ.5.20 కోట్లు అపరాధ రుసుం (ఫైన్‌) చెల్లించాలని చెన్నైలోని ఎన్‌జీటీ 2024 డిసెంబరు 23న ఓఏ నంబరు.13/2021(ఎస్‌జడ్‌) తుది ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలల్లో చెల్లించాలని, లేని పక్షంలో 2020 డిసెంబరు 23 నుంచి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఎన్‌జీటీ తీర్పుకు లోబడి అపరాధ రుసుం రూ.5.20 కోట్లు గడువులోగా చెల్లించాలని. లేని పక్షంలో నష్టపరిహారం కూడా చెల్లించక తప్పదని, 57.6 ఎంఎల్‌డీ సామర్థ్యంలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీ) తక్షణమే పూర్తి చేసి మురుగునీరు శుద్ధి చేయాలని, 12 నెలల్లోగా ఈ పనులు పూర్తి చేయాలని విజయవాడకు చెందిన ఆంరఽధప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీ పసీబీ) సభ్య కార్యదర్శి గతనెల జూలై 23న కార్పొరేషన్‌ అధికా రులకు నోటీసులు జారీచేశారు. ఆ దిశగా చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. 13 ఎస్‌టీపీ ప్లాంట్‌లు నిర్మిస్తామని కర్నూలు కార్పొరేషన్‌ అధికారులు గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన అఫిడ విట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. సకాలంలో అపరాధ రుసుం చెల్లించకపోవడంతో ప్రతి నెల ఒక్కో ఎస్‌టీపీకి రూ.5లక్షలు చొప్పున 13 ఎస్‌టీపీలకు రూ.65లక్షలు వరకు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎస్‌టీపీల నిర్మాణంలో జాప్యం.. కార్పొరేషన్‌కు శాపం

మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్‌టీపీ) నిర్మాణంలో అంతులేని జాప్యం కర్నూలు కార్పొరేషన్‌కు శాపంగా మారింది. ఓల్డ్‌ పంప్‌హౌస్‌, సంకల్‌బాగ్‌, హంద్రీ నది దగ్గర ఏర్పాటుచేసిన మూడు ఎస్‌టీపీ ద్వారా 2.40ఎంఎల్‌డీల మురుగునీరు శుద్ధి చేయవచ్చు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.9కోట్లతో తుంగభద్రలో హంద్రీ నది కలిసే జోహరాపురం బ్రిడ్జి వద్ద 10 ఎంఎల్‌డీలు, హంద్రీ నదిపై దేవనగర్‌ వద్ద 2 ఎంఎల్‌డీల సామర్థ్యంలో ఎస్‌టీపీల నిర్మాణం 2018లో చేపట్టారు. ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగా ఉన్నాయి. గత వైసీపీ హయాంలో నిర్లక్ష్యం శాపంగా మారింది. మరో 35 ఎంఎల్‌డీ సామర్థ్యంలో రాంబోట్ల దేవాలయం సమీపంలో ఎస్‌టీపీలు నిర్మించాలని రూ.79 కోట్లతో పంపిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.

ఇంజనీర్లకు నోటీసులు జారీ

ఎస్‌టీపీనిర్వహణలో నిర్లక్ష్యం, అసంపూర్తి పనులు చేయడంలో జాప్యంపై నగరపాలక సంస్థ ఎస్‌ఈ శేషసాయి, డీఈఈ జి. గంగాధర్‌, ఏఈఈ సీవీఆర్‌ వైష్ణవిలకు కమిషనర్‌ విశ్వనాథ్‌ ఆర్‌సీ నంబరు.543158/2025/సీ1 కింద మెమో జారీ చేశారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన గడువు డిసెంబరుతో ము గుస్తుంది. ప్రజారోగ్య (పబ్లిక్‌ హెల్త్‌) విభాగం సంకల్‌బాగ్‌ వద్ద 0.8ఎంఎల్‌డీ, జమ్మిచెట్టు వద్ద 0.8 ఎంఎల్‌డీ, తుంగభద్ర పాత పంప్‌ హౌస్‌ వద్ద 0.8 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌టీపీలు నిర్మించి 2022లో కార్పొరేషన్‌కు అప్ప గించింది. సంకల్‌బాగ్‌ వద్ద ఉన్న ఎస్‌టీపీ తప్పా మిగిలిన రెండు ఎస్‌టీపీలు పని చేయడం లేదు. వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదు..? గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తుది ఉత్తర్వుల గడువు ముగుస్తుం దని, ఆ తర్వాత భారీ జరిమానా చెల్లించిం చాల్సి వస్తుందనే విషయం కూడా తెలిసి ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు..? రాత పూర్వకంగా వివరణ కోరుతూ వారిని మెమో జారీ చేయడం కార్పొరేషన్‌లో చర్చగా మారింది.

అప్పీల్‌కు వెళ్లాం

ఎస్‌టీపీ నిర్వహణలో నిర్లక్ష్యంపై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఎస్‌ఈ, డీఈఈ, ఏఈఈలకు మెమోలో జారీ చేశాం. మురుగునీరు తుంగభద్రలో కలసి నదీజలాలు కలుషితం అవుతాయని కేసు నమోదుచేసిన ఎన్‌జీటీ రూ.5.20 కోట్లు అపరాధ రుసుం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లాం. 50 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ఎస్‌టీపీలు నిర్మించాల్సి ఉంది. ఉన్నవాటిని సక్రమంగా నిర్వహణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

విశ్వనాథ్‌, కమిషనర్‌, నగరపాలక సంస్థ, కర్నూలు

Updated Date - Aug 21 , 2025 | 11:36 PM