ఉజ్వల భవితకు ‘నవోదయ’
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:32 AM
ఉన్నత ప్రమాణాలను అనుసరిస్తూ.. ఉత్తమ విలువలతో విద్యాబోధనతో పాటు విద్యార్థులను అన్నిరంగాల్లో తీర్చిదిద్దేది జవహర్ నవోదయ విద్యాలయం. 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
ఆరో తరగతిలో ప్రవేశాలకు విడుదలైన నోటిఫికేషన్
పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థులకు గొప్ప అవకాశం
అత్యుత్తమ ప్రమాణాలతో విద్యా బోధన
శిరివెళ్ల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఉన్నత ప్రమాణాలను అనుసరిస్తూ.. ఉత్తమ విలువలతో విద్యాబోధనతో పాటు విద్యార్థులను అన్నిరంగాల్లో తీర్చిదిద్దేది జవహర్ నవోదయ విద్యాలయం. 2026-27 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు సాధిస్తే తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినట్లేనని పేద, మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులు భావిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు సృజనాత్మకమైన పద్ధతుల్లో విద్యాబోధన, దేశభక్తి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి తదితర వాటిని ప్రాథమికస్థాయి నుంచే అందిస్తూ పాఠశాలస్థాయిలోనే విద్యార్థుల్లో వాస్తవ దృక్పథాన్ని పెంపొందిస్తూ వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతారు. నవోదయ విద్యాలయాల్లో విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాల సౌకర్యాలను ఉచితంగా అందిస్తున్నారు.
ప్రతిభ చూపితే సీటు..
కేంద్ర ప్రభుత్వం 1986లో జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలంలోని బనవాసిలో జవహర్ నవోదయ విద్యాలయం 1987లో ఏర్పాటైంది. ఇందులో ఆరో తరగతిలో చేరేందుకు మొత్తం 80 సీట్లు ఉన్నాయి. నంద్యాల, కర్నూలు రెండు జిల్లాలకు ఒకే ఒక విద్యాలయం కావడంతో పోటీ తీవ్రత సైతం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రతిభ ఆధారంగానే విద్యార్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన విద్యార్థులు జూలై 29, 2025లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు డిసెంబరు 13, 2025న రాత పరీక్ష నిర్వహించనున్నారు. గతంలో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అనర్హులు.
పరీక్ష విధానం..
మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషలో ప్రశ్నాపత్రాలుంటాయి. విద్యార్థులకు ఆఫ్‌లైన్(ఓఎమ్‌ఆర్ ఆధారిత) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు గాను రెండు గంటల వ్యవధి ఇస్తారు.
సీబీఎస్‌ఈ సిలబస్‌లో..
నవోదయలో సీటు సాధించిన విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచితంగా సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబోధన చేస్తారు. మెరుగైన విద్యతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్స్, బూట్లు, స్టేషనరీ ఉచితంగా అందిస్తారు. కంప్యూటర్ కోర్సులతోపాటు సంగీతం, డ్రాయింగ్, క్రాఫ్ట్స్, క్రీడలు, నృత్యం వంటి వాటిల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాలురు, బాలికలకు వేరువేరుగా వసతి కల్పిస్తారు.
దరఖాస్తు చేయడం ఇలా..
విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. విద్యార్థులు తప్పనిసరిగా మే 1, 2014 నుంచి జూలై 31, 2016 మధ్య జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుప రిచిన దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నింపి ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి. పూర్తిచేసిన దరఖాస్తుపై అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకం చేయాలి. ఆ దరఖాస్తును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా ధ్రువీకరించాలి. తిరిగి ఆ ఫారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం చొప్పున సీట్లను కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 33 శాతం బాలికలకు కేటాయిస్తారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో చేరడానికి అవకాశం కల్పిస్తారు.
ప్రణాళికతో పరీక్షకు సిద్ధమైతే విజయం..
నవోదయ ప్రవేక్ష పరీక్షకు సరైన ప్రణాళికతో సిద్ధమైతే విజయం సాధించొచ్చు. నవోదయ విద్యాలయంలో సీటు ఇప్పిస్తామని దళారులు చెబితే విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మొద్దు. ప్రవేశ పరీక్షలో విద్యార్థులు సాధించేమార్కులు, రిజర్వేషన్ ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయిస్తాం. - పద్మావతి, ప్రిన్సిపాల్, నవోదయ విద్యాలయం, బనవాసి