నేలకొరిగిన మావోయిస్టు సభ్యుడు నాగన్న
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:01 AM
ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న నల్లమల ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి అడుగిడిన సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ సుగులూరు నాగన్న (57) చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని చౌకీ జిల్లాలో గల రాజ్‌నంద్ గావ్ - కాంగేర్ సరిహద్దులో బుధవారం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగారు.
చత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో హతం
22ఏళ్ల వయస్సులోనే ఉద్యమ బాటలోకి
ఆయన స్వగ్రామం వడ్లరామాపురం
విప్లవ సాహిత్యానికి ఆకర్షితులై...
ఆత్మకూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న నల్లమల ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ ప్రాంతం నుంచి మావోయిస్టు ఉద్యమంలోకి అడుగిడిన సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ సుగులూరు నాగన్న (57) చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని చౌకీ జిల్లాలో గల రాజ్‌నంద్ గావ్ - కాంగేర్ సరిహద్దులో బుధవారం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నేలకొరిగారు. నల్లమల కేంద్రంగా సాగిన అనేక దళాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారు. సుమా రు మూడున్నర దశాబ్దాల పాటు ఉద్యమంలో కీలక వ్యవహరిస్తూ వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అక్కడి దండకారణ్యంలో మావోయిస్టులకు, పోలీసుల జరిగిన పరస్పర కాల్పుల నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌లో ఆయన హతమయ్యారు.
విప్లవ సాహిత్యానికి ఆకర్షితులై...
ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామానికి చెందిన సుగులూరి దానమయ్య, దానమ్మ దంపతుల కుమారుడైన చిన్నన్న మావోయిస్టు పార్టీ వైపు అడుగులు వేయాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. దానమయ్య దంపతులకు మొత్తం నలుగురు కొడకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నాయి. వీరిలో రెండో కుమారుడైన చిన్నన్న ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. ఆతర్వాత గ్రామంలోనే పట్టుపురుగుల బుట్టలు, తడికలు అల్లుకుని జీవనం సాగిం చేవారు. ఆసమయంలోనే సాధారణ గ్రామ రైతు కూలీ సంఘం సభ్యుడిగా కొనసాగారు. ఈ క్రమంలోనే 1988లో కొత్తపల్లి మం డలంలోని దుద్యాల గ్రామానికి చెందిన సరోజమ్మను వివాహం చేసుకున్నారు. ఈయనకు క్రాంతికుమార్, రామకృష్ణ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఆ సమయంలో తరుచూ అటవీశాఖ అధికారులు దళితులను చిత్రహింసలకు గురిచే యడం, తప్పుడు కేసులు బనాయించడం కారణాలతో మావోయి జం వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సందర్భం లోనే నల్లమలను కేంద్రంగా చేసుకుని అటవీ సమీప గ్రామాల్లో మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగించేవారు. ఈ క్రమంలో వడ్లరామాపురం గ్రామానికి రాత్రివేళల్లో నక్సల్స్ చేరుకుని విప్లవ సాహిత్యంతో యువతను ఆకర్షించేవారు. ఇందులో భాగంగానే 22ఏళ్ల చిరుప్రాయంలోనే ఆయన మావో యిస్టు ఉద్యమంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇటీవల వడ్లరామాపురంలో పర్యటించిన చత్తీస్‌ఘడ్ బలగాలు
దేశంలో మావోయిస్టు ఏరివేతపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మే 10,11,12 ఆపరేషన్ కగార్ పేరుతో తేదీల్లో చత్తీస్‌ఘడ్‌లోని అబూజ్‌మడ్ అడవుల్లో పోలీసులు కాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరూ ఊహించని విధంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. ఈ ఘటనలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం ములుగుగుంద గ్రామానికి చెందిన సంగీత అలియాస్ లలిత అనే మహిళా మావోయిస్టు మరణించారు. ఆ సమయంలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న సుగులూరు చిన్నన్న ఆ ఘటనలో తప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయన గురించి చత్తీస్‌ఘడ్ పోలీసులు మే 13న ఆత్మకూరు మండలంలోని వడ్లరామాపురం గ్రామానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పూర్వ వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే ఆయనను పట్టిస్తే రూ.25 లక్షల రివార్డును కూడా చత్తీస్‌ఘడ్ పోలీసులు ప్రకటించారు. మొత్తానికి సుగులూరు చిన్నన్న బ్రతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం నెలకొంది. అయితే సరిగ్గా మూడు నెలల్లోపే ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం చిన్నన్న భార్య, కొడుకులు కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామంలో నివాసం ఉండగా, ఆయన సోదరులు రాజగోపాల్, రవిచంద్రబాబు, భూపాల్‌లు వడ్లరామాపురం గ్రామంలోనే ఉంటున్నారు. 20ఏళ్ల క్రితం చర్చల సమయంలో ఒకసారి మాత్రమే ఆయన కుటుంబ సభ్యులతో కలిసినట్లు తెలిసింది. అప్పటి నుంచి నేటి వరకు ఆచూకీ లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మృతదేహం కోసం కుటుంబ సభ్యుల ప్రయత్నం
చత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు సుగులూరి చిన్నన్న మృతదేహం కోసం ఆయన కుమారులు క్రాంతికుమార్, రామకృష్ణలు నంద్యాల జిల్లా ఎస్పీ ఆధిరాజ్‌సింగ్ రాణాను సంప్రదించినట్లు తెలిసింది. వారి వివరాలను సమర్పించి చత్తీస్‌ఘడ్‌కు వెళ్లి తండ్రి మృతదేహాన్ని స్వగ్రామమైన వడ్లరా మాపురానికి తీసుకురావాలని వారు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వడ్లరామాపురం గ్రామానికి వెళ్లే రహదారిపై భవనాశి ఉధృతంగా ప్రవహించడంతో వారి సోదరులు గ్రామం నుంచి బయటకు రాలేకపోతున్నారు. వారు కూడా చిన్నన్న మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.