Share News

ఘనంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవం

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:18 PM

జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జాతీయ న్యాయ సేవల దినోత్సవం
ప్రసంగిస్తున్న శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌

కర్నూలు లీగల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని లోక్‌ అదాలత్‌ భవనంలో జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి ఆదేశాల మేరకు శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ ఎం.వెంకట హరినాథ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్టు 1987లో మన దేశంలో 1995 సంవత్సరం నవంబరు 9వ తేదీన అమలులోకి వచ్చిందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని నిర్వహించుకుంటామని తెలిపారు. రాజ్యాంగంలోని 39ఏ అధికరణం ప్రకారం ఆర్థిక, సామాజిక వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరాం మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందించడంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ శారద మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సమన్వయంతో మహిళలకు, పిల్లలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో అనూరాధ, ప్యానెల్‌ అడ్వకేట్లు, ప్రసూన న్యాయ కళాశాల విద్యార్థులు, పారా లీగల్‌ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:18 PM