నేత్రపర్వం.. నృసింహుడి రథోత్సవం
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:53 PM
‘జయజయ సింహ.. జయనారసింహ.. ’ నినాదాలతో ప్రముఖ వైష్ణవక్షేత్రం అహోబిలం మార్మోగింది. వేలాది గొంతుకలు గోవిందనామస్మరణతో చేస్తుండగా జ్వాలా నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది.

ఎగువ అహోబిలంలో ఘనంగా రథోత్సవం
దిగువలో కాళింగ న ర్తనోత్సవం, తొట్టి తిరుమంజనం
అశ్వ వాహనంపై విహరించిన ప్రహ్లాదవరదస్వామి
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 13(ఆంధ్రజ్యోతి): ‘జయజయ సింహ.. జయనారసింహ.. ’ నినాదాలతో ప్రముఖ వైష్ణవక్షేత్రం అహోబిలం మార్మోగింది. వేలాది గొంతుకలు గోవిందనామస్మరణతో చేస్తుండగా జ్వాలా నరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయదేవేరులతో కొలువైన జ్వాలా నరసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు ఉదయం శాస్త్రోక్తంగా నవకలశ తిరుమంజనం, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవీ, భూదేవీ సమేత జ్వాలా నృసింహస్వామి ఉత్సవమూర్తులను పట్టుపీతాంభరాలు, పుష్పమాలలతో అలంకరించి మేళతాళాలతో ఆలయం వెలుపల ఉన్న రథం వరకు తీసుకొచ్చారు. శోభాయమానంగా ముస్తాబు చేసిన రథంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి రథాంగ పూజలు, మంగళహారతి సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో రథోత్సవ వేడుకలు జరిగాయి.
ఘనంగా ‘కాళింగ నర్తనోత్సవం’
బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీదేవీ, భూదేవీ సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించి కాళింగనర్తనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో కొలువుంచి కమనీయంగా గ్రామోత్సవం నిర్వహించారు. పట్టువస్త్రాలతో శోభాయమానంగా అలంకరించిన ప్రహ్లాదవరదస్వామి అశ్వ వాహనంపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో శుక్రవారం వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నారు.