త్వరలో కొత్త బార్లు
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:28 PM
2025-28 బార్ నూతన పాలసీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ రంజిత్ బాషా ఈ ప్రక్రియలో గీత కార్మికులకుమూడు బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.
జిల్లాలో 23 బార్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్
26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
28న జిల్లా పరిషత్ లో లాటరీ పద్ధతిలో ఎంపిక
ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు
కర్నూలు అర్బన్, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): 2025-28 బార్ నూతన పాలసీకి నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ రంజిత్ బాషా ఈ ప్రక్రియలో గీత కార్మికులకుమూడు బార్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రెండు రోజుల్లో జారీ కానుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం. సుఽధీర్‌బాబు తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ తన చాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నూతన బార్ పాలసీ విఽధి విధానాలు వెల్లడించారు. జిల్లాలో 23 బార్లకు నోటిఫికేషన్ జారీ అయిందని తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఈనెల 26 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 28న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ రంజిత్ బాషా చేతుల మీదుగా లాటరీ పద్ధతిలో బార్ల ఎంపిక ప్రక్రియ సాగుతుందని తెలిపారు. ఒక్కో బార్‌కు 4 దరఖాస్తులు, ఆపైన ఉంటేనే లాటరీ పద్ధతికి అర్హత ఉంటుందని, ప్రతి దరఖాస్తుదారుడు దరఖాస్తు రుసుం(నాన్ రీఫండబుల్) రూ.5 లక్షలు, రూ. 10 వేలు ప్రాసెసింగ్ రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రిటైల్ దుకాణాలతో పోలిస్తే తక్కువ లైసెన్సు ఫీజు ఉంటుందని తెలిపారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 55 లక్షలు, 5 లక్షలు పైబడి ఉన్న ప్రాంతాల్లో రూ. 75 లక్షల చొప్పున లైసెన్సు రుసుం ఉంటుందని తెలిపారు. లాటరీ ద్వారా పారదర్శకతను ప్రోత్సహిస్తుందని, అవకతవకలకు అవకాశం లేకుండా చేస్తుందని, తక్కువ ఖర్చుతో కొత్త వారికి ఈజీ ఆఫ్ డూయింగ్ ఉంటుందని, రుసుంను వాయిదాల రూపంలో చెల్లించే వెసులు బాటు ఉందని తెలిపారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలో బార్లు దక్కించుకున్న వారు నగరం చుట్టు పక్కన 10 కిలోమీటర్లలోపు ఎక్కడైనా బార్లను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. గీత కులాలకు కేటాయించిన బార్లలో రెండు కర్నూలు నగరంలో ఈడిగ-1, గౌడ్-1, ఆదోని పట్టణంలో ఈడిగ-1 కులానికి బార్లను కేటాయించారు. బార్లకు మూడేళ్ల పాటు అనుమతులు ఉంటాయని చెప్పారు. దరఖాస్తుదారులు జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంతో పాటు ఆన్ లైన్, ఆఫ్‌లైన్ , ప్రొఫెసనల్ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు ఈ-రిసిప్ట్‌తో లాటరీ ప్రక్రియకు వెళ్లాలని తెలిపారు. సమావేశంలో సీఐలు రాజేంద్ర ప్రసాద్, చంద్ర హాస్ పాల్గొన్నారు.