Share News

పొగాకు కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 12 , 2025 | 11:32 PM

పొగాకు కంపెనీలు ఒప్పందం చేసుకున్న విధంగా పొగాకును కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, రైతులు డిమాండ్‌ చేశారు.

పొగాకు కొనుగోలు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతులు

కలెక్టరేట్‌ ఎదుట రైతుల ధర్నా

నంద్యాల నూనెపల్లె, మే 12 (ఆంధ్రజ్యోతి): పొగాకు కంపెనీలు ఒప్పందం చేసుకున్న విధంగా పొగాకును కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, రైతులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. నాణ్యమైన పొగాకు బేళ్లతో నిరసన చేపట్టారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 39వేల ఎకరాల్లో రైతులు పొగాకును పండించారన్నారు. ఒప్పందం చేసుకున్న పొగాకు కంపెనీలు పొగాకును కొనుగోలు చేయకుండా మోసం చేశాయని, దీంతో పండించిన పంటను ఏం చేయాలో అర్థంకాక రైతులు తలలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టారన్నారు. ప్రస్తుతం పంటచేతికొచ్చాక ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం లేక, బయట కల్లాల్లో ఉంచితే వర్షం వల్ల నష్టపోయే ప్రమాదం ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారన్నారు. పెట్టుబడికోసం తెచ్చిన అప్పుదారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు పండించిన పంటకు క్వింటాలుకు రూ.18వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వమైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ రాజకుమారికి రైతు సంఘం నాయకులు, రైతులు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, మహానంది, రుద్రవరం, ఆళ్లగడ్డ, కొత్తపల్లె, పాణ్యం, గడివేముల, శిరివెళ్ల మండలాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:32 PM