నాడు నిర్లక్ష్యం.. నేడు నిందలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:07 AM
నాడు నిర్లక్ష్యం.. నేడు నిందలు
శంకుస్థాపన చేసిన ఏడాదికి మొదలైన ఆదోని మెడికల్ కళాశాల పనులు
రూ.71 కోట్ల పనులు చేస్తే.. రూ.24 కోట్లు బకాయి
బిల్లులు రావని అప్పుడే చేతులెత్తేసిన కాంట్రాక్టర్
ఇప్పుడు పనులన్నీ పూర్తిచేసినట్లు వైసీపీ నేతల ప్రచారం
జగన్ తప్పిదాలను కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆదోని మెడికల్ కాలేజీ నిర్లక్ష్యానికి గురైంది. రూ.71 కోట్లు విలువైన పనులు చేస్తే రూ.24కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ పెట్టేసింది. జగన్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో కూటమి ప్రభుత్వం రావడానికి ఏడాది ముందే కాంట్రాక్టర్ చేతులె త్తేశారు. ఒకటి రెండు భవనాలు మాత్రం స్లాబులు వేశారు. మెజారిటీ భవనాలు పునాదులు, పిల్లర్లు వద్దే ఆగిపోయాయి. అక్కడ మెడికల్ కాలేజీ నిర్వహించేందుకు ఏమాత్రం అవకాశం లేదు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తొలి దశలో ఐదు వైద్య కళాశాల నిర్మాణం, నిర్వహణ పబ్లిక్, ప్రైవేటు, భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు ఆమోదం తెలిపింది. అందులో ఆదోని మెడికల్ కాలేజీ ఒకటి. తమ హయాంలోనే వైద్య కళాశాల భవనాలు మొత్తం పూర్తిచేసినట్లు, కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు వైసీపీ నాయకులు కళాశాల పరిశీలన పేరిట కూటమి ప్రభుత్వంపై అపనిందలు వేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కప్పిపుచ్చే ఎత్తులు వేస్తున్నారు. ఆదోని వైద్య కళాశాల తాజా పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదోని మెడికల్ కళాశాల విషయంలో వైసీపీ నాయకులు ఛీప్ ట్రిక్కులు ప్లేచేస్తున్నారు. ఈ వైద్యకళాశాలను 420 బెడ్స్ బోధనాస్పత్రి వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం పనులు మొద లు పెట్టారు. 13.31లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ, రెసిడెన్షియల్ స్టాఫ్ క్వార్టర్స్, నర్సింగ్ కాలేజీ, విద్యార్థుల వసతిగృహాలు, జూనియర్, సీనియర్ రెసిడెన్స్ హాస్టల్, నర్సింగ్ విద్యార్థుల వసతి గృహం, వర్కింగ్ స్టాఫ్ నర్స్ క్వార్టర్స్, హాస్టల్, సెంట్రల్ కిచెన్, డైనింగ్, ఎంజీపీఎస్ ప్లాంట్ రూమ్స్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్, బయో మెడికల్ వేస్ట్ ప్లాంట్ రూమ్స్, సెంట్రల్ డ్రగ్ స్టోర్, లాండ్రీ, మార్చురీ వంటి భవన నిర్మాణాల కోసం నాబార్డు రుణం రూ.475 కోట్లు ఇచ్చింది. అందులో కాం ట్రాక్ట్ విలువ రూ.350 కోట్లతో సివిల్ పనులకు ఆంధ్రప్రవేశ్ మెడికల్ సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌ఐడీసీ) టెండర్లు పిలిస్తే, విజయ వాడకు చెందిన కేఎంవీ గ్రూప్ సంస్థ టెండర్లు దక్కించుకుంది. 30 నెలల్లో పూర్తి చేయాలని ఒప్పందం. 2021 మే 31న అప్పటి సీఎం జగన్ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేస్తే, 18 నెలలు వరకు గంపెడు మట్టి తీయలేదు.. ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. అప్పటి వైసీపీ ముఖ్య నాయకులకు కాంట్రాక్ట్ సంస్థ మధ్య వాటాల తేడాలు రావడంతో పనులు మొదలు పెట్టలేదని నాడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎట్టకేలకు 2022 డిసెంబరు 26న ఒప్పందం చేసుకొని పనులు మొదలు పెట్టారు.
రూ.47 కోట్లు మాత్రమే చెల్లింపు
నాడు జగన్ శంకుస్థాపన చేసిన ఏడాదిన్నర తర్వాత పనులు మొదలు పెట్టిన కాంట్రాక్ట్ సంస్థ రూ.71కోట్లు విలువైన పనులు మాత్రమే చేసింది. రూ.47కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా రూ.24కోట్లు బిల్లులు చెల్లంచాల్సి ఉండేది. అప్పటికే ఎన్నికల వాతావరణం ఏర్పడడంతో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 2024 జూన్ 11 నాటికి ఏడాది ముందే కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరు నెలలకు మించి పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20శాతం కంటే తక్కువ పురోగతి ఉన్న పనులు ఆపేసింది. అందులో ఆదోని వైద్య కళాశాల కూడా ఉంది. బాలిక హాస్టల్ భవనం, కాలేజీ, అకాడమిక్ భవనాలు ఒక్కటే స్లాబులు పూర్తిచేశారు. మిగిలిన అన్నీ భవనాలు కూడా పిల్లర్లు, పునాదులతోనే ఆగిపోయాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నాటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అదేదో గత ప్రభుత్వ హయాంలోనే కళాశాల భవనాలు అన్ని పూర్తిచేసినట్లు, కూటమి ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా నాటి తప్పిదాలను కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారు. నాడు జగన్ శంకుస్థాన చేసిన ఏడాదిన్నర తర్వాత ఎందుకు పనులు మొదలు పెట్టారు? కూటమి ప్రభుత్వం రావడానికి ఏడాది ముందే పనులు ఎందుకు ఆపేశారు? ఈ ప్రశ్నలకు వైసీపీ నాయకుల వద్ద సమా ధానాలు లేవు.
భూసేకరణలో భారీ అవినీతి?
ఆదోని వైద్య కళాశాల నిర్మాణం కోసం జాతీయ రహదారి-167 పక్కనే ఆరేకల్లు గ్రామ సమీపంలో ఆరేకల్లు, కె.నాగులాపురం గ్రామాలకు చెందిన రైతుల నుంచి 59.50 ఎకరాలు సేకరించారు. ఎకరం రూ.40లక్షలు భూ పరి హారం ప్రభుత్వం చెల్లించింది. జాతీయ రహదారి ఆనుకొని ఉన్న పొలాలకు భారీ డిమాండ్ ఉంటుంది. దూరంగా ఉన్న పొలాలకు డిమాండ్ కొంత తక్కువగా ఉంటుంది. అయినా కూడా 59.50ఎకరాలకు ఒకే ధర చెల్లించా రు. భూ పరిహారం మొత్తం రైతులకు చేరిఉంటే తప్పులేదు. భూ సేకరణ పేరిట గత ప్రభుత్వ హయాంలో అప్పటి వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి ఒకరు, ఆ నాయకుడికి నమ్మినబంటుగా ఉంటున్న మరో నాయకుడు, ఓ రెవెన్యూ కిందిస్థాయి అధికారి కలసి భూ సేకరణ పేరిట భారీ అవినీతి అక్రమాలకు తెర తీశారని అప్పుడే ఆరోపణలు వచ్చాయి. జీవనాధారమైన భూములు కోల్పోయిన రైతుల నుంచి ఎకరాకు రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పైగా అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణులు బలంగా ఉన్నాయి. దీనిపై ఏసీబీ లేదా సీఐడీ అధికారులతో సమగ్ర విచారణ చేస్తే రూ.కోట్లు విలువైన కుంభకోణం వెలుగు చేసే అకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. వైద్య కళాశాల నిర్మించే ప్రదేశానికి కేవలం ఆరేడు కిలోమీటర్ల దూరంలోనే వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ కాకుండా ఓ ముఖ్య నాయకుడికి మేలు చేసేందుకే అప్పట్లో ప్రభుత్వ భూమిని కాదని, రైతుల నుంచి భూ సేకరణ చేశారనే ఆరోపణ కూడా లేకపోలేదు.