అతి వేగానికి నిండు ప్రాణం బలి
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:06 AM
అతి వేగానికి ఓ నిండు ప్రాణం బలి అయ్యింది. అంబులెన్స్‌ను లారీ ఢీకొన్న ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం చెందాడు.
అంబులెన్స్‌ను ఢీకొట్టిన లారీ
డ్రైవర్ దుర్మరణం
నుజ్జునుజ్జు అయిన వాహనం
పరారైన లారీ డ్రైవర్
గోనెగండ్ల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అతి వేగానికి ఓ నిండు ప్రాణం బలి అయ్యింది. అంబులెన్స్‌ను లారీ ఢీకొన్న ఘటనలో అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈఘటన గోనెగండ్ల గ్రామ శివారులో మంగళవారం ఉదయం చోటుచేసుకు న్నట్లు సీఐ విజయభాస్కర్ తెలిపారు. వివరాలు.. ఎమ్మిగనూరు చెందిన షేక్ హుసేన్(31) 11 ఏళ్లుగా డ్రైవర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య హసీనా, తల్లిదండ్రులు ఉన్నారు. కొన్ని నెలలు క్రితం స్వంతంగా అంబులెన్స్‌ను కొని దానికి తానే డ్రైవర్‌గా ఉన్నాడు. ఎమ్మిగనూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రోగులను రోజు కర్నూలు అసుపత్రికి తరలించే వాడు. మంగళవారం తెల్లవారుజామున మెడికవర్ ఆసుపత్రి నుంచి రోగిని కర్నూలు ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ రోగిని చేర్చి తిరిగి ఎమ్మిగనూరుకు బయలు దేరాడు. ఉదయం 7గంటల సమయంలో గోనెగండ్ల దగ్గర ఉన్న భారత్ గ్యాస్ గోడౌన్ దగ్గరకు రాగానే ఎదురుగా మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డల లోడ్‌తో కర్నూ లుకు వెళ్తున్న లారీ(ఎంహెచ్ డీక్యూ 9693) ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను అతివేగంగా వచ్చి ఢీకొన్నది. ఈ సంఘటనలో అంబులెన్స్ నుజ్జునుజ్జు అయింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ షేక్ హుసేన్‌కు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. పరిసర ప్రాంతాల వారు గాయాల పాలైన హుసేన్‌ను ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీ ఉండటంతో లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.