ఆత్మకూరులో నన్నారీ తయారీ కేంద్రం
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:42 PM
గిరిజనులు అత్యధికంగా నివసిం చే ఆత్మకూరు ప్రాంతంలో నన్నారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్ర్తీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడిం చారు.
శ్రీశైలంలో రూ.కోటితో గిరిజన ఉత్పత్తుల కేంద్రం
జీవనప్రమాణాల పెంపునకు కృషి
స్ర్తీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
ఆత్మకూరు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): గిరిజనులు అత్యధికంగా నివసిం చే ఆత్మకూరు ప్రాంతంలో నన్నారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర స్ర్తీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడిం చారు. మంగళవారం శ్రీశైల దేవస్థానం పరిధిలోని సమావేశ భవనం నందు స్ర్తీశిశు సంక్షేమం, గిరిజన శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలోని 7 ఐటీడీఏల్లో రూ.కోటి చొప్పున గిరిజన ఉత్పత్తుల కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే శ్రీశైలంలో కూడా రూ.కోటి నిధులతో గిరిజన ఉత్పత్తుల కొనుగోలు కేంద్రానికి శంకుస్థాపన చేయ నున్నట్లు వివరించారు. ఇక్కడ అన్ని గిరిజనఉత్పత్తులు విక్రయించుకునే వెసు లుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. తద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. నల్లమలలోని చెంచు గిరిజనులందరికి ఆధార్, రేషన్ కార్డులను మంజూరు చేసి సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా గిరిజన గూడేలకు అటవీ శాఖతో అభ్యంతరాలు తలెత్తకుండా రహదారులను ఏర్పా టు చేస్తామని అన్నారు. కాగా శ్రీశైలంలో గిరిజనులకు ప్రస్తుతం కేటాయించిన దుకాణాల కంటే అదనంగా దుకాణాలను కేటాయించేలా దేవస్థానం అధికారులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. అదేక్రమంలో గిరిజనులకు తక్కు వ ధరలకే దుకాణాలను కేటాయించాలని ఆదేశించారు. ఇదిలావుంటే ఉచిత బస్సు పథకం మహిళలకు చంద్రన్న ఇచ్చిన వరం లాంటిదని అన్నారు. అయితే ఈ పథకం పట్ల కొందరు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆత్మలతో మాట్లాడే.. పిచ్చొళ్ల గురించి తాను మాట్లాడనని పరోక్షంగా మాజీ సీఎం జగన్‌ను విమర్శించారు. అనంతరం శ్రీశైలం ఐటీడీఏ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ సమావేశంలో ట్రైబర్ వెల్ఫేర్ కమిషనర్ సదాభార్గవి, కలెక్టర్ రాజకుమారి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఈవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ పనితీరుపై సమీక్ష
నంద్యాల జిల్లా పరిధిలోని స్ర్తీ, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,663 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 1,620 ప్రధాన, 43 మినీ అంగన్‌వాడీలు ఉన్నట్లు తెలిపారు. 2 వర్కర్లు, 2 మినీ వర్కర్లు, 40 హెల్పర్లు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించి వాటిని భర్తీ చేయాలన్నారు. బాల సంజీవని పోషణ పథకాలు విజయ వంతంగా అమలు అవుతున్నాయన్నారు. గర్భిణులు, బాలిం తలతో పాటు చిన్నారులకు ఉచితంగా గుడ్లు, పాలు, మల్టిగ్రేన్, పిండి తదితర పోషకాహారం అందిస్తున్నట్లు చెప్పారు. పథకాల ద్వారా లక్ష మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతోంద న్నారు. 2024లో ఏర్పడిన శిశు సంరక్షణ యూనిట్ ద్వారా 157 మంది పిల్లలను రక్షించినట్లు తెలిపారు. బాల్యవివాహాలు, పీఓసీఎస్‌ఓ బాల కార్మిక కేసుల్లో చర్యలు తీసుకున్నామన్నారు. వైద్య, కౌన్సెలింగ్ సేవలను అందిస్తున్నట్లు వివరించారు. మహిళలు, పిల్లల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.